వసూల్ ఫుల్.. వసతులు నిల్!
ABN , First Publish Date - 2023-04-03T00:30:31+05:30 IST
జాతీయ రహదారిపై దాహం తీర్చుకునే దారిలేక ప్రయాణికులు అల్లాడుతున్నారు. నాలుగు వరుసల రహదారిని నిర్మించిన నేషనల్ హైవే అథారి టీ అధికారులు, రహదారి వెంట అక్కడక్కడ ప్రయాణికుల దాహార్థిని తీర్చేందుకు తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే సేద తీరేందుకు షెల్టర్లను కూడా నిర్మించారు.
అలంకారప్రాయంగా మారిన తాగునీటి ట్యాంకులు
ఆపద సమయంలో గుక్కెడు మంచినీళ్లు దొరక్క ప్రయాణికుల ఇక్కట్లు
నిబంధనలను గాలికొదిలేస్తున్న జాతీయ రహదారి నిర్వహణ సంస్థలు
ఇప్పటికే టోల్ బాదుడుతో వాహనదారులపై అదనపు భారం
తేలికగా తీసుకుంటున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు
జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై దాహం తీర్చుకునే దారిలేక ప్రయాణికులు అల్లాడుతున్నారు. నాలుగు వరుసల రహదారిని నిర్మించిన నేషనల్ హైవే అథారి టీ అధికారులు, రహదారి వెంట అక్కడక్కడ ప్రయాణికుల దాహార్థిని తీర్చేందుకు తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే సేద తీరేందుకు షెల్టర్లను కూడా నిర్మించారు. కానీ వాటి నిర్వహణను గాలికి వదిలే యడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అసలే వేసవి.. ఆపై మండిపో తున్న ఎండలతో ప్రయాణికులు గొంతు తడారి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు తాగునీళ్ల కోసం కిలోమీటర్ల మేర గుక్కెడు నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ సర్వీస్ చార్జీగా టోల్‌ఫీజు ను వసూలు చేస్తున్న అధికారులు.. దాననుగుణంగా సౌకర్యాలు కల్పించడం లే దంటున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారిపై కనీస సౌకర్యాలతో పాటు రహదారి మరమ్మతుల బాధ్యతను రహదారి నిర్వహణ సంస్థలు చేపట్టా ల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా అలాంటి వసతులను కల్పించిన దాఖలాలు లేవు. కానీ నేరడిగొండ మండలం రోల్‌మామడ, జైనథ్ మండలం పిప్పల్‌కోటిల వద్ద టోల్‌ఫీజును వసూలు చేస్తున్నారు. కాదు కూడదంటే అడుగు ముందుకు వేయ నివ్వడం లేదు. నిర్వహణ సంస్థలు ఆదాయంపై దృష్టి సారిస్తున్నంతగా.. కనీస సౌకర్యాల కల్పనపై చూపడం లేదు. దీంతో రహదారి వెంట ఉన్న చెట్ల కింద సేదతీరుతూ దాబా హోటళ్లలో మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేస్తూ దాహం తీర్చుకుంటున్నారు. రహదారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచినీటి ట్యాం కులను నిర్మించినా.. ఫలితమే లేకుండా పోయింది.
అడుగడుగున నిర్లక్ష్యమే..
