Share News

BRS KCR : భూమాత కాదు.. భూమేత

ABN , First Publish Date - 2023-11-21T03:09:47+05:30 IST

ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేసి, భూమాత పోర్టల్‌ను తెస్తామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ అధికారంలోకొస్తే జరిగేది ‘భూమాత’నా? భూ ‘మేత’నా? అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం ..

BRS KCR : భూమాత కాదు.. భూమేత

ఆ పార్టీ వస్తే కరెంటును కాటగలుపుతరు

ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్‌ ఎందుకు

పార్టీ పెట్టారు? 2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు?

అది ఎమర్జెన్సీ రాజ్యం, దొంగల రాజ్యం

అభ్యర్థుల్లో రాయి ఎవరు? రత్నమెవరో? చూడండి

కమ్యూనిస్టులారా.. మీ ఓటును మోరీలో వేయొద్దు

బీఆర్‌ఎస్‌ని ఓడగొట్టుకుంటే ప్రజలే బాధపడతారు

కాంగ్రెస్‌ వస్తే మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తది

మేం అధికారంలోకి రాగానే ఇల్లు లేని మనిషి లేకుండా చేస్తాం.. ఆటోలకు ఫిట్‌నెస్‌ ఫీజు రద్దు

నల్లగొండ, నకిరేకల్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, మానకొండూరు సభల్లో కేసీఆర్‌

నల్లగొండ, కరీంనగర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేసి, భూమాత పోర్టల్‌ను తెస్తామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ అధికారంలోకొస్తే జరిగేది ‘భూమాత’నా? భూ ‘మేత’నా? అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ధరణి ఉండటంతోనే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా, ఏకాణా లంచమివ్వకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రైతుబంధు కింద రూ.లక్ష వచ్చిన రైతు నుంచి రూ.30వేలు లంచం అడుగుతారని హెచ్చరించారు. కాంగ్రె్‌సను నమ్మి ఓటేస్తే మళ్లీ వీఆర్వోల వ్యవస్థ వస్తుందని, అప్పుడు రైతుల పరిస్థితి వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లే అవుతుందని పేర్కొన్నారు. కర్ణాటకలో సాగుకు ఐదు గంటలు కరెంటు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రంగారెడ్డి జిల్లాలో ప్రచారానికొచ్చి చెప్పారని, మూడు గంటలు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే కరెంటును కాట గలుపుతది (నాశనం చేస్తది) అని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టాల్సొచ్చింది? ఆయన అధికారంలోకొచ్చాక రెండు రూపాయలకే కిలో బియ్యం ఎందుకు ఇవాల్సొచ్చింది? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకలు, మాడే డొక్కలు, అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసుడు, ప్రభుత్వాలను కూలగొట్టుడే అని విమర్శించారు.

ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థుల్లో రాయి ఎవరు? రత్నమెవరు? ప్రజల కోసం ఎవరేం చేస్తారు? అనేవి ఆలోచించి ఓటు వేయాలని.. తెలంగాణలో గత పదేళ్ల ప్రగతిని చూసి బీఆర్‌ఎ్‌సకే ఓటు వేయాలని కోరారు. గెలిచే అభ్యర్థి మంచివాడైతేనే సుపరిపాలన జరుగుతుందని, ఓటు అనేది ఆయుఽధం అని, దాన్ని దుర్వినియోగం చేస్తే ఐదేళ్లపాటు ప్రజలు గోసపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా నల్లగొండ, నకిరేకల్‌.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌.. కరీంనగర్‌ జిల్లా మానుకొండూర్‌ నియోజకవర్గాల్లో అక్కడి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ నుంచి కేసీఆర్‌ కన్నా పొడుగ్గా ఉన్న వాళ్లూ సీఎంలు అయ్యారని.. వారంతా మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు గురించి ఆలోచించలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లలో లేని కరెంటు, మంచినీళ్లు, సాగునీరు బీఆర్‌ఎస్‌ పాలనలో వచ్చాయని, దీన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నడూ రైతుల బాధల గురించి ఆలోచించలేదని, పత్తి గింజలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు బ్యాంకు అప్పులుంటే.. ఇళ్లమీదికొచ్చి దర్వాజలు పీక్కొని వెళ్లేవారని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ మాటలు నమ్మి బీఆర్‌ఎ్‌సను ఓడగొట్టుకుంటే మీరే బాధలు పడతారు’’ అని హెచ్చరించారు. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని, రాష్ట్ర సాధన కోసం తొలి దశలో ఉద్యమం జరిగినప్పుడు 400 మందిని కాల్చి చంపారని, మలిదశ ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారని, దీనికంతటికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందని, ఈ మాటను తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని కేసీఆర్‌ చెప్పారు.

