27న సింగరేణి ఎన్నికలు
ABN , First Publish Date - 2023-12-04T22:26:24+05:30 IST
ప్రభు త్వ రంగ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అసెం బ్లీ ఎన్నికలు ఉన్నందున గుర్తింపు ఎన్నికలు వాయి దా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది
మంచిర్యాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ రంగ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అసెం బ్లీ ఎన్నికలు ఉన్నందున గుర్తింపు ఎన్నికలు వాయి దా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌ను పరిగణ లోనికి తీసుకున్న హైకోర్టు యాజమాన్యం విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 27న గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన టీబీజీకేఎస్ కాలపరిమితి ముగిసి దాదాపు నాలుగేళ్ళు కావస్తుండటంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారం భం కాగా ప్రతీ రెండేళ్ళకోసారి ఎన్నికల నిర్వహణ జరిగేది. 1998, 2000ల వరకు జరిగిన ఎన్నికలకు కూడా కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉండేది. 2003లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాల పరి మితి నాలుగేళ్ళకు పెంచగా 2017 వరకు కూడా అదే పద్ధతిలో ఎన్నికల నిర్వహణ సాగింది. అయితే చివరిసారిగా 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాలపరిమితి తిరిగి రెండు సంవత్సరాలకు కుదించారు.
కాలపరిమితి ముగియడంతో...
ప్రస్తుతం ఉన్న గుర్తింపు సంఘం నాలుగేళ్ళ క్రితమే కాలపరిమితి ముగియడంతో 7వ దఫా ఎన్నికల నిర్వహణకు కార్మిక సంఘాలు పట్టుబడు తున్నాయి. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న తెలం గాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) 2017 అక్టోబర్ 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. రెండేళ్ల కాలపరిమి తితో బాధ్యతలు చేపట్టిన టీబీజీకేఎస్ కాలపరిమితి పూర్తయి మరో నాలుగేళ్లు అదనంగా గడిచింది. ఇం తకాలం సింగరేణిలో టీబీజీకేఎస్‌కు ఉన్న అధికా రాల కారణంగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. కార్మికుల సమస్యల పట్ల వివక్ష, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు మూటగట్టుకున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళితే టీబీజీకేఎస్‌కు నష్టం తప్ప లాభం ఉండదనే భావనతో ఇంతకాలం వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా...
సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేయగా, అక్టోబర్ 7న వివిధ సంఘాల నేతల నుంచి నామి నేషన్లు స్వీకరించారు. 9న అర్హతగల వారి తుది జాబితా విడుదల చేశారు. అలాగే 10న సంఘాలకు గుర్తులు కేటాయించగా, ఈ నెల 27న ఎన్నికలు నిర్వహిస్తారు. తిరిగి అదే రోజు ఓట్లు లెక్కించడం ద్వారా గుర్తింపు సంఘాన్ని అధికారికంగా ప్రకటి స్తారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సోమవారం హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాను అందజేశారు. ఈ నెల 6న అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, 7న జాబితాపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోనున్నారు. 8న యాజమాన్యం తుది ఓటర్ జాబితాను ప్రదర్శిం చనుంది.