గోషామహల్‌పై గురి

ABN , First Publish Date - 2023-03-30T12:33:52+05:30 IST

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీ నుంచి సస్పెండ్‌ కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నెమ్మదించాయి.

 గోషామహల్‌పై గురి

మంగళ్‌హాట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీ నుంచి సస్పెండ్‌ కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నెమ్మదించాయి. ప్రతి చిన్న సమస్యను స్థానిక నాయకులు మంత్రి తలసాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటున్నారు. మంగళ్‌హాట్‌, గోషామహల్‌, బేగంబజార్‌, జాంబాగ్‌, దత్తాత్రేయనగర్‌, గన్‌ఫౌండ్రి డివిజన్లలోని బీఆర్‌ఎస్‌ బస్తీ అధ్యక్షులతోపాటు కులసంఘాల నాయకులు నేరుగా తనను క లిసేందుకు మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అలాగే స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడి వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే మంత్రి తలసాని ఇక్కడి నుంచి పోటీచేస్తే టికెట్‌ ఆశిస్తున్న వారితోపాటు ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవని సొంత పార్టీలో మాట్లాడుకోవడం గమనార్హం.

బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

గోషామహల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ ప్రజల్లోకి వెళ్లడం లేదని, కేవలం కార్యాలయ కార్యక్రమాలకే పరిమితమయ్యారనే చర్చ సాగుతోంది. నందకిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌, న్యాయవాది రాజశేఖర్‌, ఆశిష్‌కుమార్‌ యాదవ్‌, గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరిలో కొందరు తమకు టికెట్‌ ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో మంత్రి తలసానికి టికెట్‌ దక్కితే ఏ మేరకు కలిసి వస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ తలసానికి టికెట్‌ వస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య గ ట్టి పోటీ తప్పదు. బీజేపీ ఈసారి ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, హిందూవాహినీలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసిన భగవంత్‌రావు, బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌తోపాటు మరో ఇద్దరు నేతలు పోటీలో ఉన్నట్లు సమాచారం. శంకర్‌యాదవ్‌కు నియోజకవర్గంలో మంచి పేరుకు తోడు ఆర్థికబలం కూడా ఉండడంతో గట్టి పోటీ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. శంకర్‌ యాదవ్‌కు బీజేపీ టికెట్‌ వస్తే మంత్రి తలసాని కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో నియోజకవర్గంలో మజ్లిస్‌ ఓట్లు కీలకంగా మారనున్నాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పార్టీ నుంచి పిలుపు రాని పక్షంలో శివసేన నుంచి లేదా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటే అటు బీజేపీ ఓట్లతోపాటు లోఽధ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలి బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ వైపు అసమ్మతి నేతల చూపు

బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారిలో గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, మరో ఇద్దరు సీనియర్‌ నేతలు ఉన్నారు. టికెట్‌ దక్కని పక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా లోధ సామాజికవర్గానికి చెందిన ఓట్లను నమ్ముకున్న నాయకులే కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించే వారిలో ముందంజలో ఉన్నారు.

Updated Date - 2023-03-30T15:21:58+05:30 IST