ఎన్నికల బరిలో గల్ఫ్ సంఘాల నేతలు
ABN , First Publish Date - 2023-11-20T04:35:05+05:30 IST
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. గల్ఫ్ సంఘాల నేతలు సైతం పోటీకి దిగడం విశేషం. ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే.. వీరంతా ఉమ్మడి కరీంనగర్,

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోటీకి యత్నాలు
ముగ్గురు నేతలకు టికెట్లు ఇచ్చిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. గల్ఫ్ సంఘాల నేతలు సైతం పోటీకి దిగడం విశేషం. ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే.. వీరంతా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారిలో ముగ్గురు నేతలకు ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడం విశేషం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి గల్ఫ్ బాధితుల అభ్యర్థిగా చెన్నమనేని శ్రీనివాస్ రావు, సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిళ్ల రవి గౌడ్, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భీ ఫారాలతో బరిలో దిగారు. అలాగే.. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు దొనికెని కృష్ణ సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే.. సిరిసిల్ల టికెట్‌ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆయనకు కేటాయించలేదు. దీంతో ఆయన ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆయనకు రిమోట్ గుర్తు కేటాయించింది. మరోవైపు.. కాంగ్రెస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి వేములవాడ నుంచి, బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు పన్నీరు నరేంద్ర జగిత్యాల నుంచి టెకెట్‌ను ఆశించారు. కానీ రెండు పార్టీలూ వీరికి టికెట్‌ను కేటాయించలేదు. ప్రవాసుల సమస్యలకు పాలకుల నుంచి శాశ్వత పరిష్కారం సాధించాలనే పట్టుదలతోనే తాము ఎన్నికల బరిలోకి దిగాలని భావించినట్టు వీరంతా చెబుతున్నారు.
జగిత్యాల-ఆంధ్రజ్యోతి