Share News

Etela Rajender: ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టారు

ABN , First Publish Date - 2023-12-09T16:35:30+05:30 IST

Telangana: ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Etela Rajender: ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టారు

హైదరాబాద్: ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ (BJP Leader Etela Rajender) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తమపై నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో నాలుగు స్థానాలు గెలిపించారని.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు (BRS) ప్రత్యామ్నాయం బీజేపీనే అని నిరూపించారన్నారు. మోడీ గత తొమ్మిది సంవత్సరాల పాటు భద్రత, భరోసానే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశ గొప్పతనాన్ని చాటిన వ్యక్తి అని కొనియాడారు. కరోనాను తట్టుకుని ఆర్థిక పురోగతి సాధిస్తున్న దేశం భారత్ దేశం అని చెప్పుకొచ్చారు. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని.. వాటిని ఆదుకున్న వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. మోడీ వచ్చిన తర్వాత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో కాల్పులు తగ్గిపోయాయన్నారు.


భారతదేశం బార్డర్‌లో ఇంచు స్థలం కూడా కబ్జా కాకుండా జెండాలు పాతిన వ్యక్తి మోడీ అని కొనియాడారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మిగతా రాష్ట్రాలలో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారన్నారు. రేపు పార్లమెంట్‌లో 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు. అయోధ్యలో అందరినీ ఒప్పించి రామాలయం కట్టిస్తున్న వ్యక్తి మోడీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే అని చెప్పుకొచ్చారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

Updated Date - 2023-12-09T16:55:24+05:30 IST