Kumaram Bheem Asifabad: జోరు వాన

ABN , First Publish Date - 2023-07-21T22:54:16+05:30 IST

బెజ్జూరు, జూలై 21: జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్‌ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలంలో కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య రెండు లోలెవల్‌ వంతెలనపై భారీగా వరదనీరు రావడంతో వాగు అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

 Kumaram Bheem Asifabad:  జోరు వాన

- చెరువులకు జలకళ

- లోలెవల్‌ వంతెనలపై పారుతున్న వరదనీరు

- పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

బెజ్జూరు, జూలై 21: జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్‌ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలంలో కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య రెండు లోలెవల్‌ వంతెలనపై భారీగా వరదనీరు రావడంతో వాగు అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సుస్మీర్‌- సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడెం, బండలగూడెం, నాగెపల్లి, చింలపల్లి, పాతసోమిని, తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగి పోయాయి. భారీవర్షాలకు చెరువులు జలకళ సంతరించుకున్నాయి.

చింతలమానేపల్లి: మండలంలోని వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. దిందా-కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గ్రామస్తులకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గూడెం ప్రాణహితనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాబాసాగర్‌, నాయకపుగూడెం వాగు, బాలాజీ అనుకోడ, రవీంద్రనగర్‌ లోలెవల్‌ వంతెనపై నీరు రావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా తహసీల్దార్‌ మష్కూర్‌ అలీ, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో సుధాకర్‌రెడ్డి, ఎస్సై విజయ్‌ ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరు కూడా చేపల వేటలకు వెళ్లరాదని సూచించారు. దిందా గ్రామస్థులు 8మంది ఊరికి పోలేని దుస్థితి ఉండడంతో తహసీల్దార్‌ మష్కూర్‌అలీ స్పందించి కేతిని ఆశ్రమ పాఠశాలలో ఆశ్రయం కల్పించి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని హాస్టల్‌ సిబ్బందికి సూచించారు. మండలకేంద్రానికి చెందిన నూకల వెంకటేష్‌, కొట్టురు కవిత, లాట్కరి పుల్లయ్య ఇళ్లలోకి నీరు చేరింది. మొకాళ్ల లోతు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో దిక్కు లేని స్థితిల్లో కుటుంబీకులు బిక్కుబిక్కు మంటున్నారు. బాధితుల నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. కొట్టురి కవిత, నూకల వెంకటేష్‌ కిరాణ దుకాణం పూర్తిగా నీటితో మునిగి పోయింది. సామాగ్రి తడిసి ముద్ద అయింది. దాదాపు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది. బాధితులు అయిల్‌ ఇంజన్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. ప్రధాన రహదారిపై రాకపోకలు కొద్దిసేపు స్తంభించాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కెరమెరి: మండలంలోని సాంగ్వీ, కేలి(కె) గ్రామాల మధ్య ఉన్న లో లెవల్‌ వంతెన నుంచి నీరు ప్రవహిచడంతో సుమారు 4 గంటల వరకు ఇందాపూర్‌, మహారాస్ట్రలోని చిక్లి, జివితి ప్రాంతా లకు రాకపోకలు నిలిచి పోయాయి. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ జమీర్‌ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలన్నారు.

దహెగాం: మండలంలో వాగులు, వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంలోని ఎస్టీ వాడలోని రాజేశ్వరి ఇంట్లోకి డ్రైనేజీ నీరుచేరింది. దహెగాం మండల కేంద్రంలోని పాత చెరువు, చింతలపాటి చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వరి పొలాలతో నిండి ప్రవహిస్తున్నాయి. దహెగాం మండలం ఖర్జి చెరువు మూడేళ్ల క్రితం మత్తడి కొట్టుకుపోయింది. మరమ్మతులకు నోచుకోక పోవడంతో వరద నీరు వృథాగా పోతోంది. పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. బొప్పూరం గిరిజన గ్రామ సమీపంలో ఒర్రె పొంగి పొర్లుతోంది.

