వేతన జీవులకు ఊరట

ABN , First Publish Date - 2023-02-01T22:22:04+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ వేతన జీవులకు ఊరట కలిగించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.

వేతన జీవులకు ఊరట

మంచిర్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ వేతన జీవులకు ఊరట కలిగించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. గతంలో ఉన్న ఇన్‌కంట్యాక్స్‌ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడంపై వేతన జీవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామా న్య, మధ్య తరగతి ప్రజలను పట్టించుకోని నిర్మల కార్పొరేట్‌ శక్తులకే కొమ్ముకాశారనే అభిప్రాయాలు సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతు న్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, ధరల పెంపుపై ప్రస్తావన లేకపోవడం పేద, మధ్య తరగతి ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోంది.

తగ్గేవి ఇవి..

ఎలక్ట్రిక్‌ వాహనాలు, టీవీలు, మొబైల్‌ ఫోన్లు, కిచెన్‌ చిమ్నీలు

పెరిగేవి ఇవి...

బ్రాండెడ్‌ దుస్తులు, సిగరెట్లు, బంగారం, వెండి, డైమండ్‌, వాహనాల టైర్ల ధరలు పెరగనున్నాయి.

సింగరేణిలో ఐటీ రద్దు ప్రస్తావన ఏది

ఇన్‌కంట్యాక్స్‌ పరిధిని రూ. 7 లక్షలకు పెంచుతూ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం సింగరేణి కార్మికుల ఐటీ రద్దును ప్రస్తావించలేదు. కార్మికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఐటీ రద్దు ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేస్తామని నాయకులు హామీలు ఇవ్వడమే తప్ప కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

ఐటీ స్లాబుల్లోనూ ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. కొత్త పన్ను శ్లాబులు ఇలా ఉన్నాయి. సంత్సరాదాయం 0 నుంచి రూ. 3 లక్షలకు ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తుండగా, రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు 10శాతం, రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం, రూ.15 లక్షలు దాటిన ఆదాయంపై 30 శాతం పన్ను విధిండంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

ఐటీ పరిధి పెంచాల్సింది

వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

ఎకనామికల్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ (ఈబీసీ) వర్గాలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇన్‌కంట్యాక్స్‌ పరిధి రూ.8 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో ఆయా వర్గాలకు ఊరట కలగలేదనే చెప్పాలి. మరోవైపు వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఐటీ పరిధి పెంచకపోవడం సరైంది కాదు. సింగరేణి కార్మికులకు పూర్తిగా ఇన్‌కంట్యాక్స్‌ తొలగించాలని దశాబ్దాలుగా డిమాండ్‌ ఉంది. ఆ అంశాన్ని ప్రస్తావనకు తీసుకోకపోవడం బాధాకరం.

ఆశాజనకంగా లేదు...కామని శ్రీనివాస్‌, లెక్షరర్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు కాకుండా కార్పొరేట్‌ కంపెనీలకు లాభదాయకంగా ఉంది. రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ప్రవేశ పెడితే రైల్వేలకు నిధుల కేటాయింపు ఎక్కువగా ఉండేది. స్థానిక అవసరాలకు బడ్జెట్‌ ఉపయోగపడేది. ఆర్థిక మంత్రి రైల్వేలకు న్యాయం చేయలేకపోయారు.

కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలికేలా ఉంది

డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మోతె జయకృష్ణ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలికేలా ఉంది. సేవింగ్స్‌ పరిధి పెంచితే ఉద్యోగులకు లాభం జరిగేది. తలసరి ఆదాయం పెరిగితే అది దేశాభివృద్ధి కిందకు రాదు. కార్పొరేట్‌ సంస్థల ఆదాయాన్ని దృష్టిలో పెంచుకుని బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లయింది.

ఆదాయపన్ను పరిమితి పెంచడం సంతోషదాయకం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహా యింపు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచడం సంతోషదాయకం. వేతన జీవులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన బడ్జెట్‌ ఇది. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి మోదీకి సింగరేణి కార్మికులు, ఉద్యోగుల తరుపున ధన్యవాదాలు.

పేద, మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉంది. వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయం మధ్య తరగతి ప్రజలకు మేలు జరిగేలా ఆదాయ పన్ను రాయితీని రూ. 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు.

బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకం

ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. బడ్జెట్‌ కార్మిక, కర్షక, మధ్య తరగతి వర్గాలపై భారం మోపుతోంది. ధరల నియంత్రణ, నిరుద్యోగం అదుపు దిశగా బడ్జెట్‌ లేదన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వమని బడ్జెట్‌తో నిరూపితమైంది.

Updated Date - 2023-02-01T22:22:07+05:30 IST