తెరిపినివ్వని వర్షం

ABN , First Publish Date - 2023-07-26T23:13:11+05:30 IST

జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

   తెరిపినివ్వని వర్షం
మంచిర్యాల రాళ్లవాగు పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

- కాలనీల్లో నిలిచిన వరదనీరు

- ఇబ్బందులు పడ్డ ప్రజలు

మంచిర్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నెన్నెల, కోటపల్లి, జైపూర్‌ మండలాల్లోని వాగులు ఉప్పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగు తోంది. మరోవైపు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహి స్తుండ డంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ కోటపల్లి మండలంలో పర్యటించి ప్రాణహిత సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిలిచిన బోగ్గు తవ్వకాలు..

ఎడతెరపి లేకుండా కు రుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓబీ మట్టి తొలగింపు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. దీంతో యం త్రాల సహాయంతో నీటిని తోడుతున్నారు. మూడు ఏరియాల్లోని ఇందారం, రామకృ ష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో దాదాపు రూ. 53 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తితోపాటు, రూ. 16 కోట్ల విలువైన ఓబీ మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 39.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జైపూర్‌ మండలంలో 103.5, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నస్పూర్‌ మండలంలో 78.5, కన్నెపల్లిలో 73.5, పాత మంచిర్యాలలో 69.5, మందమర్రి మండలం అందుగులపేటలో 47.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లక్ష్టెట్టిపేట మండలం శాంతాపూర్‌లో 45.0, వేమనల్లి మండలం నీల్వాయిలో 43.8, హాజీపూర్‌ మండలం ర్యాలీలో 41.8, దండేపల్లి మండలం వెల్గనూరులో 41.3, జైపూర్‌ మండలం కుందారంలో 38.3 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లింపల్లిలో 33.8, కోటపల్లి మండలం దేవులవాడలో 33.8, కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో 36.3, హాజీపూర్‌లో 36.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భీమారంలో 30.8, చెన్నూర్‌ మండలం కొమ్మెరలో 29.8, కోటపల్లి మండలంలో 28.5, చెన్నూర్‌లో 26.5, భీమినిలో 25.5, కోటపల్లి మండలం కొల్లురులో 23.8, దండేపల్లి మండలం లింగాపూర్‌లో 22.5, తాండూరులో 18.0, జన్నారంలో 14.0, కాసిపేట మండలం కొండాపూర్‌లో 10.0, జన్నారం మండలం కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో 8.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 486.92 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 482.45 అడు గులకు చేరింది. గరిష్ట నిల్వ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 16.488 టీఎంసీలు ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 5,966 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువున కురుస్తున్న వర్షాల కార ణంగా మరో 93,113 క్యూసె క్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరు తోంది. అవుట్‌ ఫ్లో 1,20,107 క్యూసెక్కులు ఉండగా, 16 గేట్లు తెరిచి మొత్తం 1,19,776 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో బుధవారం సాయంత్రం 5 గంటల 6 గంటల వరకు గంట పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని నస్పూర్‌ కాలనీ, నర్సయ్య భవన్‌ ఏరియా, గాయత్రి నగర్‌, రాయల్‌ టాకిస్‌ ఏరియా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. నస్పూర్‌ కాలనీ లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వరద నీరు పోటెత్తి రోడ్డుపై చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దుకాణాలు ఎదుట పార్కింగ్‌ చేసి ద్విచక్ర వాహనాలు వరద ప్రవాహం పడిపోయాయి. నస్పూర్‌ కాలనీలో పలు సింగరేణి క్వాటర్లలోకి వరద నీరు చేరింది. రాయల్‌ టాకిస్‌ వద్ద సీసీసీకి వెళ్లే రోడ్డుపై వరద నీరు చేరింది. కలెక్టరేట్‌ సమీపంలోని వినూత్న కాలనీకి వెళ్ళే రోడ్డు మార్గంలో తొళ్ళవాగు వంతెన పై నుంచి ప్రవహిస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన మేరకు నస్పూర్‌ మున్సిపాలిటీలో రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్‌ శాఖల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఏసీసీ: జిల్లా కేంద్రంలో బుధవారం రెండు గంటలు కుండపోతగా వర్షం కురిసంది. రాళ్లపేటలో ఇళ్ల మధ్యలోకి నీరు చేరింది. పలు కానీల్లో రోడ్లు జలమయ మయ్యాయి. రాళ్లవాగు ఉధృతంగా ప్రహిస్తుండడంతో లో లెవెల్‌ వంతెనపై నుంచి వరద పారుతోంది. హమాలీవాడ రైల్వే అండర్‌ బ్రిడ్జిలో నీరు చేరి రాకపోకలు నిలిచి పోయాయి. నాలాలు, డ్రైనేజీలు నిండి రోడ్లపైకి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

శ్రీరాంపూర్‌: ఉదయం నుంచి కురుస్తోంది. సాయంత్రం భారీగా కురవడంతో శ్రీరాంపూర్‌ ఏరియాలో కాలనీలు జలమయమయ్యాయి. అరుణక్కనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, ఝాన్సీనగర్‌, బుడిగ జంగాల కాలనీ, ప్రగతి మైదానం, తదితర ప్రాంతాలలో రోడ్లపైన వాననీరు ప్రవహించింది. రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. లక్ష్మీనగర్‌లో చెట్టు కూలడంతో అరగంట పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. విద్యుత్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి కరెంట్‌ పునరుద్ధరించారు.

