Bandi Sanjay : బుల్డోజర్ ప్రభుత్వమా.. బాంచెన్ దొర సర్కారా?
ABN , First Publish Date - 2023-11-21T03:44:24+05:30 IST
‘‘యువకులారా.. మీరు శివాజీలవుతారా.. బాబర్‌లు అవుతారా..? రాష్ట్రంలో భూకబ్జాదారులపై బుల్డోజర్లు దించే ప్రభుత్వం కావాలా.. బాంచెన్ దొర ప్రభుత్వం కావాలా.? ఏది కావాలో మీరే తేల్చుకోండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన

మీరు శివాజీలవుతారా.. బాబర్‌లు అవుతారా
తెలంగాణ యువకులారా మీరే తేల్చుకోండి
రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే రామరాజ్యం
వారాణసీలా వేములవాడ అభివృద్ధి
మోదీ మాట ఇచ్చారు.. వర్గీకరణ జరుగుద్ది
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంజయ్
ఆదిలాబాద్/వేములవాడ/భగత్‌నగర్, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): ‘‘యువకులారా.. మీరు శివాజీలవుతారా.. బాబర్‌లు అవుతారా..? రాష్ట్రంలో భూకబ్జాదారులపై బుల్డోజర్లు దించే ప్రభుత్వం కావాలా.. బాంచెన్ దొర ప్రభుత్వం కావాలా.? ఏది కావాలో మీరే తేల్చుకోండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటి నుంచి శివాజీ, లక్ష్మీభాయి, కొమురం భీమ్, అంబేడ్కర్ వస్తే తప్ప తెలంగాణలో హిందువులు బతికే పరిస్థితులు లేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించాలని సవాలు చేశారు. ‘‘కేసీఆర్‌కు ఆ దమ్ము ఉందా’’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో బండి సంజయ్ ప్రసంగించారు. బిహార్‌లో కేవలం 12ు ముస్లింలు ఉంటే ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచిందని, తెలంగాణలో 80ు హిందువులున్నారు కాబట్టి బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలో ఆలోచించాలని ప్రజలను కోరారు. కేటీఆర్ సీఎం అయితే హరీశ్‌రావు, కవిత, సంతో్‌షరావు పనైపోతుందన్నారు. ‘‘ఇన్నాళ్లు భూములమ్మి ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్..
ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తారట. ఇళ్లు లేని వారే ఉండరంటే పేదలందరినీ పాకిస్థాన్‌కు తరిమేస్తాడేమో’’ అని సంజయ్ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఓబీసీ, రైతుల పోడు భూములను అటవీ శాఖ కబ్జా చేస్తోందని ఆరోపించారు. కులాల పేరుతో రాజకీయం చేసి ఓట్లు దండుకుని అదే కులాలను మోసం చేసిన ఘనత కేసీఆర్‌దన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం అవుతారని తెలిపారు. ఏ సర్వే చూసినా ఆదిలాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండేనని స్పష్టం అవుతోందని చెప్పారు. పోరాడే వాళ్లకు ఓట్లేసి గెలిపించుకోకపోతే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా పేదల పక్షాన పోరాడే అవకాశం ఉండదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చింది మోదీ ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే వేములవాడను వారాణసీలా అభివృద్ధి చేస్తామని సంజయ్ అన్నారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికా్‌సరావుకు మద్దతుగా సోమవారం వేములవాడలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీని వేములవాడకు తీసుకొస్తానని చెప్పారు. కేసీఆర్‌కు రాజన్న గుడి మీద నమ్మకం లేదని, గుడి లోపల ఉన్న దర్గా మీద మాత్రమే విశ్వాసం ఉందని చెప్పారు. రాజన్న గుడి అభివృద్ధికి ఇస్తామన్న రూ.400 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అవినీతి మచ్చలేని విద్యాసాగర్‌రావు వారసుడు వికా్‌సరావును వేములవాడ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని సంజయ్ ప్రజలను కోరారు.
కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నా
తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నానని కరీంనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అవుతాడని తెలిపారు. మోదీ మాట ఇస్తే ఎస్సీ వర్గీకరణ తప్పకుండా జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు, ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వని మంత్రి గంగుల కమలాకర్‌కు కరీంనగర్‌లో ఓట్లు అడిగే అర్హత లేదని సంజయ్ ఈ సందర్భంగా విమర్శించారు. కరీంనగర్‌లో మార్పు కోసం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.