ముగిసిన మద్యం టెండర్లు

ABN , First Publish Date - 2023-08-18T22:24:30+05:30 IST

మద్యం షాపులకు టెండర్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 4న దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా ప్రభుత్వం 15 రోజులపాటు గడువు ఇచ్చింది. 2023-2025 సంవత్సరానికిగాను ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, జిల్లా స్థాయిలో అధికారులు మద్యం షాపులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.

ముగిసిన మద్యం టెండర్లు

మంచిర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపులకు టెండర్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 4న దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా ప్రభుత్వం 15 రోజులపాటు గడువు ఇచ్చింది. 2023-2025 సంవత్సరానికిగాను ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, జిల్లా స్థాయిలో అధికారులు మద్యం షాపులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ఈసారి మొత్తం 73 ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్నారు. గత మద్యం షాపుల కాలపరిమితి నవంబర్‌తో ముగియనుండగా, ఎన్నికల కోడ్‌ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు టెండర్లను నిర్వహించింది. గత మద్యం పాలసీ ప్రకారం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులకు గడువు ముగిసే నాటికి అమ్మకాలు కొనసాగించేలా వెసలుబాటు కల్పించింది. కాగా టెండర్లకు చివరి రోజున వ్యాపారుల నుంచి భారీ స్పందన లభించింది.

సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు

జిల్లాలో మద్యం షాపులకు రిజర్వేషన్లు కల్పించడంతో ఆయా వర్గాలకు చెందిన వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లాలో మొత్తం 73 మద్యం షాపులు ఉండగా, 22 దుకాణాలను వివిధ వర్గాల వారికి రిజర్వు చేశారు. ఎస్సీ సామాజిక వర్గాలకు 10, ఎస్టీలకు 6, గౌడ కులస్థులకు 6 షాపులను రిజర్వు చేశారు. మిగతా 51 షాపులకు ఆయా రిజర్వేషన్‌ వర్గాలతోపాటు నాన్‌ రిజర్వు వర్గాలకు చెందిన వ్యాపారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసలుబాటు కల్పించారు.

లైసెన్ను రుసుం ఇలా

గతంలో మాదిరిగానే 2023-25 మద్యం పాలసీ లైసెన్సు ఫీజును యథావిధిగా కొనసాగిస్తున్నారు. లైసెన్సు రుసుమును ఆరు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉండగా, జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజును స్లాబుల వారీగా నిర్ణయించారు. లైసెన్సు ఫీజును 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మొత్తం 17 షాపులు కేటాయించగా ఒక్కో దుకాణానికి యేడాదికి రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 5వేల నుంచి 50వేల జనాభా గల పట్టణాల్లో 17 షాపులు ఉండగా సాలుసరి ఫీజు రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 38 షాపులు ఉండగా రూ. 60 లక్షలు సాలుసరి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్క జైపూర్‌ మండలం ఇందారంలో ఒక షాపు ఉండగా, ఇక్కడ మాత్రం గరిష్టంగా సాలుసరి లైసెన్సు ఫీజు రూ.65 లక్షలు నిర్ణయించారు. ఇక్కడ 5వేల లోపు జనాభా ఉన్నప్పటికీ రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి 5 కిలోమీటర్ల లోపు పెరిఫెరి ఉన్నందున ఇక్కడ రూ.5 లక్షలు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సర్కారుకు భారీగా ఆదాయం

మద్యం షాపుల టెండర్లలో పాల్గొన్న వ్యాపారులు నిబంధనల మేరకు దరఖాస్తు రుసుము కింద ఒక్కో షాపునకు రూ.2 లక్షలు చెల్లించగా జిల్లాలోని 73 షాపులకుగాను మొత్తం 2,185 దరఖాస్తులు రాగా రూ.4 కోట్ల 37 లక్షల ఆదాయం సర్కారు ఖజానాకు సమకూరింది. గతేడాది 1194 దరఖాస్తులు రాగా ఈ యేడు అదనంగా 800 పైచిలుకు దరఖా స్తులు వచ్చాయి. జిల్లాలో మద్యం వ్యాపారం లాభాల బాటలో ఉండటం తో లిక్కర్‌ వ్యాపారుల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. వ్యాపారులు కొందరు సిండికేటుగా ఏర్పడి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేయ డంతో ఊహించిన దానికంటే అదనపు ఆదాయం సమకూరింది. అయితే ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే వెస లుబాటును ఈ సారి ప్రభుత్వం కల్పించినప్పటికీ, షాపులు దక్కపోతే పెద్ద మొత్తంలో నష్టం వాటి ల్లుతుందనే భావనంతో సిండికేట్‌గా మారడా నికే వ్యాపారులు మొగ్గు చూపారు. కాగా చివరి రోజు సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి టోకెన్లు ఇవ్వడం ద్వారా దరఖాస్తు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

చివరి రోజు అనూహ్య స్పందన

మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేందుకు చివరి రోజు వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా తొలుత మందకొడిగా సాగగా, క్రమంగా ఊపందు కుంది. ఈ నెల 17వ తేదీ వరకు అనూహ్యంగా 971 దరఖాస్తులు వచ్చాయి. అయితే చివరి రోజు భారీగా దరఖాస్తులు రావడంతో అధి కారులకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని దాటగలిగారు. చివరి రోజు ఏకం గా 1,214 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా జన్నారం మండలం ఇందన్‌పల్లి 9, అత్యధికంగా ఇందారం 86 దరఖాస్తులు వచ్చాయి.

21న లక్కీ డ్రా

మద్యం టెండర్లు ముగియడంతో కలెక్టర్‌ నేతృత్వంలో అబ్కారీశాఖ అధ్వర్యంలో ఈ నెల 21న లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమ క్షంలో లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో దుకాణాలు దక్కించుకున్న లబ్ధిదారులు డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుండగా, అదే రోజు నుంచి దుకాణాల్లో విక్రయాలు జరిపే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-18T22:24:30+05:30 IST