Share News

పైసలు మావి.. ప్రచారం మీది

ABN , First Publish Date - 2023-11-20T04:30:07+05:30 IST

సూపర్‌ హిట్‌ హిందీ సినిమా ‘దీవార్‌’లో.. ‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ ఓ డైలాగ్‌ చెప్తాడు గుర్తుందా? తన దగ్గర ఆస్తులు, బంగ్లా, కార్లు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అన్నీ ఉన్నాయని అమితాబ్‌ బచ్చన్‌ అంటే..

పైసలు మావి.. ప్రచారం మీది

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో పార్టీల ఒప్పందాలు

వారి ద్వారా యువ ఓటర్లను ఆకట్టువడమే ప్రధాన లక్ష్యం

2024 జనరల్‌ ఎలక్షన్స్‌ టార్గెట్‌.. ఈ ఎన్నికలు శాంపిల్‌!

పోస్ట్‌కు రూ.5 వేల రూపాయల నుంచి లక్షల్లో చెల్లింపులు

రీల్స్‌, యూట్యూబ్‌ పోస్ట్‌లతో ఇన్‌ఫ్లూయెన్సర్ల హంగామా

సూపర్‌ హిట్‌ హిందీ సినిమా ‘దీవార్‌’లో.. ‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ ఓ డైలాగ్‌ చెప్తాడు గుర్తుందా? తన దగ్గర ఆస్తులు, బంగ్లా, కార్లు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అన్నీ ఉన్నాయని అమితాబ్‌ బచ్చన్‌ అంటే.. శశికపూర్‌ నింపాదిగా.. ‘నా దగ్గర అమ్మ ఉంది’ అని బదులిస్తాడు! ఆ సీన్‌లో అమితాబ్‌లాగా కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర డబ్బు, హంగు, ఆర్భాటం అన్నీ ఉండొచ్చుగాక.. కానీ, మాస్‌ లీడర్ల స్థాయిలో జనబలం ఉండదు. అలాంటివారంతా ఎన్నికల్లో ఓట్ల కోసం.. సబ్‌స్ర్కైబర్లు, ఫాలోయర్ల బలం ఉన్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా చెప్పించే ఏ విషయమైనా నేరుగా ఓటరు మనసులోకి వెళ్తుందన్నది నాయకుల థీరీ. ఇటీవల ‘గుగూల్‌- కాంటార్‌ ఇండియా’ విడుదల చేసిన నివేదిక ప్రకారం మనదేశంలో దాదాపు 75.2 కోట్ల మంది యాక్టివ్‌ ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా వినియోగదారులు వార్తలను ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. వారిలో 45% మంది.. టీవీ చానళ్లతో పోలిస్తే ఆన్‌లైన్‌ ద్వారా సరఫరా అయ్యే సమాచారం త్వరగా ప్రజలకు చేరుతుందనే భావనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా.. మొబైల్‌ ఫోన్లకే అంకితమైనట్లుగా ఉంటున్నఈ తరం కుర్రాళ్లలో చాలామంది కొత్తగా ఓటు వచ్చిన వారు, యువతరం.

వీరిలో చాలామంది ప్రైమ్‌టైమ్‌ న్యూస్‌ను టీవీ చానల్స్‌లో చూడరు. పొద్దుటే పేపర్‌ కూడా చదవరు. వారిని చేరుకోగలిగే ఏకైక మార్గం.. సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లే. అందుకే పలు పార్టీల అభ్యర్థులు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల వైపు దృష్టి సారిస్తున్నారు. తమదైన రీతిలో కంటెంట్‌ సృష్టించి ఆకట్టుకునే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే మాటలను వారి అభిమానులు, ఫాలోయర్లు నమ్ముతారని భావిస్తున్నారు. అందుకే.. ‘‘పనీపాటా లేక వీడియోలు, టిక్‌టాక్‌లు చేసుకుంటున్నారు’’ అంటూ ఒకప్పుడు అందరి హేళనకూ గురైనవారినే ఇప్పుడు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అంటూ పలు రాజకీయ పార్టీలు సగౌరవంగా అక్కున చేర్చుకుంటున్నాయి. యూట్యూబ్‌/ఇన్‌స్టా/ట్విటర్‌ వంటివాటిలో 10 వేలకు పైగా సబ్‌స్ర్కైబర్లు/ఫాలోవర్లు ఉంటే చాలు.. రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ వారిని తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరుతున్నాయి. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలకు ఇది ట్రయల్‌ వెర్షన్‌ అంటూ పలు జాతీయ పార్టీలు ఇప్పటికే ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆ హడావుడి తెలంగాణా ఎన్నికలలో ఇప్పటికే కనిపిస్తుండటం విశేషం.

ఉభయతారకం..