మీ ఓట్లు ఎవరికో వేసి మోరీలో వేయొద్దు

నకిరేకల్‌ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ నకిరేకల్‌ కమ్యూనిస్టు నేత నర్రా రాఘవరెడ్డి పుట్టినగడ్డ అని, ఉమ్మడి రాష్ట్రంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కరెంటు కోతల కారణంగా నీరు లేక ఎండిపోయిన వరి కంకులను ఆయన అసెంబ్లీలోకి తెచ్చి చూపించేవారని గుర్తు చేసుకున్నారు. కోతలకు నిరసనగా విజయవాడ హైవేను బంద్‌జేపిస్తుండె అని చెప్పారు. నకిరేకల్‌లో కమ్యూనిస్టు పార్టీలు పోటీలో లేవని గుర్తుచేస్తూ కమ్యూనిస్టులంతా బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మీ ఓట్లు ఎవరికో వేసి మోరీలో పడేయండి అని కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. నల్లగొండ సభలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటారని.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌కు పోతారని.. ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాలని సూచించారు. నల్లగొండ సుందర నగరంగా మారిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. రూ.1400కోట్లతో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఐటీ టవర్‌ పూర్తయ్యిందని, 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు.

గతంలో నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో అముదం పంట కనిపించేదని, తాను హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు భూములు చూశానని.. దుక్కులతో సిద్ధం చేసిన భూములన్నీ యాసంగి నాట్లకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని, హెలికాప్టర్‌లో వెళుతుంటే రోడ్లపై ఎక్కడ చూసినా ఆరబోసిన వడ్డే కనిపిస్తున్నాయని, ఇది తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. వడ్లను కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. రెండు వేల కోట్ల దాకా నష్టం వచ్చినా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు. మళ్లీ అధికారంలోకొస్తే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యుద్ధ ప్రతిపాదకన డబుల్‌ బెడ్‌రూం, గృహలక్ష్మి పథకాల ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి లేకుండా చేస్తాం అని పేర్కొన్నారు.

ఆటోల ఫిట్‌నెస్‌ ఫీజు రద్దు చేస్తా

బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆటోల ఫిట్‌నెస్‌ ఫీజు రద్దు చేస్తానని మనుకొండూర్‌ సభలో కేసీఆర్‌ ప్రకటించారు. ‘ఏడాదికోసారి ఆటోవాళ్లు తమ వాహనాల ఫిట్‌నె్‌సను చెక్‌ చేసుకోవాలి. ఇందుకు రూ.700 చార్జీ చేస్తున్నారు. సర్టిఫికెట్‌కు మరో రూ.500తో కలిపి మొత్తం రూ.1200 అవుతాయి. బీఆర్‌ఎస్‌ సర్కారు మళ్లీ రాగానే ఆటోల ఫిట్‌నెస్‌ ఫీజు అనేది ఉండదు. మొత్తం రద్దు చేస్తాం’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మానుకొండూరు సభలో మాట్లాడుతూ రసమయి బాలకిషన్‌ను మళ్లీ గెలిపిస్తే.. నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-11-21T03:09:48+05:30 IST