Share News

2 thousand notes : పింకు నోటు.. లేక లోటు..

ABN , First Publish Date - 2023-11-21T03:32:23+05:30 IST

రెండు వేల రూపాయల నోటు రద్దు.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది! ప్రచార ఖర్చులకు, ఓటర్లకు పంపిణీకి.. రూ.2 వేల నోట్లయితే తరలించడం

2 thousand notes : పింకు నోటు.. లేక లోటు..

రూ.2 వేల నోట్లు లేకపోవడంతో అభ్యర్థులకు ఇబ్బందులు

రూ.500 నోట్లను పెద్ద ఎత్తున తరలించేందుకు అవస్థలు

రెండు వేల రూపాయల నోటు రద్దు.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది! ప్రచార ఖర్చులకు, ఓటర్లకు పంపిణీకి.. రూ.2 వేల నోట్లయితే తరలించడం నేతలకు చాలా సులభంగా ఉండేది. గత ఎన్నికల్లో అదే జరిగింది. కానీ, ఇప్పుడా నోట్లు లేకపోవడంతో రూ.500 నోట్లను పెద్ద ఎత్తున తరలించడానికి అవకాశం లేక అన్ని పార్టీల నాయకులూ ఇబ్బంది పడుతున్నారు. రూ.2 వేల నోట్ల కట్ట అంటే రూ.2లక్షలు. చిన్న బ్యాగులో 5 కట్టలు.. అంటే రూ.10 లక్షలు వేసుకుని ఈజీగా ఒకచోటు నుంచి మరొకచోటుకు తరలించేవారు. అదే.. రూ.500 నోట్ల రూపంలో రూ.10 లక్షలు తరలించాలంటే 20 కట్టలు కావాలి. కోటి రూపాయలు తరలించాలంటే 200 కట్టలు!! మరి కోట్లాది రూపాయలు తరలించాలంటే? అది చాలా కష్టమైన పని కావడంతో నాయకులు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పోలీసులు, కేంద్ర బృందాల విస్తృత తనిఖీల నేపథ్యంలో.. డబ్బు పంపిణీ చేయలేక సతమతమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ ఇబ్బంది ఏమిటని అసహనానికి లోనవుతున్నారు.

గతంలో 4 ఓట్లకు 2 నోట్లు..

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ చేయడానికి మద్యం, నగదు సమకూర్చుకుంటున్నారు. ప్రచారం ఎంత విస్తృతంగా చేసినప్పటికీ.. గెలుపుపై ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ రెండింటిని పంపిణీ చేయకుంటే ఓట్లు పడవనే భయంతో వాటిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. గతంలో ఇది కాస్త సులభంగా ఉండేది. ఒక ఇంటిలో నాలుగు ఓట్లు ఉంటే.. రెండు ‘పింకు(రూ.2వేల) నోట్లు ఇస్తే సరిపోయేదని.. ఇప్పుడు రూ.500 నోట్లు ఎనిమిది ఇవ్వాల్సి వస్తోందని రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి అనుచరుడు తెలిపారు. పంపిణీ సమస్య కంటే ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తీసుకురావడం తమకు పెద్ద సమస్యగా మారిందని, పోలీసులు అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-11-21T03:32:26+05:30 IST