పెద్దయ్య ఆలయంపై పట్టింపేది..?
ABN , First Publish Date - 2023-07-01T22:45:03+05:30 IST
మండలంలో కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న పెద్దయ్య ఆలయం నిరాధారణకు గురవుతోంది. మండల కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెద్దయ్య దేవుని ఆలయం ప్రకృతి అందాల మధ్య ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉంది.
దండెపల్లి, జూలై 1: మండలంలో కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న పెద్దయ్య ఆలయం నిరాధారణకు గురవుతోంది. మండల కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెద్దయ్య దేవుని ఆలయం ప్రకృతి అందాల మధ్య ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉంది. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు ఉండటంతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సరియైన మౌలిక వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆలయ విశిష్టత
గుట్టపై ఆలయం సమీపంలో ఉన్న కోనేరులో ఏ కాలంలోనైనా నీరు ఉంటుంది. భక్తులు కోనేరులో స్నానాలు చేసి, ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ద్వాపర యుగంలో పెద్దయ్య గుట్టలో పాండవులు అరణ్య వాసం చేసినట్లుగా పురాణగాథల ద్వారా తెలుస్తోంది. పెద్దయ్య గుట్ట నుంచి లక్షెట్టిపేట మండలంలోని చిన్నయ్య దేవుని గుట్ట వరకు సొరంగ మార్గం ఏర్పాటు చేశారని చెబుతారు. ఈ సొరంగ మార్గం గుండా పాండవులు సంచరించేవారని ప్రజల నమ్మకం. ఆలయానికి వేళ్లే ముందు గజ్జిబండ, అల్లుబండ దర్శనమిస్తాయి. భక్తులు తమ వెంట తెచ్చే బియ్యం, కోడిగుడ్లు, నగదుతో గజ్జిబండ వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన పెద్దయ్య ఆలయానికి వెళ్లి దేవున్ని దర్శించుకొంటారు.
రైతుల కొంగు బంగారం పెద్దయ్య
పెద్దయ్య గుట్ట దేవాలయం రైతుల కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచింది. యాసంగి, వానాకాలం సీజన్‌లో రైతులు, వేసవి సెలవుల్లో భక్తులు ఆది, గురువారాల్లో పెద్దయ్య దేవున్ని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తారు. కోనేటి నీరును స్వామి తీర్ధంగా ఇండ్లకు తీసుకెళుతారు. పెద్దయ్య దేవుని ఇల్లారి చిన్న కుటీరం మాదిరిగా ఉంటుంది. ఈ కుటిరంలో గిరిజనులు(నాయక్‌పోడ్) పూజారులుగా వ్యవహరిస్తారు. భక్తులు కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో రాగానే పూజారి పెద్దయ్య దేవుని పూనకంతో ఊరగోలతో కొట్టితే పెళ్లి కాని వారికి పెండ్లి అవుతుందని, సంతానంలేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏ సీజన్‌లో ఏయే పంటలు పడుతాయో రైతులు ఆలయ పూజారులను అడిగి తెలుసుకొంటారు. ఆలయం సమీపంలో సుమారు 100 మీటర్ల ఎత్తయిన కొండను పూనకం వచ్చిన పూజారి కేవలం పది నిమిషాలలో ఎక్కిదిగడం పెద్దయ్య దేవుని మహిమగా చెబుతారు.
ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి.
దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉన్న పెద్దయ్య దేవున్ని ఆలయానికి రోడ్డు సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి పెద్దయ్య ఆలయం వరకు భక్తులు కాలినడక సుమారు 4కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆలయం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. పెద్దయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. అటవీ ప్రాంతంలో వంటలు చేయడం, మద్యం సేవించడాన్ని అటవీ అధికారులు నిషేధించారు.