హైదరాబాద్‌లో దాదాపు 1100 మందికి పైగా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉన్నారని అంచనా. వీరంతా.. ట్రావెల్‌, టెక్‌, పాలిటిక్స్‌, గాడ్జెట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు. వారిలో 20 నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువ. ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లలో దాదాపు 150 మందికి 10 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. సంప్రదాయ ఉద్యోగాలను కాదని, వినూత్నంగా సంపాదించాలనే తలపు ఉన్న యువతలో అధిక శాతం సోషల్‌ మీడియానే ఆలంబనగా చేసుకుని దూసుకుపోతున్నారు. తమ ఫాలోవర్ల కోసం ఏదో ఒక కంటెంట్‌ రూపొందించడం నిన్నటి తరం ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తే.. తాము రూపొందించిన కంటెంట్‌ తమకు డబ్బు సంపాదించి పెట్టాలని నేటి తరం ప్రయత్నాలు చేస్తోంది. విజయమూ సాధిస్తోంది. అందులో భాగంగానే చాలా మంది ఇప్పడు పార్టీలతో ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తమ రీల్స్‌/షార్ట్స్‌/స్టోరీ్‌సలో సదరు రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార గీతానికి నృత్యం చేయడం, లేదా వారికి అనుకూలంగా ప్రచారం చేయడం ద్వారా తమ ఫాలోయర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకూ తమదైన లోకంలో విహరించిన ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు రాజకీయ పక్షాల చెంతన చేరడానికి కారణమేమిటంటే, డబ్బుతో పాటుగా తమ సబ్‌స్ర్కైబర్లు, ఫాలోవర్లు కూడా పెరుగుతారనే భావనే అని చెబుతున్నారు. ఉదాహరణకు.. తాను ఒక పార్టీకి, దాని యువ విభాగానిక అనుకూలంగా ఉండడం వల్ల తన సబ్‌స్ర్కైబర్ల సంఖ్య భారీగా పెరిగిందని.. ఒక యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్న మాజీ జర్నలిస్ట్‌ ఒకరు తెలిపారు.

సెలబ్రిటీలే కాదు.. సామాన్యులూ..

నిజానికి ఇదేం కొత్త కాన్సెప్ట్‌ కాదు. శీతలపానీయాలు, రియల్‌ఎస్టేట్‌, మద్యం కంపెనీల వంటివి తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సెలెబ్రిటీలను ఆశ్రయించినట్టే ఇది కూడా. కాకపోతే.. వారు రాష్ట్రం/దేశమంతటా తెలిసిన సెలబ్రిటీలు. వీరు తమ కంటెంట్‌తో సోషల్‌మీడియాలో సెలబ్రిటీలుగా ఎదిగిన సామాన్యులు. అంతే తేడా. పిండి కొద్దీ రొట్టె అన్న సామెత చందంగా.. ఫాలోయర్ల సంఖ్య ఆధారంగా వీరికి డిమాండు!!

హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి

అతడో ప్రముఖ యూట్యూబర్‌. అంబాజీపేట ఆముదం నుంచి అంటార్కిటికాలో పెంగ్విన్ల దాకా రకరకాల అంశాలకు సంబంధించిన ‘ఫ్యాక్ట్స్‌’ను తన యూట్యూబ్‌ చానల్‌లో చెబుతుంటాడు. కొన్నేళ్లుగా ఇదే పనిలో ఉన్న సదరు యూట్యూబర్‌.. రెండు నెలలుగా తన చానల్‌లో రాజకీయ పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడా తాను ఫలానా పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు చెప్పుకోడుగానీ.. చేస్తున్న పని అదే. ఒక్క యూట్యూబ్‌లోనే కాదు.. ట్విటర్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఇలా అన్నిచోట్లా చాలామంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లది ఇదే తీరు. పెద్ద ఎత్తున ఫాలోయర్లు, సబ్‌స్ర్కైబర్లు ఉన్న పలువురు సోషల్‌ మీడియా ప్రముఖుల ఖాతాలన్నింటిలోనూ ఇప్పుడు రాజకీయ వాసనలే! యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా.. రాజకీయ నాయకులు తమ ప్రచారానికి ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను వాడుకోవడమే ఇందుకు కారణం.

ఇన్‌ఫ్లూయెన్సర్లు.. నాలుగు రకాలు

..సాధారణంగా మెగా విభాగంలో సినీతారలు, క్రికెటర్ల వంటి వారు ఉంటారు. మన తెలుగులో ట్రావెల్‌, టెక్‌ యూట్యూబ్‌ చానళ్లు నడిపేవారిలో 10 లక్షలకు పై బడిన సబ్‌స్ర్కైబర్లు ఉన్న ‘సామాన్య’ మెగా సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఇక.. మ్యాక్రో విభాగంలో వినోద, గాడ్జెట్స్‌, టెక్‌ తదితర రంగాలకు చెందిన వారు ఉంటారు. అయితే, ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తున్న వారిలో నానో, మైక్రో, మాక్రో విభాగాల వారే ఎక్కువ. అదీ నేరుగా రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకుండా.. ఆ పార్టీ గురించిన సమాచారాన్ని తమ కంటెంట్‌లో పరోక్షంగా భాగం చేసి ప్రచారం చేస్తున్నారు. కొందరు నేరుగానే పేర్లు ప్రస్తావించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో అధిక భాగాన్ని అధికార పార్టీలే సొంతం చేసుకున్నాయని చెబుతున్నారు.

Updated Date - 2023-11-20T04:30:19+05:30 IST