పత్తికి గండం!

ABN , First Publish Date - 2023-08-02T01:57:15+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎక రాలలో పత్తి పంట నేలమట్టమైంది.

పత్తికి గండం!
తలమడుగు మండలంలో ఇప్పటికీ వరద నీటిలోనే పత్తి పంట

భారీ వర్షాలతో పత్తికి దెబ్బ

ఇప్పటికీ పలుచోట్ల వరద నీటిలోనే పత్తి పంట

గ్రామాల్లో 4లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్న పత్తి

చుట్టుముడుతున్న చీడపీడలు, దిగుబడులపై ప్రభావం

ఎదుగుదల నిలిచిపోవడంతో అన్నదాతల ఆందోళన

జిల్లావ్యాప్తంగా 5లక్షల 71వేల 240 ఎకరాల్లో సాగవుతున్న వివిధ రకాల పంటలు

ఆదిలాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎక రాలలో పత్తి పంట నేలమట్టమైంది. మిగిలిన కాస్త పంట కూడా ఎదుగుదల నిలిచిపోయి ఎరుపుబారుతోంది. జిల్లాలో జూన్‌ 1నుంచి ఆగస్టు 1వరకు 538.3 మి.మీ.ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. 805.1 మి.మీల అధిక వర్షపాతం నమోదైంది. ఈ యేడు వానాకాల సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 5లక్షల 71 వేల 240 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నాలుగు లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటనే సాగవుతుంది. గత పక్షం రోజులుగా ఆకాశానికి చిల్లుపడినట్లుగానే నిత్యం జిల్లాలో ఎక్కడో ఓ చోట భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. భారీ వరదలు ముంచెత్తడంతో ఇప్పటికీ పత్తి పంట వరద నీటిలోనే కనిపిస్తుంది. పెన్‌గంగా నది పరివాహక ప్రాంతంలోని మండలాలైనా జైనథ్‌, బేల, భీంపూర్‌, తాంసితో పాటు తదితర మండలా ల్లో నది బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తింది. దీంతో రోజుల తరబడి పత్తి పంట నీటిలోనే ఉండిపోవడంతో కుళ్లిపోయి వేల ఎకరాలు నేలమట్టమైంది. ఇప్పటికే జిల్లా లో 50వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖాధికారు లు అంచనా వేస్తుండగా.. ఇందులో 25వేల ఎకరాలకు పైగా పత్తి పంటనే దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు మూడేళ్లుగా మద్దతును మించి ధర పలుకడంతో పత్తి పంట వైపే రైతులు ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కానీ కురిసిన భారీ వర్షాలకు రాత్రికి రాత్రే పత్తి పంట గల్లంతు కావడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకుందామంటే అధిక వర్షాలతో ఎదుగుదల నిలిచి పోయి ఎరుపు బారిపోతోంది. ఈ యేడుపెట్టిన పెట్టుబడులైన చేతికి వస్తాయో? రావోనన్న? బెంగతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్లరేగడి నేలల్లోనే భారీనష్టం

ఈ సీజన్‌లో అన్ని మండలాల్లో అధిక వర్షపాతమే నమోదైంది. ఇందులో ఇచ్చోడ మండలంలో అత్యధికంగా 805.4 మి.మీ.ల వర్షపాతం కురవగా వరుసగా ఇంద్రవెల్లి మండలంలో 752.0, సిరికొండ మండలంలో 712.0 మి.మీ.లు, నేరడిగొండ మండలంలో 669.0 మి.మీ., ఉట్నూర్‌ మండలంలో 650.4మి.మీ., బజార్‌హత్నూర్‌ మండలంలో 625.0మీ.మీల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఇప్పటి వరకు బేల మండలంలో 321.8 మి.మీ.ల వర్షం కురిసింది. జైనథ్‌, బేల మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం కురిసింది. జిల్లాలో అధి కంగా నల్లరేగడి, జౌకు నేలలే కావడంతో అధిక వర్షాలతో పంటల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అలాగే కలుపు నివారణ సాధ్యం కాకపోవడంతో పత్తి పంటను కలుపుమొక్కలు కప్పేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలలో కాలు తీసి కాలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎర్రనేలల్లో పంట ఏపుగా పెరిగి కనిపిస్తున్న నల్లరేగడి నేలల్లో మాత్రం అధిక తేమతో పంట ఎదుగుదల కనిపించడం లేదంటున్నారు. నల్ల రేగడి నేలల్లోనే పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లుతుంది. ముసురు వర్షాలు వీడితేనే పత్తి పంటపై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖాధికారులు పర్యటించి పత్తిని ఆశించే చీడపీడలు, పంట ఎదుగుదలపై రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. దీంతో రైతులే తమకున్న సాగు అనుభవంతో రసాయన మందులను పిచికారి చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

