RS Praveen : పదేళ్లుగా రాష్ట్రానికి గులాబీ తెగులు
ABN , First Publish Date - 2023-11-21T02:53:05+05:30 IST
ఒకే పంటను పదేళ్లు సాగుచేస్తే భూసారం తగ్గి పంటకు తెగులు పడుతుందని, అప్పుడు పంట మార్పిడి చేయాలని అధికారులు చెబుతారని.. అలాగే

దానిని తొలగించి బహుజన పంటను నాటాలి
కేసీఆర్ పేదల భూములు కొట్టేశారు: ఆర్‌ఎస్ ప్రవీణ్
గాలి దుమారానికి కూలిన టెంట్.. పలువురికి గాయాలు
వేములవాడ టౌన్, నవంబరు 20 : ఒకే పంటను పదేళ్లు సాగుచేస్తే భూసారం తగ్గి పంటకు తెగులు పడుతుందని, అప్పుడు పంట మార్పిడి చేయాలని అధికారులు చెబుతారని.. అలాగే తెలంగాణకు పదేళ్లుగా గులాబీ తెగులు పట్టిందని, వెంటనే బహుజన పంటను నాటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వేములవాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ, జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. వేములవాడలో ఆశీర్వాద సభకు వచ్చిన బహుజనుల గాలితో టెంట్ కూలిపోయిందని, రాబోయే రోజుల్లో బహుజనులు సృష్టించే సుడిగాలిలో కేసీఆర్ ప్రభుత్వం కూకటివేళ్లతో కూలిపోతుందని అన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు 35 వేల ఎకరాల దళితుల భూమిని కబ్జా చేశారని, దళితులకు మూడు ఎకరాలు అని మోసం చేశారని మండిపడ్డారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే భూమి లేని ప్రతీ ఒక్కరికి ఎకరం భూమి ఇస్తామని చెప్పారు. 10 లక్షలు ఉద్యోగాల్లో 5 లక్షలు మహిళలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, వేములవాడ సభలో బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో గాలి దుమారం లేవడంతో టెంట్లు కూలిపోయాయి. దీంతో మహిళలపై పైపులు పడి 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు.