ప్రమాదంలో పిచ్చుకలు
ABN , First Publish Date - 2023-03-19T22:28:07+05:30 IST
ఒకప్పుడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసిన పిచ్చుకులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి.
- జీవ వైవిధ్యంలో ప్రముఖ పాత్ర
- అంతరిస్తున్న పక్షి జాతి
- రక్షించాల్సిన బాధ్యత అందరిది
ఏసీసీ, మార్చి 19: ఒకప్పుడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసిన పిచ్చుకులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. పిచ్చుకలు జీవ వైవిధ్య రక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. పుష్పజాతుల పరపరాగ సంపర్కంలో ఎనలేని సహకారాన్ని అందిస్తాయి. పిచ్చుక శాస్ర్తీయనామం పాస్పర్ డొమెస్టికస్. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే పిచ్చుకల్లో పరిణామం , రంగుల్లో స్వల్ప తేడాలున్నాయి. ఆడ పక్షులు ఉదా, గోధుమరంగులో ఉంటాయి. మగ పక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్ ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. అంతరించి పోతున్న వీటిని కాపాడేం దుకు ప్రపంచదేశాలు ఏటా మార్చి 20న అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాల స్టాంప్‌లను కూడా విడుదల చేసింది.
మారుతున్న జీవన శైలే కారణం..
జీవన శైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే పిచ్కుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. దీంతో పిచ్చుక జాతి అంతరించి పోతోంది. శర వేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. గతంలో ఊర పిచ్చుకలు గ్రామాల్లో విరివిగా ఉండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీసే వారు. ప్రస్తుతం ఎవరూ దీనిపై శ్రద్ధ చూపడం లేదు. నివాస ప్రాంతాల్లో మట్టి పాత్రల్లో పక్షుల కోసం నీరు, ధాన్యం గింజలను ఉంచాలి. పిచ్చుల ఆవాసం కోసం అట్ట, కర్ర, వెదురుతో చేసిన ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేయాలి. పిచ్చుకలు ఇష్టపడే ఈత చెట్లను విరివిగా పెంచాలి. పిచ్చుకలను బతకనిద్దాం జీవ వైవిద్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో ముందుకు వెళ్లాలి.