చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2023-08-22T22:22:28+05:30 IST
కాగజ్‌నగర్ ఈసుగాం ప్రధాన రోడ్డు సమీపంలో చోరీ జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 22: కాగజ్‌నగర్ ఈసుగాం ప్రధాన రోడ్డు సమీపంలో చోరీ జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ నాగరాజు మాట్లాడారు. సోమవారం ఉదయం తన వద్ద ఉన్న డబ్బులు చోరీకి గురయ్యాయని శ్రీరాం ఫైనాస్స్ విభాగంలో పని చేస్తున్న ప్రమోద్ సింగ్ ఈసుగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా ఇది డ్రామాగా తేలిందని తెలిపారు. సోమవారం ఉదయం శ్రీరాం ఫైనాన్స్ విభాగంలో పని చేస్తున్న ప్రమోద్‌సింగ్ ఈసుగాంలో డబ్బులు వసూలు కోసం వచ్చినట్టు తెలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైనట్టు వివరించారు. రెండ్రోజుల క్రితమే పలువురి వద్ద 33వేల రూపాయలు అతడు కలెక్ట్ చేశాడని చెప్పారు. శ్రీరాం ఫైనాన్స్ జనరల్ మేనేజర్ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని అన్నారు. దీంతో డబ్బులు చెల్లించలేక ప్రమోద్‌సింగ్ ఈసుగాం-బల్గాల సమీపంలో పొదల్లో అక్కడే బీరు బాటిల్‌ను తలపై కొట్టుకుని దారి దోపిడీకి గురైనట్లు చిత్రీకరించాడన్నారు. ఈ విషయంలో కొంత మందికి తెలియడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు వెనుక నుంచి దాడి చేసి 33వేల రూపాయలు అపహరించారన్న విషయం వైరల్ కావడంతో తాము ఎనిమిది గంటల పాటు విచారణ చేసినట్టు తెలిపారు. సీసీ కెమెరాల్లో ముగ్గురు దొంగలున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. ప్రమోద్‌సింగ్ చెప్పే మాటలకు పొంతన లేక పోవడంతో అతడని విచారించామని చెప్పారు. తాను డబ్బులు సొంతానికి వాడుకున్నట్టు, బెట్టింగ్‌లో పెట్టి డబ్బులు పోయినట్లు తేలిందన్నారు. మేనేజర్ ఒత్తిడి తెస్తుండటంతో చేసేదీ ఏమీ లేక దారి దోపిడిగా చిత్రీకరించినట్టు ప్రమోద్ సింగ్ ఒప్పుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులను తప్పు తోవ పట్టించినందులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. ఈసమావేశంలో ఎస్సైలు రామన్‌కుమార్, సోనియా తదితరులు పాల్గొన్నారు.