కుమరం భీం ఆసిఫాబాద్‌: అట్టహాసంగా కలెక్టరేట్‌, డీపీవో కార్యాలయాల ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-30T22:49:34+05:30 IST

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌/కాగజ్‌నగర్‌: జిల్లాకేంద్రంలో రూ.52.5కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, రూ.25.90 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాలను శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, కుమరం భీం విగ్రహం, మాజీమంత్రి కొట్నాక భీంరావు విగ్రహాలను ఆవిష్కరించారు.

కుమరం భీం ఆసిఫాబాద్‌: అట్టహాసంగా కలెక్టరేట్‌, డీపీవో కార్యాలయాల ప్రారంభం

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌/కాగజ్‌నగర్‌: జిల్లాకేంద్రంలో రూ.52.5కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, రూ.25.90 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాలను శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, కుమరం భీం విగ్రహం, మాజీమంత్రి కొట్నాక భీంరావు విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ కార్యాలయాల్లో సర్వమత ప్రార్థనలు చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌ బొర్కడే, డీపీవో కార్యాలయంలో ఎస్పీ సురేష్‌కుమార్‌ను కుర్చీలో కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో రాష్ట్రం దేశానికి తలమానికంగా మారిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు.. అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిందన్నారు. జిల్లా విభజనతో కుమరం భీం జిల్లా ఏర్పాటు చేసుకొని ఎంతో అభివృద్ధి సాధించినట్టు తెలిపారు. అనేక సంస్కరణతో ప్రజాసంక్షేమంలో ముందుకు వెళ్లుతున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ కలెక్టరేట్‌ ద్వారా ఒకే చోట అందిస్తున్నామన్నారు. అనంతరం పోడుపట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, డీజీపీ అంజన్‌కుమార్‌, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్‌ రావు, రేఖా నాయక్‌, జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు..

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రంలోని 2500మంది పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. ముగ్గురు ఎస్పీలు, పది మంది ఏఎస్పీలు, పదిమంది డీఎస్పీలు, 30మంది సీఐలు, 150మంది ఎస్సైలతోపాటు హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌, హోం గార్డులు వినియోగించి భారీ బందోబస్తు చేపట్టారు. రహదారులన్నీ డైవర్ట్‌ చేశారు. సభా స్థలం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే ఆసిఫాబాద్‌కు వచ్చే మార్గాల వద్ద తనిఖీలు నిర్వహించారు. వాహనాల నిలుపుదల కోసం పర్లాంగు దూరంలోనే పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర-హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌-ఆదిలాబాద్‌-మహారాష్ట్ర వెళ్లే ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను బైపాస్‌ ద్వారా దారి మళ్లించారు.

జన సమీకరణలో సక్సెస్‌..

సీఎం సభ కోసం సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజవకర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులను అధికంగా తరలించేందుకు సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్‌తోపాటు నాయకులు విశేషమైన కృషిచేశారు. ఉదయం 9గంటల నుంచే ఆసిఫాబాద్‌ బీఆర్‌ఎస్‌ జెండాలతో కన్పించింది. సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. సీఎం కూడా జనసందోహాన్ని చూసి ప్రసంగంలో సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా నాయకులను అభినందించారు. జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూరు, తిర్యాణి, లింగాపూర్‌, పెంచికల్‌పేట, చింతలమానేపల్లి, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని వివిధ వార్డులకు ఉదయం నుంచే తరలించారు. బస్సులను సీఎం సభకు తరలించటంతో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ వివిధ బస్టాండులో బస్సులు లేక పోవటంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు.

నిరసన సెగ..

ఐకేసీలో పనిచేస్తున్న వీవోఏలు తమను పర్మినెంటు చేయాలని సీఎం మాట్లాడుతున్న సమయంలో ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు నిరసన చేయటంతో సీఎం స్పందిస్తూ వారి సమస్యను జర చూడాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వినతిపత్రాలు తీసుకోవటంతో ఆందోళనకారులు నిరసనను విరమించారు. అలాగే సభాస్థలిలో తాగునీరు మురికిగా ఉందని పలువురు మహిళలు బాటిళ్లతో నిరసన చేపట్టారు. ఈ విషయంలో స్పందించాలని పదేపదే గోల చేశారు.

Updated Date - 2023-06-30T22:49:34+05:30 IST