BJP JP Nadda : కాళేశ్వరం దోషులు జైలుకే
ABN , First Publish Date - 2023-11-20T03:20:44+05:30 IST
‘‘తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఇక్కడ కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తెల రాజ్యం నడుస్తోంది.

పేదల సొత్తును దోచుకున్న సీఎం కుటుంబం
బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి
కాంగ్రెస్ గ్యారెంటీలంటే అంతా అవినీతే
తెలంగాణలో కమలం వికసిస్తేనే అభివృద్ధి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
మహబూబ్‌నగర్/రంగారెడ్డి అర్బన్/చేవెళ్ల/మల్కాజిగిరి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఇక్కడ కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తెల రాజ్యం నడుస్తోంది. పేదల సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. రూ.32 వేల కోట్లతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపించి, దోషులను గుర్తించి జైలుకు పంపుతాం. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించే తీర్పునివ్వాలి. పేదల రాజ్యం కోసం బీజేపీని అధికారంలోకి తేవాలి. తెలంగాణలో కమలం వికసిస్తేనే అభివృద్ధి సాధ్యం’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో, మల్కాజిగిరిలో పార్టీ అభ్యర్థి రాంచందర్ రావుకు మద్దతుగా చేపట్టిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ పాలనలోలో అవినీతికి అంతులేకుండా పోయిందని, మియాపూర్‌లో 692 ఎకరాల భూమిని కాజేశారని, హైదరాబాద్ రింగు రోడ్డులో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దళిత బందు పథకంలో 30ు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం రూ.5 లక్షల కోట్ల నిధులిచ్చిందని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడం ద్వారా దక్షిణ భారతానికి ఎరువుల కొరతలేకుండా చేశారన్నారు. ఆరు గ్యారెంటీలంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీలంటే అవినీతి, కుటుంబ పాలన అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో జాబ్ క్యాలండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఆర్థికాభివృద్ధిలో భారత్ ఐదో స్థానం
ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలోనే భారతదేశం ఐదో స్థానంలో ఉందని, మూడో సారి మోదీకి అవకాశమిస్తే దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక అభివృద్ధి చెందిన మూడో దేశంగా తీర్చిదిద్దుతారని జేపీ నడ్డా అన్నారు. బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితిగా మారిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎంత మందికి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంటే.. ఆ నిధులను కేసీఆర్ కుంటుంబం దుర్వినియోగం చేస్తూ ప్రజలకు చేరనీయడం లేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే.. కేసీఆర్ ఆ ప్రయోజనం ప్రజలకు చేరనీయకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు.