ఆర్టీసీ డ్రైవర్లపై ఆంక్షలు

ABN , First Publish Date - 2023-03-25T23:11:55+05:30 IST

టీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. అనుక్షణం నిఘా నీడన డ్యూటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న విధానాలు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు కల్పిస్తున్నాయని పలువురు డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.

ఆర్టీసీ డ్రైవర్లపై   ఆంక్షలు

మంచిర్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. అనుక్షణం నిఘా నీడన డ్యూటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న విధానాలు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు కల్పిస్తున్నాయని పలువురు డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీలో కార్మికుల సంఖ్యను తగ్గించే ఉద్దేశ్యంతో గతంలో యాజమాన్యం వాలంటరీ రిటైర్మెంట్‌ సర్వీస్‌ (వీఆర్‌ఎస్‌)కు అవకాశం కల్పించారు. వీఆర్‌ఎస్‌లో వెళ్లిపోతే సంస్థ నుంచి వచ్చే లాభాలు వస్తాయో, రావోనన్న భావనలో ఆశించినంత మేర కార్మికుల నుంచి స్పందన రాలేదు. దీంతో ఖర్చులు తగ్గించే నెపంతో యాజమాన్యం సంస్థలో దిద్దుడు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల డ్రైవర్లపై అదనపు పనిభారం పడుతోంది.

పని ఒత్తిడిలో డ్రైవర్లు

ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో డ్రైవర్లపై పని ఒత్తిడి పెరిగింది. గతంలో మంచిర్యాల నుంచి హైద్రాబాద్‌కు నైట్‌ డ్యూటీకి వెళ్లే డ్రైవర్‌కు దినమంతా విశ్రాంతి ఇచ్చేవారు. తిరిగి మరుసటి రోజు రాత్రి విధుల్లో చేరేవాడు. ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా విశ్రాంతి తీసుకునే సమయం దొరకడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఉదాహరణకు మంచిర్యాల నుంచి హైద్రాబాద్‌కు నైట్‌ డ్యూటీపై వెళ్లే బస్సు ఉదయం 5 గంటలకు గమ్యం చేరుకుంటుంది. బస్సును నిలపడం, కాలకృత్యాలు, ఇతరత్రా కార్యక్రమాలు పూర్తయ్యేసరికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. తిరిగి సదరు డ్రైవర్‌ మధ్యాహ్నం 12 గంటలకు విధుల్లో చేరాలి. ఈ మధ్యలోనే అతను విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి నెలకొంది. సరైన విశ్రాంతి లేకుండానే డ్యూటీలో చేరడంతో అలసటకు గురవుతున్నట్లు డ్రైవర్లు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో డ్యూటీలో నిద్ర వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

కమీషన్లలో భారీ కోత

హైద్రాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు సొంతంగా టిక్కెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్లు టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్‌ (టిమ్‌)ను వినియోగి స్తారు. టిమ్‌ ద్వారా గతంలో ఒక్కో టికెట్‌పై రూ.3 కమీషన్‌ చెల్లించేవారు. ప్రస్తు తం దాని రూ.2కు కుదించారు. రిజర్వేషన్‌ టికెట్‌పై రూ.1కి కుదించారు. సాధా రణంగా నైట్‌ డ్యూటీ బస్సులో 90 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. నాలుగైదుకు మించి బస్సులో టిక్కెట్లు తీసుకొనే అవకాశం ఉండదు. అలా అదనపు విధులకు వచ్చే కమీషన్‌లో కూడా సంస్థ కోత విధించింది. మంచిర్యాల నుంచి కరీంనగర్‌ షటిల్‌ బస్సులకు రూ.18వేల టార్గెట్‌ విధిస్తారు. ఇందులో 2 శాతం సెస్‌ పోగా మిగిలిన దానిపై గతంలో డ్రైవర్లు, కండక్టర్లకు వేర్వేరుగా రూ.40 వరకు చెల్లించే వారు. ప్రస్తుతం రూ.18 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి వెయ్యికి రూ.17 చొప్పున బోనస్‌ చెల్లిస్తున్నారు. బస్సు చార్జీలు పెరగడం, టార్గెట్లు పెంచినప్పటికీ సిబ్బంది కమీషన్లు తగ్గించడం గమనార్హం.

సీసీ కెమెరాలతో నిఘా

సూపర్‌ లగ్జరీ లాంటి సర్వీసుల్లో ఇటీవల సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. బస్సు రిజర్వేషన్లు చేయించుకొనే ప్రయాణికుల ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లో డ్రైవర్‌ సెల్‌ నంబరు ఉంటుంది. బస్సు సమాచారం కోసం ప్రయాణికులు డ్రైవర్‌కు ఫోన్లు చేస్తుంటారు. బస్సు బయల్దేరే సమయానికి మొదలయ్యే ఫోన్లు దాదాపు అరగంటపాటు వస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. హైద్రాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌కు వచ్చే వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయని, ప్రయాణికులకు సమాధానం చెప్పడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కారణంగా ఫైన్లు విధించడం, బస్సులను పక్కకు పెట్టించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. పైగా బస్సులో ఉన్న సీసీ కెమెరాల్లో గమనిస్తున్న పై అధికారులు డ్యూటీ అనంతరం డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఆన్‌లైన్‌ లీవు దరఖాస్తుతో ఇబ్బందులు

ఆర్టీసీ సిబ్బంది సెలవుల కోసం ఆన్‌లైన్‌ యాప్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంస్థ ప్రత్యేకంగా టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీ అనే యాప్‌ను రూపొందించింది. గతంలో లీవు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో పై అధికారులు సానుకూలంగా స్పందించని పక్షంలో డిపో మేనేజర్‌కు విన్నవించే వారు. ఆన్‌లైన్‌ యాప్‌ కారణంగా ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో అత్యవసర సమయాల్లో లీవు మంజూరు అవుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో డ్రైవర్లు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వేసవి కాలం కావడంతో ‘ఛాలెంజ్‌’ పేరుతో మూడు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి లీవులు మంజూరు చేయక పోవడం, విధులు సక్రమంగా నిర్వహించాలనే నిబంధన విధించారు. వేసవికాలం ముగిసే వరకు సిబ్బంది సెలవుల మాట ఎత్తే అవకాశం లేదు. మంచిర్యాల డిపోలో 200 మంది వరకు డ్రైవర్లు ఉండగా, 180 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. నూతన విధానం అమలు చేస్తుండటంతో వారంతా మనోవేదనకు గురవుతున్నారు.

Updated Date - 2023-03-25T23:11:55+05:30 IST