Share News

మెడికోల ఎగ్జామ్స్‌ వీడియో రికార్డింగ్‌

ABN , First Publish Date - 2023-11-20T04:09:53+05:30 IST

వైద్య విద్యార్ధులు రాసే పరీక్షలను ఇక నుంచి వీడియో రికార్డింగ్‌ చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయించింది.

మెడికోల ఎగ్జామ్స్‌ వీడియో రికార్డింగ్‌

మార్గదర్శకాలు విడుదల చేసిన పీజీఎంఈబీ

తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి

పరీక్షా హాల్‌ను తనిఖీ చేసే విధానానికి స్వస్తి

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) వైద్య విద్యార్ధులు రాసే పరీక్షలను ఇక నుంచి వీడియో రికార్డింగ్‌ చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీలో భాగమైన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ (పీజీఎంఈబీ) తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే దీన్ని అమలు చేయనుంది. అన్ని మెడికల్‌ కాలేజీలు, వైద్యవిద్యా సంస్థలు పీజీఎంఈబీ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. పరీక్షల ప్రక్రియనంతా తప్పనిసరిగా రికార్డు చేయాలని, అలాగే విద్యార్ధుల థీసి్‌సను కూడా భద్రపరచాలని స్పష్టం చేసింది. దీంతో ఇక నుంచి పరీక్ష హాల్‌ను ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ తనిఖీ చేసే విధానం ఉండబోదని తెలిపింది. ఇక నుంచి కొత్త విధానాన్నే మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు అనుసరించాలని స్పష్టం చేసింది.

ఘోస్ట్‌ ఫ్యాకల్టీ కట్టడికి అబాస్‌ విధానం

వైద్యవిద్య కళాశాలల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీని సంపూర్ణంగా కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు (అబాస్‌) విధానాన్ని అన్ని మెడికల్‌ కాలేజీలు పాటించాలని జాతీయ వైద్యకమిషన్‌ మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అన్ని మెడికల్‌ కాలేజీలకు లేఖలు రాసింది. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు చేసే సమయానికి ముందే అబాస్‌ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు అనుమతులకు అబాస్‌ విధానాన్ని తప్పనిసరి చేశారు. అబాస్‌ ఉంటేనే అనుమతులిస్తామని ఎన్‌ఎంసీ స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అబా్‌సపై మార్గదర్శకాలను కూడా ఎన్‌ఎంసీ ఇప్పటికే విడుదల చేసింది. వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ, రెసిడెంట్స్‌, ఇతర సపోర్టింగ్‌ స్టాఫ్‌ ముఖ గుర్తింపు హాజరును అబా్‌సతో అనుసంధానం చేస్తారు. అది ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌కు లింక్‌ అయి ఉంటుంది. మెడికల్‌ కాలేజీ డ్యాష్‌బోర్డులో కూడా ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది హాజరు రోజూ కనిపించాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

Updated Date - 2023-11-20T07:21:04+05:30 IST