Share News

Kumaram Bheem Asifabad: అలంకారప్రాయంగా.. రైతు వేదికలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 10:49 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌/వాంకిడి, డిసెంబరు 24: రైతు సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలను నిధుల కొరత వెంటాడుతోంది. ఈ వేదికల నిర్వహణ కొరవడి రైతులు, క్షేత్రస్థాయి అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

Kumaram Bheem Asifabad:  అలంకారప్రాయంగా.. రైతు వేదికలు

-నిధులు లేక భారంగా మారిన నిర్వహణ

-సేవలకు దూరంగా రైతు వేదికలు

కాగజ్‌నగర్‌ టౌన్‌/వాంకిడి, డిసెంబరు 24: రైతు సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలను నిధుల కొరత వెంటాడుతోంది. ఈ వేదికల నిర్వహణ కొరవడి రైతులు, క్షేత్రస్థాయి అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించేందుకు గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా క్లస్టర్‌ స్థాయిలో 2021లో ఈ రైతు వేదికల నిర్మాణ పనులు చేపట్టంది. ఇప్పటి వరకు రైతు వేదికలకు ఒక్కసారి మాత్రమే నిర్వహణకు నిధులు వచ్చాయి. రెండో దఫా నిధులు రాకపోవడంతో అవి అలంకార ప్రాయంగానే ఉంటున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలో మొత్తం 27రైతువేదికలు నిర్మించారు. కాగజ్‌నగర్‌ మండలంలోని జంబుగ, దుర్గానగర్‌, చింతగూడ, వంజిరీతో పాటు మిగిలినవి ఉన్నాయి. అయితే వీటి నిర్వహణకు నిదులు విడుదల కావడం నిలిచి దాదాపు ఏడాదిన్నర గడిచిందని అధికారులు తెలిపారు. తొలుత ప్రతీ రైతు వేదికకు నెలకు రూ.9వేలు అందించారు. ఒక్కోదానికి సుమారు రూ.15లక్షలు వెచ్చించి నిర్మించారు. వ్యవసాయ సీజన్ల సమయంలో తప్ప వీటి నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని రైతు వేదికలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. మరికొన్నింటికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. కొన్నిచోట్ల ఊరికి దూరంగా స్థలం సేకరించి ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టారు. అయితే కొన్నిచోట్ల వేదిక చుట్టూ ముళ్లపొదలు మొలవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల రైతువేదికలు రాజకీయ, ప్రభుత్వ పనులు, శిబిరాలకు వేదికలుగా మారిపో యాయని విమర్శలున్నాయి. జిల్లాలోని చాలాచోట్ల నిర్మించిన రైతువేదికల్లో కనీస సౌకర్యాలు లేక అలంకార ప్రాయంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతు వేదికల నిర్వహణపై కొత్తగా మార్గదర్శకాలు వస్తాయా...లేక ఉన్న వాటినే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి వీటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

- ఏఈవోలకు కష్టాలు..

రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈవోలు ఇబ్బంది పడుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 70 రైతువేదికలు ఉన్నాయి. ఇప్పటికే అనేక రైతు వేదికలకు వేల రూపాయల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రైతువేదికలకు అయిన ఖర్చులను ఏఈవోలు స్వంతంగా పెట్టుకుంటు వస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా..లేక ఏదైనా కొత్త విధానం అమలులోకి తీసుకువస్తుందా వేచి చూడాలి.

నిధులు విడుదల చేస్తే పునర్‌వైభవం

కొన్ని నెలలుగా రైతు వేదికలకు నిధులు రావడం లేదు. దీంతో ఏవోలు, ఏఈవోలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశుభ్రతకు రూ.3000, శిక్షణ, స్టేషనరీ, వాచ్‌మెన్‌, విద్యుత్‌ ఛార్జీలు, మరమ్మతులు, మంచినీటి వసతి కోసం నిధులు రాకపోవడంతో సౌకర్యాలు ఉండడం లేదు. గతంలో రైతుబంధు అధ్యక్షులు, రైతులు, ఏఈవోలు, వ్యవసాయాధికారులు తరచూ వెళ్లి సమవేశాలు ఏర్పాటు చేసుకునేవారు. అయితే నిర్వహణ భారంగా మారడంతో కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అనువుగా లేకుండా తయారయ్యాయి. దీంతో రైతు వేదికలు అలంకార ప్రాయంగా మారిపోయాయి.

- ప్రతిపాదనలు పంపించాము

మిలింద్‌కుమార్‌, వ్యవసాయ అధికారి - వాంకిడి

కొత్త ప్రభుత్వం జిల్లా, మండల, రైతు సమన్వయ సమితులు రద్దు చేసింది. వీటి స్థానంలో ప్రభుత్వం నూతనంగా ఏదైనా విధానం తీసుకొచ్చి మార్గదర్శకాలు జారీచేస్తే వాటిని అనుసరించి అమలు చేస్తాం. రైతువేదికల నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం వీటి నిర్వహణకు ఏఈవోలు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 10:49 PM