జేపీఎస్‌లు ముఖ్యమంత్రి మాటలను నమ్మవద్దు
ABN , First Publish Date - 2023-05-25T23:08:32+05:30 IST
జూనియర్ పంచాయతీ సెక్రట రీ (జేపీఎస్)ల సర్వీస్ క్రమబద్థీకరిస్తానన్న ముఖ్యమంత్రి మాటలను నమ్మవద్దని, జీవో వస్తేనే రెగ్యులర్ అయినట్లు భావించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు.

- రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రజలు బహిష్కరించాలి
- ప్రభుత్వ అవినీతిలో కలెక్టర్లు భాగస్వామ్యం కావొద్దు
మంచిర్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): జూనియర్ పంచాయతీ సెక్రట రీ (జేపీఎస్)ల సర్వీస్ క్రమబద్థీకరిస్తానన్న ముఖ్యమంత్రి మాటలను నమ్మవద్దని, జీవో వస్తేనే రెగ్యులర్ అయినట్లు భావించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన మంచిర్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంధ్రంలోని సీనియర్ నాయకుడు దుర్గం అశోక్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల వల్ల పంట నష్టానికి పరిహారం అన్న సీఎం ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు. ఇప్పటిదాకా జీవో కూడా విడుదల చేయలదేని ఎద్దేవా చేశారు. హోం గార్డులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మందిని తీసేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వీఏవోలతో వెట్టి చాకిరి చేయిస్తూ కేవలం 3,500 రూపాయలు వేతనం ఇస్తున్నారని అన్నారు. రేండేళ్లుగా రాష్ట్రంలోని ఉద్యోగులకు మూడు సరెండర్ లీవులు ఇవ్వడం లేదని చెప్పారు. కేసీఆర్ మోసాల చిట్ట చదివితే ఒడవదని, తన వాళ్లకు ఉన్నత ఉద్యోగాలు దక్కాలనే టీఎస్‌పీఎస్సీ కుంభకోణానికి కేసీఆర్ తెరలేపారని ఆరోపించారు. లేకేజీల గురించి సీఎంకు అంతా తెలుసునని, అందువల్లే దీనిపై మాట్లాడడం లేదని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేసీఆర్ బలవంతంగా రుద్దుతున్నారని, ప్రజలు వాటిని స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రజలతో మమేకం కావాలని బీఆర్‌ఎస్ నాయకులకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. తమ వద్దకు వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నాయకుల అవినీతి చిట్టాను రాబోయే ఐదు నెలల్లో బీఎస్పీకి అందజేయాలన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీని ఎండగట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నిరుద్యోగులకు బీఎస్పీ తరుపున ఏ హామీ ఇస్తారని ప్రశ్నించగా నిరుద్యోగ భృతిలాంటి పనికిరాని మాటలు చెప్పమని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న సీఎం హామీ నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని విమర్శించారు. సీఎం వేసే కమిటీలు కేవలం కాలయాపన కోసమేనని తెలిపారు. వాటివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏదీ లేదన్నారు. హరీష్‌రావు నేతృత్వంలో ’ధరణి’ కమిటీ వేశారని, దానివల్ల ప్రజలకు నష్టమే తప్ప, లాభం జరగలేదని అన్నారు. యూపీలోని బుల్డోజర్ పాలన మళ్లీ కేసీఆర్ హయాంలోనే జరిగిందని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్‌లో పెద్ద పెద్ద భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చారని అన్నారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న ట్లు తెలిపారు. కియా లాంటి లగ్జరీ కార్లు ఇచ్చారని జిల్లా కలెక్టర్లు కేసీఆర్ చెప్పిందల్లా చేస్తూ, అతని అవినీతిలో భాగస్వాములు కావొ ద్దని సూచించారు. సమావేశంలో సీనియర్ నేత దుర్గం అశోక్, నా యకులు జాగిరి రాజేష్, ఎస్‌ఆర్ బోస్, తిరుపతి పాల్గొన్నారు.