Minister Harish Rao : తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న ఈటల
ABN , First Publish Date - 2023-11-21T03:02:40+05:30 IST
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి

ధరలు పెంచి మన పొట్ట కొట్టింది బీజేపీ
కమలం నేతలు వస్తే చీపుర్లతో తరమండి
కాంగ్రెస్ సర్కారు ఏర్పడితే కరెంట్ కష్టాలు
అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాం: హరీశ్
గజ్వేల్, నవంబరు 20: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మహా అయితే ఒకటో, రెండో సీట్లు వస్తాయని చెప్పారు. అధికారంలోకి రాని పార్టీ ఇచ్చే హామీలు నీటి మీద రాతలని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్ మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోలలో హరీశ్ మాట్లాడారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది బీజేపీ అని.. మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని ఒత్తిడి తెచ్చిందని, బీడీ కట్టలపై పుర్రె గుర్తును ఇచ్చి కార్మికుల పొట్ట కొట్టిందని పేర్కొన్నారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులను చీపురు కట్టలతో తరమాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఏడ్చిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. కరోనా సమయంలో మాట సాయానికి కూడా కాంగ్రెస్ నాయకులు రాలేదని, ఈ నెల 30 దాటితే ఒక్కరు కూడా కనబడరని చెప్పారు.
కరోనా సమయంలో తాము ఉప్పు, పప్పు, బియ్యం, ఇంటికి రూ.2,000 ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కొంత మంది కొత్తగా బిడ్డ.. బిడ్డ అంటూ చుట్టరికం కలుపుకుంటూ వస్తున్నారని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో అసెన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తామని హరీశ్ హామీ ఇచ్చారు. రేషన్ షాపుల్లో సోనా మసూరి బియ్యం, సౌభాగ్య లక్ష్మి ద్వారా ఇంటి యజమానురాలికి రూ.3,000, కోటి కుటుంబాలకు బీమా కల్పిస్తామని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌ఐఐసీకి భూములు ఇచ్చిన వారికి, ప్లాట్లు రాని వారికి 250 గజాల స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.