Share News

Kumaram Bheem Asifabad: ఎవరిని కరుణిస్తారో?

ABN , First Publish Date - 2023-11-20T22:34:10+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని కనికరించబోతున్నారన్న విషయం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా ఏ మాత్రం అంతుచిక్కటం లేదు. గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీపై పైకి వ్యతిరేకత బాగానే కన్పిస్తున్నా అది విపక్షాలకు ఓట్ల బదిలీగా మారుతుందా..? లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు.

Kumaram Bheem Asifabad:   ఎవరిని కరుణిస్తారో?

-అంతుచిక్కని ఓటరు నాడి

-అన్ని పార్టీల సభకు జనం

-రోజుకోరకంగా మారుతున్న సమీకరణలు

-కులం ఓట్లదే కీలకపాత్ర

-ఓట్ల బదిలీపై ఎవరి లెక్కలు వారివే

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని కనికరించబోతున్నారన్న విషయం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా ఏ మాత్రం అంతుచిక్కటం లేదు. గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీపై పైకి వ్యతిరేకత బాగానే కన్పిస్తున్నా అది విపక్షాలకు ఓట్ల బదిలీగా మారుతుందా..? లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ లు కూడా హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ మూడు పార్టీల మధ్య సమీకరణలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పడు అప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక్కోరకమైన సమీకరణలు చోటు చేసుకుంటుండటంతో ఫలాన పార్టీది పైచేయిదిగా ఉండవచ్చని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సిర్పూరు నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటీగా బీఎస్పీ కూడా అనూహ్యంగా పుంజుకుంటుండటం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం బీఎస్పీకి ఒకటి, రెండు సామాజికవర్గాల ఓటు బ్యాంకు ఉన్నట్టు కన్పిస్తున్నా బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య చీలే ఓట్ల వల్ల ముగ్గురి మధ్య త్రిముఖపోరు ఉత్పన్నం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మైనార్టీ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందన్నది అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఈ సామాజికవర్గ ఓటర్లు గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వైపు నిలుస్తూ వచ్చారు. కానీ ఈ దఫా బీఎస్పీ అరగ్రేటంతో ఈ ఓటర్లలో చీలకవచ్చే పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. అయితే నియోజకవర్గం మొత్తం సమీకరణలను పరిగణలోకి తీసుకున్నప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలుంటే మాత్రం మైనార్టీ ఓటర్లు ఏకీకృతం అయి బీఆర్‌ఎస్‌ లేదా బీఎస్పీ వైపు మొగ్గే వైపు ఉందనంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. పోల్‌ మేనేజ్‌మెంటులో సమర్థుడిగా గుర్తింపు పొందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తన ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగల నేర్పరి అని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో ఈ దఫా అభ్యర్థులపై కంటే ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బరిలోఉన్న నలుగురిలో ఫలానా అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కూడా ఇంచుమించు ఇదే తరహా పరిస్థితులు కన్పిస్తున్నాయి. అయితే ఇక్కడ కేవలం ద్విముఖ పోటీగానే పోరు కొనసాగే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ గోండు ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరిసంఖ్య దాదాపు 70వేలపైచిలుకు ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో 66వేలపైగా బీసీ ఓటర్లు, 26వేలు లంబాడ గిరిజనులు, 18వేలకుపైగా మైనార్టీలున్నారు. వీరిలో గోండుల ఓట్లలో అధికార పార్టీ వైపు కొంతమొగ్గు కన్పిస్తున్నప్పటికీ బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓటర్ల మొగ్గు ఎటు వైపు ఉండబోతోందన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎటు వైపు మొగ్గితే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ 10రోజులు కీలకం..

ఎన్నికల పర్వంలో రాబోయే 10రోజులు అత్యంత కీలక సమయం అని చెప్పక తప్పదు. ఇప్పటికే ప్రచారంలో నువ్వా.. నేనా అన్నట్టు తలపడుతున్న రాజకీయపార్టీలు రాబోయే పది రోజుల్లో సామాజిక సమీకరణలు సమూలంగా మార్చివేసే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఈనెల 25నుంచి 30తేదీల మధ్య సానుకూల ప్రతికూల ఓటింగ్‌ సమీకరణలు పూర్తిగా మారిపోయే పరిస్థితులు ఉండవచ్చని భావిస్తున్నారు. అధికారపార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మేనిఫెస్టో వార్‌ తారాస్థాయికి చేరిన దరిమిలా ఓటర్లను ఏ పార్టీ ఆకట్టుకోగలిగితే ఆ పార్టీ వైపు సమీకరణలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా చివరి రెండ్రోజుల్లో అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు కూడా మూడు నుంచి ఐదుశాతం మంది ఓటర్లను ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ 10రోజులు అన్ని పార్టీలకు అత్యంత కీలక సమయమే అని చెప్పాలి.

Updated Date - 2023-11-20T22:34:12+05:30 IST