Kumaram Bheem Asifabad: వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2023-05-25T22:09:40+05:30 IST

చింతలమానేపల్లి, మే 25: వానాకాలం సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వానా కాలం సీజన్‌లో రైతులు వేసే పంటల ఆధారంగా వాటికి అవసరమైన ఎరువులు, వితనాలు అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Kumaram Bheem Asifabad: వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

- ఈ ఏడాది 4.5లక్షల ఎకరాల్లో సాగుకు అంచనా

- అధికశాతం పత్తి వైపే మొగ్గు

- నకిలీ విత్తనాలపై ప్రత్యేక నజర్‌

- ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారుల ఏర్పాట్లు

- పొలం బాట పట్టనున్న రైతాంగం

చింతలమానేపల్లి, మే 25: వానాకాలం సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వానా కాలం సీజన్‌లో రైతులు వేసే పంటల ఆధారంగా వాటికి అవసరమైన ఎరువులు, వితనాలు అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పరిధిలో ఏయే పంటలు సాగవుతాయో అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో పత్తి పంటనే రైతులు అధికంగా సాగు చేయగా ఈ ఏడాది సైతం రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ద్వితీయ స్థానంలో వరి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ఏడాది 4.5 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..

జిల్లాలోని 15మండలాల పరిధిలో మొత్తం 4.5లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా పత్తి అధిక మొత్తంలో 3.5లక్షల ఎకరాలు, వరి 58,000ఎకరాలు, కంది 35,000 ఎకరాలు, సోయా 3800ఎకరాలు, జొన్న 1000ఎకరాలు, మొక్కజొన్న 1200ఎకరాలు, ఇతర పంటలు 1000ఎకరాల్లో సాగవుతాయని అంచనా. రైతాంగానికి పత్తిసాగు కోసం విత్తన ప్యాకెట్లు సుమారుగా 7లక్షల విత్తనప్యాకెట్లు, వరి 8700క్వింటాళ్లు అవసరమవుతాయి. ఎరువులు సుమారుగా యూరియా 37,500మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 4,300 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4,500 మెట్రిక్‌ టన్నులు, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు 1400 మెట్రిక్‌ టన్నుల అవసరం ఉంటుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

పొలం బాట పట్టనున్న రైతాంగం..

ఇప్పటికే యాసంగి సీజన్‌ ముగియడంతో వానాకాలం సాగుకు రైతాంగం సిద్ధం అవుతున్నారు. గతేడాది సాగు చేసిన పంటలను, చేన్లల్లో ఉన్న చెత్తా..చెదారం తీసి వేయడం చదును చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే చేన్లల్లో వేసవి దుక్కులు దున్నుకోగా, మరికొందరు చేన్లను ట్రాక్టర్లతో దుక్కి దున్నిస్తున్నారు. వ్యవసాయ పనులకు పొలాలను, చేన్లను సిద్ధం చేస్తున్నారు. వర్షాలు పడితే రైతాంగమంతా పొలం బాట పట్టి బిజీగా మారనున్నారు.

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నజర్‌..

జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో వ్యవసాయ, పోలీస్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్‌ యజమానులకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ ఏడాది నిషేధిత బీటీ-3 విత్తనాలు ఎలాంటి పేరు లేకుండా పల్లెల్లో రైతులకు నేరుగా అమ్మకాలు జరగడం, టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులు పట్టుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ ఏడాది కట్టుదిట్టమైన ప్రణాళికలతో వ్యవసాయాధికారులు ముందుకు పోతున్నారు. నకిలీని అరికట్టేందుకు ప్రత్యేక నజర్‌ పెట్టారు. అయితే నకిలీ విత్తనాలు నిలువ చేసిన పలువురిపై ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి.

సలహాలు, సూచనలు పాటించాలి..

- శ్రీనివాసరావు, డీఏవో

వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ లాభాలు ఆర్జించే విధంగా రైతులు ప్రణాళికలు వేసుకోవాలి. రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రైతులకు అందుబాటులో ఏఈవోలు క్షేత్రస్థాయిలో ఉంటారు. కాబట్టి ఎలాంటి సందేహాలున్నా వారిని అడిగి తెలుసుకోవాలి.

Updated Date - 2023-05-25T22:09:40+05:30 IST