Kumaram Bheem Asifabad: మరోసారి ఓటరు జాబితా సవరణ
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:54 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 17: ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు.. ఆ వెనువెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు.. జరుగబోతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికల సంఘం మరోసారి ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టంది.
-కొత్త ఓటర్ల నమోదుకు కసరత్తు
-పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వేగంగా ప్రక్రియ
-ఇప్పటికే పని ప్రారంభించిన అధికారులు
కాగజ్‌నగర్, డిసెంబరు 17: ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు.. ఆ వెనువెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు.. జరుగబోతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికల సంఘం మరోసారి ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టంది. ఇటీవల జరిగిన శాసన సభల ఎన్నికల ముందు నవంబరు 3వ తేదీన చివరిసారి తుది జాబితాలను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ తాజాగా మరోసారి కొత్త ఓటరుకు అవకాశం కల్పిస్తూ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20నుంచి జనవరి 5వరకు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టనుండగా, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. జనవరి నెలలో 18సంవత్సరాలు నిండిన యువతీయువకులను ఓటరు జాబితాలో చేర్చాలని సూచిస్తున్నారు. ఇందుకు గాను జిల్లాలో ఉన్న బీఎల్‌వోలకు ముందస్తుగానే సమాచారం అందించారు. అలాగే ప్రకటనలు కూడా జారీ చేశారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలలో రెవెన్యూ అధికారులకు ప్రత్యేక నోటీసులను కూడా పంపించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను తప్పకుండా ఓటరు జాబితాలో చేర్పించాలని కళాశాలల సిబ్బందికి సూచించారు. కొత్త ఓటర్లు చేర్పిస్తుండటంతో ఓటరు జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,24,661 ఓటర్లు ఉండగా, సిర్పూరు నియోజకవర్గంలో 2,26,874 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకునే వారు తప్పకుండా ఫాం-6 ద్వారా ఆయా మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఫొటో, ఆధార్ కార్డు జతపర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ నమోదు చేసిన తర్వాత ఓటరు జాబితాలో అనుమతించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు, బీఎల్‌వోలు విచారణ జరిపి ఓటరు జాబితాలో కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. ఇందుకు ఈనెల 20నుంచి కొత్త వారు దరఖాస్తులు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల 5 వరకు చివరి గడువు విధించారు. ఈ విషయాన్ని కళాశాలల గ్రూపుల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొత్త ఓటరు జాబితాతోనే సర్పంచి ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సర్పం చి ఎన్నికల విషయంలో కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల ఎప్పుడు ప్రకట్రించినా కూడా అంతా సిద్ధంగా ఉండాలని కిందిస్థాయి సిబ్బందికి అధికారులు సూచిస్తున్నారు.
అందరికీ అవగాహన పరుస్తున్నాం..
-శ్రీపాల్ రెడ్డి, తహసీల్దార్, కాగజ్‌నగర్
ప్రతి జనవరి నెలలో కొత్త ఓటరు జాబితాను చేయటం జరుగుతుంది. చనిపోయిన వారివి తొలగిస్తాం. అలాగే 18 ఏళ్లు నిండిన ఓటర్లను ఓటరు జాబితాలో చేర్పిస్తాం. ఇందుకు ఫాం-6 దరఖాస్తులు నింపి, ఫోటో, ఆధార్ కార్డు జతపర్చి మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాగానే సంబంధిత బీఎల్‌వోలు, రెవెన్యూ అధికారులు విచారణ జరిపి కొత్త ఓటరు జాబితాలో చేర్చుతారు.