ఉప ఎన్నికలు జరిగేనా?

ABN , First Publish Date - 2023-05-02T22:02:18+05:30 IST

జిల్లాలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఆరు నెలల క్రితమే జిల్లా అధికారులు ఖాళీలను గుర్తించి నివేదికలు రుపొందించి ఎన్నికల సంఘానికి సమర్పించారు.

ఉప ఎన్నికలు జరిగేనా?
ఆసిఫాబాద్‌ మండలం రహపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం

- పత్తాలేని ఎన్నికల నోటిఫికేషన్‌

- ఆశావహులకు తప్పని ఎదురు చూపులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 2: జిల్లాలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఆరు నెలల క్రితమే జిల్లా అధికారులు ఖాళీలను గుర్తించి నివేదికలు రుపొందించి ఎన్నికల సంఘానికి సమర్పించారు. కాగా ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడంలేదు. దీంతో పలు పంచాయతీలలో ఇన్‌చా ర్జీలతో పాలన నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 537 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆయా స్థానాల పరిధిలో 58,471 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నివేదికలు పంపించి ఆరు నెలలు గడుస్తున్నా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవడంతో ఆయోమయం నెలకొంది.

వివిధ కారణాలతో ఖాళీ..

జిల్లాలో 15 గ్రామ పంచాయతీల పరిధిలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 సర్పంచ్‌, 5 ఎంపీటీసీ, 520 వార్డులు వివిధ కారణాలతో ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో పోటి చేసి విజయం సాదించిన వారు కొందరు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఎన్నికల్లో చేసిన ఖర్చుపై పూర్తి సమాచారం సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం గెలిచినవారితో పాటు పోటీ చేసిన వారిపైనా నిషేధం విదించింది. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు మృతి చెందడంతో ఆయా స్థానాలు ఖాళీగా మారాయి. ఏదైనా స్థానం ఖాళీ అయితే ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలేదు. గత ఏడాది ఎన్నికల కోసం ఉన్నతాధి కారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఆధికార యంత్రాంగం హడవుడి చేసింది. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఓటరు సవరణకు అవకాశం కల్పించింది. అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటరు జాబితాను కూడా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. అయినా ఎన్ని కల నోటిఫికేషన్‌ మాత్రం విడుదల కాలేదు. దీంతో స్థానిక సంస్థల్లో పోటీలో నిలిచేందుకు సిద్ధమైన వరు నిరాశ చెందుతున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికలకు కూడ సమయం దగ్డర పడుతొంది.

537 స్థానాల్లో ..

జిల్లాలో మొత్తం 537 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎంపీటీసీ స్థానాలకు సంబందించి జైనూర్‌లో ఒకటి, వాంకిడిలో రెండు, కౌటాలలో ఒకటి, సిర్పూర్‌(టి)లో ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగాల్సి ఉంది. సర్పంచ్‌లకు సంబందించి ఆసిఫాబాద్‌లో మూడు, కెరమెరిలో రెండు, వాంకిడి ఒకటి, చింతలమానేపల్లి రెండు, తిర్యాణిలో ఒకటి, కాగజ్‌నగర్‌లో ఒకటి, పెంచికల్‌పేటలో ఒకటి, రెబ్బెనలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఆసిఫాబాద్‌లో 78 వార్డులు, బెజ్జూర్‌లో ఐదు, చింతలమానేపల్లిలో 41, దహెగాంలో 18, జైనూర్‌లో ఎనిమిది, కాగజ్‌నగర్‌లో 16, కెరమెరిలో 110, కౌటాలలో 32, లింగా పూర్‌లో 60, పెంచికల్‌పేటలో ఏడు, రెబ్బెనలో ఒకటి, సిర్పూర్‌(టి)లో నాలుగు, సిర్పూర్‌(యూ)లో 45, తిర్యాణిలో 15, వాంకిడిలో 80 వార్డు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి..

సురేందర్‌, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో ఖాళాగా ఉన్న స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. గతంలోనే ఓటరు జాబితా, ఇతర వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాం.

Updated Date - 2023-05-02T22:02:18+05:30 IST