ఆసిఫాబాద్‌ జిల్లాలో పేదలకు ఇకనైనాగూడు దొరికేనా?

ABN , First Publish Date - 2023-03-02T23:10:47+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) అందరికీ కూడు, గూడు, గుడ్డ అనేది సంక్షేమ, సుపరిపాలనకు గీటురాళ్లు.. సొంతిళ్లనేది ప్రతీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సగటు మనిషి కల.. తమకంటూ ఇళ్లస్థలాలు లేక.. ఇటు ప్రభుత్వ సహకారమూ అందక సొంతింటి కలను నేరవేర్చుకోలేకపోతున్న పేద, మధ్య తరగతి వారికి ప్రభుత్వం తీపి కబురందించింది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో పేదలకు ఇకనైనాగూడు దొరికేనా?

- పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఆమోద ముద్ర

- ప్రభుత్వ నిర్ణయంతో చిగురిస్తున్న ఆశలు

- జిల్లాలో నిలువ నీడలేని కుటుంబాల సంఖ్య 23వేల పైనే

- మధ్యలోనే పనులొదిలేసిన ‘డబుల్‌’ కాంట్రాక్టర్లు

- నిర్మాణ వ్యయం పెరగడమే కారణం

- ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపమూ కారణమే

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

అందరికీ కూడు, గూడు, గుడ్డ అనేది సంక్షేమ, సుపరిపాలనకు గీటురాళ్లు.. సొంతిళ్లనేది ప్రతీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సగటు మనిషి కల.. తమకంటూ ఇళ్లస్థలాలు లేక.. ఇటు ప్రభుత్వ సహకారమూ అందక సొంతింటి కలను నేరవేర్చుకోలేకపోతున్న పేద, మధ్య తరగతి వారికి ప్రభుత్వం తీపి కబురందించింది.

ఇటీవల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీసమావేశంలో సొంతస్థలాలు లేని పేదలకు ఇళ్లస్థలా లను కేటాయించి ఇళ్లను నిర్మించుకునేందుకు రూ.3లక్షలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దాంతో ఇక డబుల్‌పై ఆశలు పెట్టుకోవద్దని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లైంది.

గతంలో ఇందిరా ఆవాస్‌ యోజన పేరిట అమలు చేసిన గృహనిర్మాణ పథకాన్ని రద్దు చేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దాని స్థానంలో 5లక్షల వ్యయంతో పేదలకు 2పడక గదుల ఇండ్లను నిర్మించి ఇస్తామన్న హామీ ఇప్పటివరకు జిల్లాలో కాగితాలకే పరిమితమైంది. ఆర్భాటంగా కొన్ని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించినా అవి పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతున్నాయి. ఫలితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి కల సామాన్యులకు సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది.

ఇదీ డ(ట్ర)బుల్‌..

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం పథకం కింద 2550ఇళ్లు మంజూరు చేయగా 1310ఇళ్లకు మాత్రమే పరిపాలనపరమైన ఆమోదముద్ర లభించింది. ఇందులో చచ్చిచెడి కేవలం 288ఇళ్లను మాత్రమే ఇప్పటివరకు పూర్తి చేయగలిగారు. మిగితా వాటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ చేపట్టగా, కాగజ్‌నగర్‌లో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో నిర్మాణాలను తలపెట్టారు. అయితే ప్రస్తుతం కాగజ్‌నగర్‌ మినహా ఇతర ప్రాంతాల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కూడా అధికారుల బలవంతం మీద ఇళ్ల నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకున్నా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ప్రారం భించింది కేవలం 152 మాత్రమే అవి కూడా పునాదుల దశ దాటక ముందే మధ్యలోనే పనులు ఆపివేసి చేతులు దులుపుకున్నారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి..

జిల్లాలో తలదాచుకునేందుకు నీడ కరువైన కుటుంబాల సంఖ్య ఏ యేటికాయేడు పెరుగుతూనే ఉంది. 2016లో సేకరించిన గణాంకాల ప్రకారం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 17వేల 243కుటుంబాలకు నిలువ నీడలేదని అధికారులు గుర్తించారు. గడిచిన రెండు సంవత్సరాల్లోనే ఈ సంఖ్య మరో 6వేలు పెరిగినట్లు అధికారులు తేల్చారు. దాంతో జిల్లాలో మొత్తం 23వేల కుటుంబాలకు పైగా గూడు కరువై ప్రభుత్వ చేయూతకోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2023-03-02T23:10:59+05:30 IST