Kumaram Bheem Asifabad: వాగులు దాటేదెలా?

ABN , First Publish Date - 2023-05-31T21:55:57+05:30 IST

ఆసిఫాబాద్‌, మే 31: ఆసిఫాబాద్‌ జిల్లా ఎజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణానికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే.

Kumaram Bheem Asifabad: వాగులు దాటేదెలా?

- ముంచుకొస్తున్న వానాకాలం

- ఇంకా పూర్తి కాని ప్రధాన వంతెనలు

- దశాబ్దాలు గడుస్తున్నా పూర్తవని వైనం

- ఈ ఏడాది కూడా ప్రజలకు తప్పనితిప్పలు

ఆసిఫాబాద్‌, మే 31: ఆసిఫాబాద్‌ జిల్లా ఎజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణానికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అయిదు ఎజెన్సీ మండలాలతోపాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్‌ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికీ వంతెనలు లేకపోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఇలా చిన్నాచితక కల్వర్టు మొదలుకుని భారీ వంతెనల వరకు ఏవీ పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది ప్రజానికానికి ఇక్కట్లు తప్పే పరిస్థితి లేదు. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదని వివిధ మండలాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొని ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా ఆయాగ్రామాల ప్రజలు తిప్పలు పడాల్సిందే.

ఏళ్లుగా కొనసాగుతున్న వంతెనల నిర్మాణాలు

గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు ఇప్ప టికీ కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అయా మండలాల్లోని గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలంగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కెరమెరి మండలంలోని ఉమ్రి వంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల మహారాష్ట్రలోని 12గ్రామాల ప్రజలకు రాకపోకలు వర్షాకాలంలో నిలిచి పోతాయి. అలాగే మండలంలోని అనార్‌పల్లి- కరంజివాడ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్‌-వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అసంపూర్త్తిగానే ఉంది. జైనూర్‌ మండలంలోని చింతకర్ర గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

15రోజుల్లోగా చింతకర్ర వంతెన నిర్మాణ పనులు పూర్తి..

- రాంమ్మోహన్‌రావు, ఈఈ, పంచాయతీరాజ్‌

జైనూర్‌ మండలంలోని చింతకర్ర గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణాన్ని 15రోజుల్లోగా పూర్తిచేస్తాం. ఆసిఫాబాద్‌ మండలం గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేశాం. వర్షాలు కురిసినా పనులకు అటంకం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి వంతెన నిర్మాణ పనులకు రీటెండరింగ్‌ నిర్వహించాలి.

Updated Date - 2023-05-31T22:05:34+05:30 IST