జిల్లా మీదుగా వెళ్తున్న 44వ రహదారిపై అడుగడుగున నిర్లక్ష్యమే కనిపిస్తుం ది. సర్వీసు చార్జీల పేరిట అడ్డగోలుగా టోల్‌ఫీజులను వసూలు చేస్తున్నా.. వసతులు మాత్రం నామమాత్రంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటిట్యాంకులకు నీటిని సరఫరా చేయకుండానే వృథాగా వదిలేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల మంచినీటి ట్యాంకులు శిథిలమయ్యాయి. దీంతో రహదారి వెంట ప్రయాణికులు దాబాహోటళ్లలో మంచినీటిని కొనుగోలు చేసుకుని తాగాల్సిన పరిస్థితులు ఏర్ప డుతున్నాయి. ఇదే ఆసరాగా హోటళ్ల యజమానులు ధరలను పెంచి దండుకుం టున్నారు. లీటర్‌బాటిల్ రూ.25 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో ప్రయాణికుల కు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన నీటి ట్యాంకులు నిరుపయోగంగానే మారడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చాలాచోట్ల మరుగుదొడ్ల నిర్వహణ సరిగాలేక పోవడంతో కంపు కొడుతున్నాయి. రహదారి వెంట ఆరుబయటనే మూత్ర, మలవిసర్జన చేయడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లు తున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్డు నిర్వహణ సంస్థలు రహదారి వెంట ఉన్న పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల వద్ద పారిశుధ్యం పనులను చేపట్టాలి. దీంతో ప్రయాణికులు నిలబడే అవకాశమే లేకుండాపోతోంది.
ఆపద సమయంలో వెతుకులాట
రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే గుక్కెడు మంచినీళ్లయినా దొరికే పరిస్థితులు లేవు. ఆపద సమయంలో మంచినీళ్ల కోసం వెతుకులాట తప్పడం లేదు. అసలే వేసవి పరిస్థితులు కావడంతో ప్రయాణికులు గొంతు తడుపుకునేం దుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండలో ద్విచక్ర వాహనదా రులు, పాదాచారులు ఎండ తీవ్రతకు దాహంతో అల్లాడుతున్నారు. కిలోమీటర్ల మేర ఎలాంటి మంచినీటి సౌకర్యం లేకపోవడంతో వెతుకులాటనే కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల పరిధిలో ఉన్న దాబాహోటళ్లలో దాహం తీర్చుకుంటున్నారు. ఆ తర్వాత నిర్మల్ వరకు ఎక్కడా కనీసం మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ముందు జాగ్రత్తగా వాటర్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్నారు. వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే స్తోమత లేని ప్రయాణికులు రహదారి వెంట ఉన్న గ్రామాల్లోకి వెళ్లి మరీ దాహం తీర్చుకుంటున్నారు. రహదారిపై ఇంత అధ్వానపు పరిస్థితులు ఉన్నా.. అధికారులు స్పం దించడమే లేదు. ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ కొరవడడంతో రహదారి నిర్వహణ సంస్థలు చెప్పిందే లెక్కాగా మారింది. వివిధ రకాల సౌకర్యాల పేరిట టోల్‌ఫీజును వసూలు చేస్తున్నా.. ప్రయాణికుల కు సౌకర్యాలను కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. తాజాగా టోల్ ఫీజును మరింత పెంచి వసూలు చేస్తున్నా.. ప్రయాణికుల సౌకర్యాలపై సంబంధిత అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ప్రయాణికులు కనిపిస్తున్నా రు. కనీసం ఫిర్యాదు చేసేందుకైనా అధికారులను అందుబాటులో ఉంచితే ప్రయాణికుల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుం ద న్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కనీస సౌకర్యాల కల్పనకు వెంటనే చర్యలు తీసుకుంటాం
: తరుణ్, నేషనల్ హైవే అథారిటీ అధికారి, ఆదిలాబాద్
వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు అవసరమైన వస తులను కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం. రహదారిపై మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత రోడ్డు నిర్వహణ సంస్థలకు ఉంటుంది. అక్కడక్కడ సర్వీసు రోడ్డు, బస్‌షెల్టర్ల వద్ద ఉన్న మంచినీటి ట్యాం కుల్లో నీటిని నింపి ప్రయాణికులకు అందుబాటులోఉంచుతాం. వేసవి కాలం పూర్తయ్యేంత వరకు తాగునీటి వసతిని కల్పించాలని సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రహదారిపై ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. వేసవి పరిస్థితులకు అనుగుణంగా రహదారిపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.