Share News

ఓటరు తీర్పు సుస్పష్టం!

ABN , First Publish Date - 2023-11-29T04:17:22+05:30 IST

ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలనే విషయంలో ఓటరు స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు.

ఓటరు తీర్పు సుస్పష్టం!

ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకున్న ఓటరు!.. అభ్యర్థులు, పార్టీలపై స్పష్టమైన వైఖరి

బహిరంగంగా అభిప్రాయాల వ్యక్తీకరణ

పోలింగ్‌కు ముందే తేలుతున్న అభ్యర్థుల భవితవ్యం

‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలనే విషయంలో ఓటరు స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు. ఏ పరిణామాలు ఎలా జరిగినా తన నిర్ణయంలో మార్పు రానంతగా స్పష్టతకు వచ్చాడు. పైగా ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నాడు. ఇంతకాలం గుంభనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఓటరు... ఇప్పుడు గొంతెత్తి చెబుతున్నాడు. కళ్లల్లో భయం, ఒంట్లో బెదురు, ఎవరు ఏమనుకుంటారోననే మొహమాటం లేకుండా.. తన మనోగతాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తమ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? రాష్ట్రంలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయి? ఏ పార్టీ ఓడిపోతుంది? ప్రస్తుత ప్రభుత్వం నిలబడుతుందా? పడిపోతుందా? అనే అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు విశ్లేషణ చేస్తున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల స్వపరిపాలనపై క్షేత్రస్థాయిలో మంచి చెడులపై విశ్లేషణ జరుగుతుండటం గమనార్హం. సహజంగా పోలింగ్‌, కౌంటింగ్‌ ముగిసిన తర్వాత.. అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది. కానీ, ఈసారి ఓటరు రూటు మార్చాడు. అభ్యర్థుల భవితవ్యాన్ని ముందస్తుగానే తేల్చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముచ్చటగా మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో... హ్యాట్రిక్‌ విజయం కోసం బీఆర్‌ఎస్‌, ఒక్క ఛాన్స్‌కోసం కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ కూడా కొన్నిచోట్ల ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి.. రకరకాల సర్వేలు, ఎడతెగని విశ్లేషణలు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశంపై నిత్యం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ’ఆంధ్రజ్యోతి’ క్షేత్ర పరిశీలనలో ఓటర్ల నుంచి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా జరిగితే... ఫలితం అలా ఉంటది! అనే డొంక తిరుగుడు లేకుండా... సూటిగా, సుస్పష్టంగా ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఓటర్ల మనోగతం ఇలా..

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన దస్తగిరి... తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్ల పాటు ఒక ప్రధాన పార్టీలో క్రియాశీల నాయకుడిగా పనిచేశారు. కానీ, ఎలాంటి ప్రభుత్వ సాయమూ అందలేదు. ఇద్దరు కొడుకుల చదువుల కోసం ఇల్లు అమ్ముకున్నాడు. అద్దె ఇంట్లో నివాసముంటూ.. రోడ్డు పక్కన మరో చిన్న గది అద్దెకు తీసుకొని టైలరింగ్‌ చేస్తున్నాడు. దస్తగిరిని ‘ఆంధ్రజ్యోతి’ కదిలించగా.. పావుగంటపాటు నిర్మొహమాటంగా తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కారు. రెండు టర్ముల కేసీఆర్‌ పాలన, సిటింగ్‌ ఎమ్మెల్యే పనితీరుపై విభిన్న కోణాల్లో విశ్లేషణ చేశారు. పాలకులపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని వివరించారు. వంటగ్యాస్‌ ధరను ఇన్నాళ్లుగా ఎందుకు తగ్గించలేదని, ఆర్థిక సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఎందుకు హామీలు ఇస్తున్నారని నిలదీశారు.