చెన్నూర్‌ రూరల్‌: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఎర్రగుంటపల్లి సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్టు కాలువకు గండి పడింది. అక్కేపల్లి గ్రామంలోని కాజ్‌వే పై వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో అక్కేపల్లి నుంచి చెన్నూర్‌ వైపు వచ్చే రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దాల, కత్తేరశాల వాగులు వరద నీటితో ఉదృత్తంగా వాగులు ప్రవహిస్తున్నాయి.

జైపూర్‌: మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు మండలంలోని టేకుమట్ల వాగు, పెగడరపల్లి ఈదుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు వాగు దాటకకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కోటపల్లి: మండలంలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురవడంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. మండలంలోని నక్కలపల్లి దారిలో లోతొర్రె , గొల్లగట్టు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు పారుపెల్లి, లింగన్నపేట గ్రామాల మధ్యలో తమ్మడి వాగు ఉధృతికి ప్రధాన రహదారిలోని కాజ్‌వే మునగడంతో ఈ మార్గంలో రవాణా మూసుకుపోయింది. అన్నారం, కొత్తపల్లి, రాజారాం సమీపంలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నీటిని విడుదల చేయడం వరదల కారణంగా రెండు నదుల ఉధృతి వల్ల బ్యాక్‌ వాటర్‌ స్ధానిక పొలాలు, చేలలోకిచేరింది.

మందమర్రి టౌన్‌: మందమర్రిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షానికి కేకే ఓసీపీలో ఉత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఓపెన్‌కాస్టులో 50 వేల టన్నుల ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఓసీపీలో ెూటార్లను అమర్చి నీటిని బయటకు పంపిస్తున్నారు. బుధవారం కూడా పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. కురిసిన భారీ వర్షంతో రామన్‌ కాలనీ, పాలచెట్టు ఏరియా, పోలీస్‌స్టేషన్‌ రోడ్డు వద్ద నీరు నిలిచిపోయింది.

మందమర్రిరూరల్‌: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.పొన్నారం, వెంకటాపూర్‌ మధ్యలోని దొమ్మరి వాగు నీరు రోడ్‌డ్యాంపై ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

బెల్లంపల్లి: బెల్లంపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పట్టణంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రాంనగర్‌ అండర్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఉధృతంగా ప్రాణహిత

వేమనపల్లి, జూలై 26: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు ఇక్కడ కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది బ్యాక్‌ వాటర్‌తో మండలంలోని రాచర్ల గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న బొందచేను ఒర్రె బ్యాక్‌ వాటర్‌తో నిండుగా ప్రవహిస్తోంది. దీంతో రాచర్ల గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న చామనపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు నీల్వాయి ప్రాజెక్టు నండి మత్తడి పడుతోంది.

ఆస్పత్రికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు

రోడ్డు సౌకర్యం లేక మూడు కిలోమీటర్లు ఎండ్లబండిపై తరలింపు

నెన్నెల, జూలై 26: భారీ వర్షాలతో మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రవాగు ఉప్పొంగడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనంపేట పంచాయతి పరిధిలోని పాటి గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్బిణి రెడ్డి మల్లక్కకు బుధవారం రక్తస్రావం కావడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. 108 అంబులెన్స్‌కు కాల్‌ చేయగా వర్షాలు కురుస్తుండడడంతో తాము నెన్నెల వరకు మాత్రమే వస్తామని అక్కడి వరకు పేషెంట్‌ను తీసుకు రావాలని సూచించారు. చేసేది లేక పాటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని కోనంపేట వరకు జోరు వానలో ఎడ్ల బండిపై మల్లకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి లంబాడితండా వరకు ఆటోలో తరలించారు. ఎర్రవాగు కాజ్‌వే పైనుంచి ప్రవహిస్తుండడంతో ఆటోకు రక్షణగా యువకులు రెండు వైపులా పట్టుకొని వాగు దాటించారు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న 108 అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భిణిని 8 కిలోమీటర్ల దూరం తీసుకు రావడానికి మూడు గంటల సమయం పట్టిందని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2023-07-26T23:13:11+05:30 IST