పెంచికలపేట: మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పెద్దవాగు, ప్రాణహిత, ఉచ్చమల్లవాగు, బొక్కివాగులు మత్తడిలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం కారణంగా గ్రామాల్లో అంతర్గత రోడ్లు బురదమయంగా మారాయి. మత్స్యకారులు, సమీపగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు.

సిర్పూర్‌(యు): మండలంలో శుక్రవారం ఉదయం నుంచి వాన పడుతూనే ఉంది. మధ్యాహ్నం గంటపాటుగా ఏక దాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని దేవుడుపల్లి వాగులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవుడు పల్లి వాగు లోలెవల్‌ వంతెనపై నుంచి వరదనీరు ఉంప్పొగడంతో రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ, పోలీస్‌అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉప్పొంగుతున్న వాగులను దాటవద్దని సూచించారు.

జైనూరు: రెండురోజులుగా మండలంలో కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్గింది. ముసురు వర్షంతోపాటు, ఉదయం భారీవర్షం కురవ డంతో లేండిగూడ వాగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవంచడంతో రాకపోకలకు అంతరాయం కల్గింది. జామిని గ్రామంలో దుర్వ లక్కు ఇంటి గోడ పాక్షికంగా కూలిపోయింది.

సిర్పూర్‌(టి): మండలంలోని హుడ్కిలి, జక్కాపూర్‌, కేశవపట్నం, భూపాలపట్నం గ్రామాల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేశవపట్నం వద్ద రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. మండలకేంద్రంలోని బెస్తవాడ, మేదరివాడ కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. విషయం తెలుసు కున్న తహసీల్దార్‌ రియాజ్‌ అలీ వరద, ఇళ్లను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కౌటాల: మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని అన్ని చెరువులు, కుంటలలో వరదనీరు చేరి జలకళ సంతరించుకుంది. భారీ వర్షానికి మండలంలోని కన్నెపల్లి చెరువు మత్తడి పొంగి పొర్లుతోంది. దీంతో చెరువునీటిలో చేపల వేటకు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. కౌటాల-చింతలమానేపల్లి మండలానికి మధ్య గల చింతలపాటి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ఈ వంతెనపై నుంచి దాదాపు నాలుగు ఫీట్ల ఎత్తున వరద నీరు పారుతోంది. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఏరియాలో వరద నీరు చేరింది. ముత్తంపేట గ్రామంలో వరద నీరు చేరి రోడ్లపైకి చేరింది. బోరు బావుల వద్ద వరద నీరు చేరి వరద నీటిని తొలగించేందుకు సర్పంచ్‌ ఆధ్వర్యంలో కార్యదర్శి సాయికృష్ణ జేసీబీ సహాయంతో వరద నీటిని తొలగించారు. మండలంలోని తలోడి గ్రామంలో రాత్రి వర్షానికి గ్రామానికి చెందిన దేవమ్మ ఇల్లు కూలిపోయింది. భారీ వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల్లో పత్తి, సోయా చిక్కుడు, కంది పంటలు, మిరప నారు మడులు నీట మునిగాయి. చింతలపాటివాగు, తాటిపల్లి వార్ధా నది, తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదులను కౌటాల సీఐ సాదిక్‌ పాషా, ఎస్సై ప్రవీఫ్‌కుమార్‌ పరిశీలించి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపో యారు. వ్యాపారసంస్థలు మూసివేశారు. కాగజ్‌నగర్‌ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది.

కుమరంభీం ప్రాజెక్టు ఆరుగేట్ల ఎత్తివేత

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 21: కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టు ల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో కుమరంభీం ప్రాజెక్టు ఆరుగేట్లను ఎత్తివేశారు. కుమరంభీం ప్రాజెక్టులోకి 9738 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆరు గేట్లు ఎత్తి వేసి 9738 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్‌ అధికారులు కోరుతున్నారు. కుమరం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.150మీటర్లకు చేరుకుంది. వట్టివాగు ప్రాజెక్టులోకి 2505 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. వట్టివాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 239.5 మీటర్లు కాగా ప్రస్తుతం 235.500 మీటర్లకు చేరుకుంది.

Updated Date - 2023-07-21T22:54:16+05:30 IST