Kumaram Bheem Asifabad: తప్పని నిరీక్షణ

ABN , First Publish Date - 2023-06-23T22:12:01+05:30 IST

కాగజ్‌నగర్‌, జూన్‌ 23: మున్సిపాల్టీలోని స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం వైస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని అమలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది.

 Kumaram Bheem Asifabad:  తప్పని నిరీక్షణ

- అభయహస్తం డబ్బుల కోసం ఎదురుచూపులు

- పథకం రద్దుతో బాధితుల్లో ఆందోళన

- రూ.4లక్షలు జమ చేసిన సభ్యులు

- ఉన్నతాధికారులకు నివేదికను పంపించిన ఐకేపీ సిబ్బంది

కాగజ్‌నగర్‌, జూన్‌ 23: మున్సిపాల్టీలోని స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం వైస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని అమలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. మహిళలు జమ చేసుకున్న ప్రీమియం డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు అతీగతీలేదు. దీంతో డబ్బులు చెల్లించిన మహిళలు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో 1123మంది మహిళలు ఈ స్కీంలో చేరి రూ.4లక్షల మేర జమ చేశారు. అభయహస్తం స్కీంలో ప్రధానంగా రూ.385 చెల్లిస్తే పదవీ విరమణ వయస్సు నుంచి నెలకు రూ.500 చొప్పున పెన్షన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. పెన్షన్‌తోపాటు అకాల మరణం చెందిన కూడా ఈ స్కీంలో సభ్యత్వం పొందిన వారికి రూ.30వేలు తక్షణ ఆర్థికసాయం చేసేందుకు వీలు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయటంతో ఈ స్కీంలో చేరిన వారి డబ్బులు చెల్లిస్తామని పలుమార్లు నాయకులు, అధికారులు ప్రకటించినా ఇంతవరకు అతీగతీలేని పరిస్థితి ఏర్ప డింది. దరఖాస్తులు చేసుకున్న 1123మందిలో కొంతమంది చని పోయారు. మరి కొంతమంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గత పదిహేను రోజుల క్రితం కూడా ఈ స్కీంలోచేరిన మహిళలు మున్సిపల్‌ అధికారులకు తమ బాధను తెలియజేశారు. తాము పథకంలో జమ చేసిన డబ్బులు ఇప్పించాలని బ్యాంకు ఎకౌంటు నంబర్లు కూడా అందజేశారు. దీంతో అభయహస్తం డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంది ఈ స్కీంలో చేరారు..? ఎంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందన్న విషయాలను పూర్తి నివేదిక పంపించాలని పదిరోజుల క్రితం ఐకేపీ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక్కడి ఐకేపీ సిబ్బంది నివేధిక తయారు చేశారు. 1123 మంది మహిళలు ఈ స్కీంలో చేరినట్టు తేల్చారు. ఇందులో కూడా పెన్షన్‌ పొందిన వారి సంఖ్య 131ఉన్నట్టు తేల్చారు. అలాగే వీరందరికి రూ.4లక్షల డబ్బులు చెల్లిచాలన్న నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.

పదేళ్లుగా ఎదురుచూపులు..

అభయహస్తం పథకంలో చేరిన స్వయం సహాయక సంఘాల సభ్యులు డబ్బుల కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమ భవిష్యత్తుకు అండగా ఉంటుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ ఇంతవరకు డబ్బులు రాకపోవటంతో అంతా ఆందోళన చెందుతు న్నారు. తమకు డబ్బులు వస్తాయన్న కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు, నాయకులు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇంతవరకు సమస్య పరిష్కారం కావటం లేదని పలువురు మహిళలు పేర్కొంటున్నారు. తాము చెల్లించిన డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని అంతా కోరుతున్నారు.

నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం..

-అంజయ్య, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

అభయ హస్తం పథకం కింద గతంలో చేరిన సభ్యుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. 1123మంది మహిళలు డబ్బులు రూ.4లక్షలు జమ చేశారు. వీటిని తిరిగి వారికి చెల్లించడానికి అందరి బ్యాంకు ఎకౌంటు నంబర్లు తీసుకున్నాం. నిధులు రాగానే అందరి ఖాతాలో నేరుగా జమవుతాయి.

Updated Date - 2023-06-23T22:12:01+05:30 IST