మాస్టర్‌ప్లాన్‌ చుట్టూ పార్టీల మంత్రాంగం

ABN , First Publish Date - 2023-01-26T01:30:05+05:30 IST

జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్‌ వ్యవహారం రాజకీయ మంత్రాంగానికి మరింత పదును పెడుతోంది.

మాస్టర్‌ప్లాన్‌ చుట్టూ పార్టీల మంత్రాంగం
మాస్టర్‌ప్లాన్‌పై వివరిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ ( ఫైల్‌ )

పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు

మారుతున్న పొలిటికల్‌ సీన్‌

రోజురోజుకు తీవ్రమవుతున్న జోన్‌ల మార్పు వివాదం

ప్లాన్‌రద్దుపై భిన్నాభిప్రాయాలు

నిర్మల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్‌ వ్యవహారం రాజకీయ మంత్రాంగానికి మరింత పదును పెడుతోంది. గత పదిరోజుల నుంచి అఽధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాస్టర్‌ప్లాన్‌ వివాదం అగ్గి రాజేస్తోంది. పరస్పర ఆరోపణలు, పోటాపోటీగా ప్రత్యారోపణలతో జిల్లాకేంద్రంలోని రాజకీయ ముఖచిత్రం వేడేక్కుతోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ జోన్‌, ఇండస్ర్టీయల్‌, గ్రీన్‌, కమర్షియల్‌, రిక్రియేషన్‌ జోన్‌ల పేరిట పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ మాస్టర్‌ప్లాన్‌ మొత్తం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు అనుకూలంగా రూపొందించారని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేత లు గత పదిరోజుల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్న సం గతి తెలిసిందే. ఇటు కలెక్టరేట్‌, అటు మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించడమే కాకుండా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి తోడు రైతులు తమ భూములను ఇండస్ర్టియల్‌ జోన్‌ పరిధిలోకి చేర్చారంటూ ప్రతిపక్షాలతో పాటు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే వీరంతా మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను కలిసి తమ గోడును వివరించారు. మాస్టర్‌ప్లాన్‌లో తమ భూములను కోల్పోకుండా చూడాలని తామంతా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నామంటూ వారు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి మాస్టర్‌ప్లాన్‌ను నిలిపివేస్తామంటూ రైతుల ముందు ప్రకటించారు. మంత్రి ప్రకటనపై కూడా ప్రతిపక్షాలు అనేక రకాల సందేహాలను లేవనెత్తుతున్నాయి. మున్సిపల్‌ తీర్మానం లేకుండా మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయడం సాఽధ్యం కాదంటూ అలాగే రాష్ట్రప్రభుత్వం నుంచి గాని సంబంధిత మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నుంచి గాని మాస్టర్‌ప్లాన్‌ రద్దుపై స్పష్టమైన ప్రకటన వెలువడకున్నప్పటికీ అటవీ, న్యాయ, దేవాదాయశాఖకు నేతృత్వం వహిస్తున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ మాస్టర్‌ప్లాన్‌ను ఎలా రద్దు చేస్తారంటూ ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. కాగా గత రెండు, మూడు రోజుల నుంచి మాస్టర్‌ప్లాన్‌ వ్యవహారం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అమీతుమీకి కారణమవుతోంది. పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ కేవలం ముసాయిదా మాత్రమేనని, ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ మాస్టర్‌ప్లాన్‌పై తమ అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉందని వారందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేపడతామంటూ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ భరోసానిస్తున్నారు. అయినప్పటికీ రైతులు, స్థానిక భూముల యజమానులు ఆ హామీని విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. దీంతో ఈ వ్యవహారం అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

అధికార , విపక్షాల మధ్య హోరాహోరీ

కాగా కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన వ్యవహారం ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల మధ్య ఆగ్రహజ్వాలకు ఆస్కారమిస్తోంది. గత పది రోజుల నుంచి మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదాపై బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. చిలికి చిలికి గాలివానలాగా ప్రస్తుతం ఈ వ్యవహారం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమవుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూ మాస్టర్‌ప్లాన్‌పై సవరణలకు అవకాశం ఉందని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది మాస్టర్‌ప్లాన్‌ను వెల్లడిస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు గాని, మున్సిపల్‌ అధికారులు గాని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.

జోన్‌ల మార్పుపై ఆరోపణలు

కాగా అధికారపార్టీ నేతలు తమ విలువైన భూములను ఇండస్ర్టీయల్‌, కమర్షియల్‌, గ్రీన్‌జోన్‌ల పరిధి నుంచి తప్పించి రెసిడెన్షియల్‌ జోన్‌ పరిధిలోకి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేశారంటూ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీని వెనక మంత్రితో పాటు బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల హస్తం ఉందని పథకం ప్రకారం రైతులు, అమా యక ప్రజల భూములను ఇండస్ర్టీయల్‌, గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మార్చి అధికార పార్టీ నేతల భూములను రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల భూములను కాపాడేందుకే కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారన్న నేపథ్యంలో విమర్శసాస్ర్తాలు ఇరు పార్టీల నేతలు సంధించుకుంటున్నారు. గత పదిరోజుల నుంచి నిర్మల్‌లో ప్రధాన పార్టీల మధ్య విమర్శలతో ప్రచ్చన్న యుద్దం కొనసాగుతోంది.

మాస్టర్‌ప్లాన్‌ రద్దుపై భిన్నాభిప్రాయాలు

ఇదిలా ఉండగా మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నామంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన ప్రకటనపైనా అలాగే మాస్టర్‌ప్లాన్‌లో ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చే స్తామంటూ మున్సిపల్‌ చైర్మన్‌ చేస్తున్న ప్రకటనలు పరస్పరం భిన్నంగా ఉండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. మాస్టర్‌ప్లాన్‌ రద్దుచేసే అధికారం మున్సి పల్‌ తీర్మానంను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికే ఉంటుందని అలాం టిది మంత్రి మాస్టర్‌ ప్లాన్‌ను నిలిపివేస్తున్నామంటూ ప్రకటించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాపై అభిప్రాయాలు స్వీకరించడం నిలిపివేయకపోవడం అలాగే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామంటూ ప్రకటిస్తుండడం పట్ల స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా ప్రజలంతా కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించవచ్చని అంద రి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునితుది మాస్టర్‌ ప్లాన్‌ను ఖరారు చేస్తామంటూ మున్సిపల్‌ చైర్మన్‌, సంబందిత అధికారులు చెబుతున్నప్పటికి ప్రజలు మాత్రం ఈ ప్రకటనపై ఇంకా గందరగోళానికి లోనవుతున్నారంటున్నారు.

Updated Date - 2023-01-26T01:30:07+05:30 IST