మధ్యాహ్నభోజన కార్మికుల వెతలు

ABN , First Publish Date - 2023-09-19T22:31:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సంవత్సరాలు గడుస్తున్నా అమలు కావడం లేదు. విద్యార్థులకు మధ్యా హ్న భోజనం సరిగ్గా అందుతోందా..? రుచి బాగుంటోందా..? వారానికి మూడు రోజులు గుడ్డు ఇస్తున్నారా? వంట గదిని శుభ్రంగా ఉంచుతు న్నారా? తదితర అంశాలపై ఆరాదీస్తున్న ప్రభుత్వం అవి తయారు చేసే కార్మికులను విస్మరించడం విడ్డూరంగా ఉంది.

మధ్యాహ్నభోజన కార్మికుల వెతలు

మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ సంవత్సరాలు గడుస్తున్నా అమలు కావడం లేదు. విద్యార్థులకు మధ్యా హ్న భోజనం సరిగ్గా అందుతోందా..? రుచి బాగుంటోందా..? వారానికి మూడు రోజులు గుడ్డు ఇస్తున్నారా? వంట గదిని శుభ్రంగా ఉంచుతు న్నారా? తదితర అంశాలపై ఆరాదీస్తున్న ప్రభుత్వం అవి తయారు చేసే కార్మికులను విస్మరించడం విడ్డూరంగా ఉంది. మధ్యాహ్న భోజనంలో సుచి, శుభ్రత, నాణ్యతపై ఆరా తీస్తున్న ప్రభుత్వం అందుకు సరిపడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు పెంచాల్సింది పోయి నెల నెలా బిల్లు చెల్లించకపోవడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మెనూ అమలు అసాధ్యం....?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డుతోపాటు నాణ్యమైన భోజనం ఇచ్చేలా మెనూను రూపొం దించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్న భోజనం అందిం చాలంటే కష్టంగా ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. ఒక గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 ఉండగా ప్రభుత్వపరంగా కేవలం రూ.5 చెల్లిస్తుండడంతో మెనూ అమలు కష్టసాధ్యంగా మారింది. కిరాణా షాపుల్లో రూ.6 వెచ్చింది కొనుగోలు చేయాల్సి వస్తోంది. బియ్యం మినహా ఇతర సామగ్రి అంతా ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చాల్సి ఉన్నందున ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు సరిపోవడం లేదు. దీంతో ప్రభుత్వ పరంగా రూపొందించిన మెనూ అమలు సాధ్యమెలా అవుతుందని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లుల చెల్లింపు చేయా లని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అరకొర బిల్లులతో అప్పులపాలు కావాల్సి వస్తుందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మొత్తం 714 ఉన్నాయి. వీటిలో దాదాపు 44వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి రోజు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాల్సి ఉంది.

అరకొర చెల్లింపులతో అవస్థలు

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ప్రభుత్వపరంగా చెల్లిస్తున్న అరకొర చెల్లింపులతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఒకొక్కరికి రూ. 5.45 చెల్లిస్తుండగా హై స్కూల్‌ విద్యార్థులకు సగటున రూ.9 చెల్లిస్తోంది. ఈ ధరలతో మెనూ అమలు చేయలేక నిర్వాహకులు అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రైమరీ పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఒక్క రోజు రూ.54.50 ప్రభుత్వం చెల్లిస్తుండగా ఖర్చు రూ.75 దాటుతోందని చెబుతున్నారు. పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి వంద గ్రాముల చొప్పున బియ్యం మినహా మిగతా కూరగాయలు, నూనె, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, తదితర సరుకు లన్నీ నిర్వాహకులే కొనుగోలు చే యాల్సి వస్తోంది. అన్నం ఉడికించేందుకు అవసరమైన గ్యాస్‌ను ప్రభుత్వం సమకూరుస్తుండగా కూరలు వండేం దుకు అయ్యే ఖర్చు నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది. దీంతో మధ్యా హ్న భోజన నిర్వాహకులు సరుకులను ఉద్దెరకు తీసుకువచ్చి నెట్టుకు వస్తున్నారు. ఇలా ప్రతీ పది మంది విద్యార్థులకు రూ.15 అదనంగా చెల్లిం చాల్సి వస్తుండగా ప్రభుత్వం రుచి, సుచీ అంటూ నివేదికలను కోరడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో ఓ వైపు నిత్యావసరాలు, కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో మెనూ అమలుపై ప్రభావం చూపుతోంది.

అమలుగానీ సీఎం హామీ

మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.2 వేలు పెంచి మొత్తం రూ. 3వేలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి 18 నెలల క్రితం కార్మికులకు రూ. 2వేల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ పాత వేతనం రూ. వెయ్యి మాత్రమే అందుతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అది కూడా ఏప్రిల్‌ నుంచి చెల్లించడం లేదు. ఇదిలా ఉండగా బిల్లులు కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1 నుంచి 8 తరగతులకు గుడ్డు బిల్లులు జనవరి నుంచి చెల్లించకపోగా, 9,10 తరగతులకు మార్చి నుంచి ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా దసరా నుంచి బ్రేక్‌ ఫాస్ట్‌ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. నెల నెలా బిల్లులు చెల్లించని ప్రభుత్వం కొత్తకొత్త విధానాలు తీసుకు వస్తుండటంతో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు.

సమ్మె యోచనలో కార్మికులు

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిరవధిక సమ్మెబాట పట్టేం దుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెల 27లోగా పాత బకాయిలు చెల్లించడంతోపాటు, పెంచిన వేతనం, అరియర్స్‌ చెల్లించాలని ప్రభుత్వా నికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో 28 నుంచి సమ్మెబాట పట్టాలనే యోచనలో కార్మికులు ఉన్నారు. కలెక్టర్‌తోపాటు, డీఈవోకు సమ్మె నోటీసు అందజేశారు.

మెనూ చార్జీలు పెంచాలి

దాసరి రాజేశ్వరి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు

మధ్యాహ్న భోజనం వండి వార్చేందుకు సరిపడా బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయాలి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణం గా నిర్వాహకులకు ఇచ్చే మెనూ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నిర్వాహకులకు ఆరు నెలల బిల్లులు బకాయి ఉన్నాయి. బిల్లులు చెల్లించనిదే దుకాణాలలో సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభు త్వపరంగా గుడ్లను మంజూరు చేయాలి. ప్రతీ నెల 10వ తేదీ లోపు బిల్లులు చెల్లించాలి. నిర్వాహకులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి.

Updated Date - 2023-09-19T22:31:08+05:30 IST