Share News

BJP Amit Shah : 3న మరో దీపావళి

ABN , First Publish Date - 2023-11-21T02:43:11+05:30 IST

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌..

BJP Amit Shah : 3న మరో దీపావళి

బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో పండగ చేద్దాం: అమిత్‌ షా

దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి

మజ్లిస్‌కు భయపడుతున్న కేసీఆర్‌

అందుకే అధికారికంగా ‘విమోచన’ చేయట్లేదు

బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, కాంగ్రెస్‌ 2జీ, 3జీ, 4జీ పార్టీలు

అవినీతిపై విచారణ.. బాధ్యుల్ని జైలుకు పంపుతాం

మూడు చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తాం

మెట్‌పల్లి, జనగామ సభల్లో అమిత్‌ షా

తెలంగాణలో కారు స్టీరింగ్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దగ్గర లేదని.. ఒవైసీ దగ్గర ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు. మజ్లిస్‌కి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ అధికారికంగా చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమని షా ఆరోపించారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామని చెప్పారు.

జగిత్యాల/జనగామ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే అభివృద్ధి, సంక్షేమం అందుతుందని స్పష్టం చేశారు. దీపావళి పండగను ఇటీవలే చేసుకున్నామని.. రెండో దీపావళి డిసెంబరు 3న తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుతో చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ప్రతిష్ఠాపనతో మూడో దీపావళి చేసుకుందామని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి, జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సకల జన విజయ సంకల్ప సభల్లో అమిత్‌ షా ప్రసంగించారు. తెలంగాణలో కారు స్టీరింగ్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దగ్గర లేదని.. ఒవైసీ దగ్గర ఉందని విమర్శించారు. మజ్లి్‌సకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ అధికారికంగా చేయడం లేదని ద్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమని షా ఆరోపించారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌లు 2జీ, 3జీ, 4జీలు అని.. వీటి డీఎన్‌ఏ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే సీఎం కేసీఆర్‌ చేసిన అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని అమిత్‌ షా స్పష్టం చేశారు. బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉచితంగా అయోధ్య రాముని దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ 2014లో దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి, విస్మరించారని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణలోని మూడు చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామని షా చెప్పారు. బీజేపీ సర్కారు వచ్చిన వెంటనే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి రైతులకు అంకితం చేస్తామని ప్రకటించారు. పసుపు బోర్డు గురించి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్ర పెద్దలతో పోరాడారన్నారు. అందుకే ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీడీ కార్మికుల కోసం 500 పడకలతో నిజామాబాద్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 2.50 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ అవినీతి చిట్టా విప్పుతాం..

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసిన అవినీతి చిట్టా విప్పి విచారణ జరిపిస్తామని షా తెలిపారు. మియాపూర్‌ భూములు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు భూములు, కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రానైట్‌, మిషన్‌ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు రూ.670 కోట్ల మిగులుతో ఉండగా.. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. దేశంలోనే కేసీఆర్‌ నంబర్‌ వన్‌ అవినీతి ముఖ్యమంత్రి అని షా విమర్శించారు. కేసీఆర్‌ దృష్టిలో మిషన్‌ అంటేనే కమీషన్‌ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు, మిషన్‌ కాకతీయలో రూ.24 వేల కోట్ల అవినీతి జరిగిందని అమిత్‌ షా ఆరోపించారు.

Updated Date - 2023-11-21T03:11:05+05:30 IST