వరద నీటిలోనే పత్తి పంట

భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పత్తి పంట నీట మునగడంతో తెగుళ్ల తీవ్రత కనిపిస్తుంది. ప్రధానంగా చీడపీడలు ఆశించి వేరు కుళ్లు వ్యాధి ఉధృతమవుతుంది. రసాయన మందుల పిచికారికి అవకాశమే లేకుండా పోవడంతో పంట నేలమట్టమవుతుంది. చీడపీడల ఉధృతిని అరికట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక తేమతో పంట లు ఎరుపుబారిపోయి కనిపిస్తున్నాయి. రెండు మాసాలు గడుస్తున్నా.. జానడెత్తయిన ఎదిగినట్లు కనిపించడం లేదు. ఎదుగుదశలో ఉన్న పత్తి పంటకు అధిక వర్షాలు తీవ్ర నష్టాన్నే కలిగిస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అధిక వర్షాలతో ఎరుపుబారిపోతున్న పత్తి పంట ఆకులు నేలరాలి పోవడం తో పూర్తిగా ఎదుగుదల నిలిచిపోతుంది. రోజుల తరబడి పంట చేలలో వర్షపు నీరు నిలిచి పత్తి పంట ఎండుబారి పోతుంది. ఇలాంటి పరిస్థితులతో ఈసారి ఆశించిన దిగుబడులు రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎదుగుదల సమయంలో ఆటంకాలు ఏర్పడితే దిగుబడులు భారీగా తగ్గుముఖం పడుతాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే వరదల కారణంగా కొట్టుకు పోయిన పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసేందుకు అన్నదాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పత్తి పంటలో వర్షపునీరు నిలువకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్ర యోజనమే లేదంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఊట చెలిమెల ద్వారా పంట చేనులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. ఎత్తు ప్రాంతాల్లో పత్తి ఏపుగా పెరిగి కనిపిస్తున్నా.. లోతట్టు ప్రాంతాల్లో మాత్రం నేలను విడిచి దాటడం లేదు.

ఇలాగైతే పత్తి పంట చేతికి రావడం చాలా కష్టం

: అల్లకుంట్ల శ్రీనివాస్‌, రైతు, తలమడుగు మండలం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు చేతికి రావడం కష్టంగానే కనిపిస్తుంది. ప్రారంభంలో ఆలస్యంగా కురిసి అవస్థ పెట్టిన వర్షాలు ఆ తర్వాత ఏకధాటిగా కురుస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే భారీ వరదలకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. మిగిలిన పత్తి పంటలో వరద నీరు చేరి తీవ్ర నష్టం కలిగిస్తుంది. రోజుల తరబడి వరద నీటిలోనే పంట మునిగి ఉండడంతో ఎరుపుభారీ ఎండుముఖం పడుతుంది. ఇకనైనా వర్షాలు తగ్గుముఖం పడితేనే పంటలు కళ్లముందు కనిపిస్తాయి. పంట ఎదుగుదల నిలిచిపోవడంతో ఆశించిన దిగుబడులు కూడా రావు.

Updated Date - 2023-08-02T01:57:15+05:30 IST