Share News

Kishan Reddy : బీజేపీ రాకుంటే ఆర్థిక సంక్షోభమే

ABN , First Publish Date - 2023-11-21T03:24:36+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పడకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక మూలాలను

Kishan Reddy : బీజేపీ రాకుంటే ఆర్థిక సంక్షోభమే

ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌ సర్కారు

కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రానికి చిప్పే గతి

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అభివృద్ధి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పడకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక మూలాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. భూములు అమ్మనిదే.. వైన్‌షాపులను 6 నెలల ముందే వేలం వేయనిదే.. ప్రభుత్వం నడవట్లేదు.. ఇక కాంగ్రెస్‌ గెలిస్తే చిప్పేగతి.. కాంగ్రెస్‌ గెలిచినా, బీఆర్‌ఎస్‌ గెలిచినా అభివృద్ధి కుంటుపడుతుంది. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. ఏకైక మార్గం డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావడమే’ అని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవిత నలుగురే ప్రచారం చేస్తున్నారని.. మిగతా కుటుంబ సభ్యులంతా డబ్బులు పంచుతారని ఆరోపించారు. ఒక నియోజకవర్గ నాయకుడికి మరో నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. ఒక రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి.. బీసీని సీఎం చేయడం బీజేపీ సామాజిక న్యాయం అని వ్యాఖ్యానించారు. అంచనాలకు మించి బీజేపీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ముఖ్యంగా రైతులు, ఎస్సీలు, బలహీనవర్గాలు కలిసి రావడం శుభపరిణామమన్నారు. దళితబంధు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. ధరణి కారణంగా నష్టపోయామని, బీఆర్‌ఎస్‌ ప్రచార రథాలను స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని వెల్లడించారు.

అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తాం

అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా తమ మేనిఫెస్టో రూపొందించామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తామని.. ఇదే తమ ప్రధాన నినాదమని వెల్లడించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక, ల్యాండ్‌, బెల్ట్‌షాపులు, మైనింగ్‌ మాఫియా, అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హయాంలలో జరిగాయని, అవినీతిని ఆ రెండు పార్టీలు పెంచి పోషించాయని దుయ్యబట్టారు.

Updated Date - 2023-11-21T03:24:37+05:30 IST