Share News

Huzurnagar : కంచుకోట దక్కేనా!

ABN , First Publish Date - 2023-11-21T03:42:33+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ప్రాంతం. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సిమెంట్‌ పరిశ్రమలకు నిలయం. గ్రానైట్‌ రాళ్లు, కృష్ణమ్మ పరవళ్లు, పచ్చని ..

Huzurnagar : కంచుకోట దక్కేనా!

హుజూర్‌నగర్‌లో మళ్లీ పట్టు కోసం ఉత్తమ్‌ ఆరాటం

ఉప ఎన్నికలో ఓటమికి బదులు తీర్చుకునే పోరాటం

ఆధిపత్యం నిలుపుకొనేందుకు సైదిరెడ్డి ప్రయత్నం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నిక

స్థానిక నినాదంతో బరిలో బీజేపీ అభ్యర్థి శ్రీలతారెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ప్రాంతం. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సిమెంట్‌ పరిశ్రమలకు నిలయం. గ్రానైట్‌ రాళ్లు, కృష్ణమ్మ పరవళ్లు, పచ్చని పొలాలతో కళకళలాడే హుజూర్‌నగర్‌ నియోజకవర్గం.. ఇప్పుడు రాజకీయ మంటలతో హీటెక్కింది. ఓవైపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరోవైపు అధికార పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఇద్దరికీ ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు సాగుతోంది. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్‌.. పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్‌ఎస్‌.. ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి శ్రీలతారెడ్డి.. వీరికి గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

హుజూర్‌నగర్‌ - ఆంధ్రజ్యోతి : తొలుత అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న హుజూర్‌నగర్‌ను 1978లో రద్దుచేసి కొన్ని మండలాలను మిర్యాలగూడలో, మరికొన్ని మండలాలను అప్పట్లో కొత్తగా ఏర్పాటు చేసిన కోదాడ నియోజకవర్గంలో విలీనం చేశారు. ఆ తరువాత 2009లో హుజూర్‌నగర్‌ తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటివరకు కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌కు మారి ఆ ఎన్నికల్లో నాటి టీ(బీ)ఆర్‌ఎస్‌, టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థి, నేటి మంత్రి జగదీశ్‌రెడ్డిపై గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌.. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను హుజూర్‌నగర్‌లో నిలబెట్టగా.. ఆమెపైనా ఉత్తమ్‌ విజయం సాధించారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డిని బీఆర్‌ఎస్‌ పోటీకి దించగా.. ఉత్తమ్‌ మరోసారి గెలుపొందారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆపై జరిగిన ఉప ఎన్నికలో తన సతీమణి పద్మావతిని పోటీకి దించగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో బీ ఆర్‌ఎస్‌ తరఫున సైదిరెడ్డి మరోసారి బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ఆయనతో తలపడుతున్నారు. కాగా, ఈసారి బీజేపీ నుంచి చల్లా శ్రీలతారెడ్డి, సీపీఎం నుంచి మల్లు లక్ష్మి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పిల్లుట్ల రఘు సహా మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కంచుకోటలో ఉత్తమ్‌కు ప్రతిష్ఠాత్మకం..

నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో తాజా ఎన్నిక ఉత్తమ్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ ఏర్పాటయ్యాక టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్‌.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్నిక ఆయనకు అత్యంత కీలకంగా మారింది. దీంతో ఇందుకు తగ్గట్టుగానే ఆయన సిద్ధమయ్యారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌కు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనికితోడు నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉండడం ఉత్తమ్‌కు కలిసివచ్చే అంశం. 2019లో జరిగిన ఉప ఎన్నికలో పద్మావతిరెడ్డిఓటమి పాలైనా.. ఆమెకు 69,737 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలో అధికార పార్టీ అంగబలం, అర్థబలంతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు హుజూర్‌నగర్‌లో నెల రోజులపాటు తిష్ఠవేసి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించారని, ఆ ఎన్నిక కోసం రూ.100 కోట్లపైనే బీఆర్‌ఎస్‌ ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి.

బలమైన నేతగా ఎదిగిన సైదిరెడ్డి..

సిటింగ్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి 2018 ఎన్నికలతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినా.. అనతికాలంలోనే బలమైన నేతగా ఎదిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో 2018లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ సాధించుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గట్టిపోటీ ఇచ్చి7,466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఉత్తమ్‌ ఎంపీగా ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డిపై సైదిరెడ్డి సంచలన విజయం సాధించారు. గత నాలుగేళ్లుగా నియోజవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. హామీల అమలులో సఫలీకృతం అయ్యానన్న అభిప్రాయాన్ని కల్పించారు.

మహిళలు, యువ ఓటర్లపై శ్రీలతారెడ్డి గురి..

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీలతారెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశంచేశారు. బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ పట్టణ అధ్యక్షురాలిగా, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ ఏడాది అక్టోబరు మొదటివారంలోనే బీజేపీలో చేరి.. వెంటనే టికెట్‌ సాధించుకోగలిగారు. ఆర్థికబలం కలిగిన శ్రీలతారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత, మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-11-21T03:42:34+05:30 IST