Share News

ఖర్చు బారెడు.. తడిసి మోపెడు

ABN , First Publish Date - 2023-11-20T04:16:35+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. ప్రాంతాన్ని బట్టి..

ఖర్చు బారెడు.. తడిసి మోపెడు

లెక్క తప్పుతున్న ఎన్నికల ప్రచార వ్యయం.. రోజుకు రూ.20 నుంచి 50 లక్షల దాకా ఖర్చు

భారీగా పెరిగిన ఖర్చులతో అభ్యర్థుల బెంబేలు.. గ్రామాల్లో వ్యయం భరించని కిందిస్థాయి నేతలు

నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి ఎన్నికల వ్యయం మొత్తం రూ.40లక్షలలోపే ఉండాలంటున్న ఈసీ

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి మొత్తం ప్రచార ఖర్చు రూ.40 లక్షలలోపే ఉండాలని ఎన్నికల సంఘం చెబుతుండగా.. ఆ ఖర్చు కొందరు అభ్యర్థులకు ఒక్కరోజుకు కూడా చాలని పరిస్థితి ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. ప్రాంతాన్ని బట్టి.. పోటీని బట్టి అది మారుతోంది. జనరల్‌ స్థానాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుండగా.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఒకింత తక్కువగా ఉంటోంది. ఇది ప్రచార ఖర్చు మాత్రమే. పోలింగ్‌ తేదీకి ఒకటి రెండు రోజుల ముందు ఓటర్లకు చేసే డబ్బు పంపిణీ ఖర్చు దీనికి అదనం. ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేవరకూ.. అభ్యర్థులను ఏదో ఒక ఖర్చు వెంటాడుతూనే ఉంటోంది. ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల రథం, దానికి డీజే సౌండ్‌ బాక్స్‌లు, పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్స్‌, ఫ్లెక్సీలకు తప్పనిసరిగా ఖర్చుపెట్టాలి. అలాగే ర్యాలీలు నిర్వహిస్తే ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లకు అయ్యే పెట్రోల్‌, డీజిల్‌ వ్యయాన్ని భరించాలి. వీటికే రోజుకు సగటున రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఇది కాక.. నిత్యం తమతో ప్రచారానికి వచ్చేవారికి చెల్లించాల్సిన సొమ్ము మనిషికి సగటున రోజుకు రూ.200-500 దాకా ఉంటోంది. పెద్దగా ఖర్చు పెట్టని ఎంఐఎం లాంటి పార్టీకి సైతం ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం.

గతంలో పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తే డబ్బులివ్వకుండానే పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. సభలు, సమావేశాలకు ప్రజలను తరలించడానికే రోజూ రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పెడుతున్నారు. ఇది కాక వార్డుస్థాయిలో ప్రచారం చేసేందుకు అయ్యే ఖర్చులను అభ్యర్థులు బూత్‌స్థాయి నేతలకు ఇస్తున్నారు. ఒక్కో వార్డుకూ ఈ ఖర్చు దాదాపుగా రూ.10 వేల దాకా ఉంటోందని సమాచారం. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు.. వార్డ్‌ స్థాయి ప్రచారానికే రోజూ సుమారు రూ.20-25 లక్షల మధ్య ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో సగటున 200-250 వార్డులుంటాయి. అంటే వార్డు స్థాయిలో ప్రచారానికే రోజుకు గరిష్ఠంగా రూ.25 లక్షల దాకా ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు ఖర్చు చేస్తున్నట్టు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పేరున్న విపక్ష నేత పోటీ చేస్తున్న స్థానంలో అయితే.. అధికార పార్టీ అభ్యర్థి రోజువారీ ఖర్చు రూ.50 లక్షల దాకా ఉంటున్నట్టు సమాచారం. అలాగే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థి ఒకరు.. తన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ కార్యాలయాన్ని, అక్కడే ఓ వంటశాలను కూడా ఏర్పాటు చేశారు. నిత్యం అక్కడ సుమారు 50 మంది వరకు నేతలు, ముఖ్య కార్యకర్తలకు భోజనం చేస్తున్నారు. అలా.. ఒక్క భోజన ఖర్చే రోజుకు రూ.లక్షల్లో అవుతోంది.

భారమంతా అభ్యర్థులదే

సాధారణంగా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అంతా తామై వ్యవహరిస్తుంటారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికయ్యే వ్యయాన్ని వారే భరించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. గ్రామ స్థాయిలో అయ్యే ఎన్నికల ప్రచార వ్యయాన్ని ఇప్పుడు అభ్యర్థులే భరించాల్సిన పరిస్థితి. వారు ప్రచారానికి వచ్చినప్పుడు వారికి వేసే పూల దండలు, డీజే సౌండ్‌, డప్పులు, టపాసుల ఖర్చు అంతా ఇప్పుడు అభ్యర్థులే స్వయంగా పెట్టుకుంటున్నారని ఓ కార్యకర్త తెలిపారు.

హైదరాబాద్‌- ఆంధ్రజ్యోతి

మా వల్ల కాదు..

ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ పొందినవారిలో కొందరు ఆర్థిక స్థోమత లేక.. ఖర్చులు భరించలేకపోతున్నారు. ఉదాహరణకు.. ఉద్యమ కారుల కోటాలో ఒక విప్లవకారుడి కుమార్తెకు ప్రధాన పార్టీ ఒకటి రాజధాని పరిధిలో టికెట్‌ ఇచ్చింది. అయితే.. టికెట్‌ వచ్చిందన్న సంతోషం కంటే, రోజువారీ ఖర్చుతో ఆ అభ్యర్థి బెంబేలెత్తుతున్నారు. అలాగే.. రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేస్తున్నవారు, కొందరు బీసీ అభ్యర్థులు ఈ ఖర్చును తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ పరిస్థితిని అధికార పార్టీ అభ్యర్థుల కన్నా.. విపక్ష అభ్యర్థులే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2023-11-20T04:18:16+05:30 IST