అభివృద్ధిలో జిల్లా ముందడుగు

ABN , First Publish Date - 2023-06-02T22:47:39+05:30 IST

సబ్బండ వర్గాల అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేస్తోందని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అభివృద్ధిలో జిల్లా ముందడుగు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 2: సబ్బండ వర్గాల అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేస్తోందని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, చిన్నయ్య, డీసీసీ సుధీర్‌రాంనాధ్‌ కేకన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు, అదనపు కలెక్టర్‌ రాహుల్‌, మధుసూదన్‌నాయక్‌లు పాల్గొన్నారు. కళాకారుల ఆటాపాటలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ విప్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సబ్బండ వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సీఎం కేసీఆర్‌ అభివృద్ధి యజ్ఞం చేస్తున్నారన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో కరోనా, ఆర్థిక మాంద్యం వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకుని బలీయమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ ఏడాది సాగును 4,45,429 ఎకరాలకు పెంచామన్నారు. యాసంగి, వానాకాలానికి సంబంధించిన రైతుబంధు ద్వారా రూ.1448 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలో 1702 మంది రైతులకు రూ.85 కోట్లను బీమా కింద అందించామన్నారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్‌ ద్వారా 25 వేల97 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని మందమర్రిలో ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. మంచిర్యాల, చెన్నూరు, లక్షెట్టిపేట, జన్నారం, బెల్లంపల్లిలో గోదాములను నిర్మించామన్నారు. పడ్తన్‌పల్లి ఎత్తిపోతల పథకానికి రూ. 90 కోట్లతో పది వేల ఎకరాలకు నీరందించేందుకు సీఎం కేసీఆర్‌ శంకుస్ధాపన చేస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూరు నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు పది టీఎంఎసీల నీటిని అందించేందుకు జీవో 133ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీని సీఎం కేసీఆర్‌ ప్రారంభించడం జరుగుతుందన్నారు. 548 పల్లె ప్రకృతి వనాలు, 464 క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రగతి కార్యక్రమాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామం, నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. రూ. 333 కోట్లతో మిషన్‌ భగీరథ ట్యాంకులను నిర్మించామన్నారు. మహిళల కోసం సమ్మక్క సారలమ్మ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, డంపింగ్‌యార్డులు, ప్లేగ్రౌండ్‌లు, పార్కులు, అంతర్గత రోడ్లు, ఓపెన్‌ జిమ్‌లు, సెంట్రల్‌ లైటింగ్‌, పబ్లిక్‌ టాయిలెట్లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి పవర్‌ ప్లాంట్‌ ద్వారా నిరంతరం కరెంటు సరఫరా అవుతుందన్నారు. సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు అందించామన్నారు. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న వారికి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల గ్రంథాలయాల్లో తరగుతులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్య రంగంలో ఎంసీహెచ్‌ భవనాన్ని, 200 పడకల సంరక్షణ కేంద్రాన్ని, బెల్లంపల్లిలో రూ. 17 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. రూ. 2.10 కోట్లతో గట్టు మల్లన్న ఆలయాభివృద్ధి, గాంధారి మైసమ్మ ఆలయానికి, గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. డీఈవో యాదయ్య, డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌, వ్యాఖ్యత గుండేటి యోగేశ్వర్‌, ఏసీపీ తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముకేష్‌గౌడ్‌, తోట శ్రీనివాస్‌, సంక్షేమాధికారి చిన్నయ్య, కళాకారులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:47:39+05:30 IST