సూర్యాపేట నియోజకవర్గంలోని గట్టికల్లు గ్రామానికి చెందిన ఓ యువకుడు మాట్లాడుతూ... ఓటింగ్‌పై నిరుద్యోగులు, యువకుల ఆలోచన విధానం స్పష్టంగా ఉందని తెలిపారు. ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఒక పార్టీకి మద్దతుగా, ఉద్యోగ అవకాశాలు రాని కుటుంబాలు మరో పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే అంశంపై చివ్వెంల మండలానికి చెందిన సైదులు చక్కని విశ్లేషణ చేశారు. బీఆర్‌ఎస్‌ రెబల్‌ నేత, బీఎస్పీ నుంచి పోటీ చేయడంతో.. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో? ఏ అభ్యర్థికి లాభం జరుగుతుందో.. తాము ఎవరివైపు నిలబడతామో స్పష్టంగా వెల్లడించారు. పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన సైదులు అనే గీత కార్మికుడు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో వ్యవసాయానికి బోర్లు తప్ప.. సాగునీటి ప్రాజెక్టులు, కెనాల్స్‌ లేవని తెలిపారు. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులన్నీ ఒకే చోట, ఒకే ప్రాంతంలో ఖర్చు చేశారని, వికేంద్రీకరణ చేయలేదని చెప్పారు. తాను ఓటేసేది ఏ పార్టీకో, అక్కడ గెలిచే పార్టీ ఏదో సైదులుగౌడ్‌ స్పష్టంగా వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలోని ఒక గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నానని, ప్రజల నాడి చూస్తుంటే ఈసారి ‘తమ పార్టీ అభ్యర్థి’ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ అభ్యర్థి బలమేంటి? బలహీనతలు ఏంటి? ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలవటానికి దోహదపడుతున్న అంశాలేంటి? అనే వివరాలపై సదరు సర్పంచి చక్కని విశ్లేషణ చేశారు. ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రామస్థాయి నేతలిరువురూ ఒకేచోట ఉన్నారు.

ఫ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటకు చెందిన నవీన్‌ అనే యువకుడు మాట్లాడుతూ... తనకు ఒకసారి యాక్సిడెంట్‌ జరిగిందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే.. రూ.60 వేలు మంజూరయ్యాయని తెలిపారు. అయితే స్థానిక రాజకీయ నాయకులు ఆ చెక్కును తనకు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులపై గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను నవీన్‌ కళ్లకు కట్టినట్లు వివరించారు. దళితబంధు, మూడెకరాల భూ పంపిణీ హామీలపై ఎస్సీ సామాజికవర్గ ఓటర్లు ఆలోచిస్తున్నారని నవీన్‌ తెలిపారు. క్రిష్ణాజివాడి గ్రామానికి చెందిన నర్సయ్య అనే వృద్ధుడు మాట్లాడుతూ.. బస్‌ చార్జీలు, కరెంటు చార్జీలు, వంటనూనెలు ఇతర నిత్యావసర వస్తువుల చార్జీలన్నీ విపరీతంగా పెరిగాయని, ఒంటరి వాళ్లకు పింఛను డబ్బులు సరిపోవటంలేదని తెలిపారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో పోటీపడుతున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల వ్యవహారశైలి, పనితీరు, నడవడికపై ఆ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమోతు భాస్కర్‌రావు చేసిన పనులేమిటి? పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేస్తారు? కీలక సమయంలో ఊళ్లకు ఊళ్లను గంపగుత్తగా ఎలా మళ్లిస్తారో... దామరచర్లకు చెందిన ప్రసాదరావు, కిశోర్‌.. కొత్తగూడెం గామ్రానికి చెందిన జానయ్య అనే వ్యాపారులు స్పష్టంగా వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి బలాబలాలేంటి? సొంత మేనిఫెస్టో ఎలా అమలుచేశారు? సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఎలా దగ్గరయ్యారో విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశాన్ని కూడా సదరు కిరాణా వ్యాపారులు స్పష్టంగా చెప్పారు. వాడపల్లి, కిష్టాపురం, బత్తులపాలెం, కొండ్రపోల్‌, రెడ్డిబావి, యాదగిరిపల్లి, ఏదులగూడెం.. బెల్టులో వార్‌ వన్‌సైడ్‌! అన్నట్లుగా ఎన్నికల వాతావరణం కనిపించింది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వంగపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ద్వితీయశ్రేణి నాయకుడికి గతంలో సర్పంచిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తుంటే... తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి 3- 4 స్థానానికి పడిపోతారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాను తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకోసం పనిచేస్తున్నానని, కానీ పలానా పార్టీకి చెందిన అభ్యర్థే తమ నియోజకవర్గంలో గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఫ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండకు చెందిన గంగాధర్‌ అనే వ్యవసాయ కూలీని ’ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. పదేళ్ల పాలనలో రైతులకు కలిగిన లాభాలు, నష్టాలను వివరించారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను సర్కారు పట్టించుకోలేదని చెప్పారు. ఉచిత హామీలు కాకుండా... పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇస్తూ పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోపాటు తమ నియోజకవర్గంలో సాను భూతి ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు.

జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలంలో దళితబంధు పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసింది. 1,524 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. ఇది రిజర్వుడు నియోజకవర్గం. అయితే బిచ్కుంద, మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం తదితర మండలాల్లో ఈ అంశంపై లోతుగా సమీక్ష జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గంలో.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు బాహాటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పోడు భూములకు పట్టాలు రాలేదని చెప్పారు. ద్వితీయ శ్రేణి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-11-29T04:17:23+05:30 IST