రైతుబంధుకు వేళాయే!
ABN , First Publish Date - 2023-06-26T01:40:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది.
పంటల సాగుకు ఎకరాన రూ.5వేలు
కొత్తగా మరో 14,207 మందికి అవకాశం
పోడు రైతులకు ఓకే.. కౌలు రైతులకు నిరాశే
తొలకరి పలకరింపుతో ఊపందుకుంటున్న సాగు పనులు
జిల్లావ్యాప్తంగా 1,63,350 రైతులకు గానూ రూ.276 కోట్ల 19 లక్షల 48వేల 859 నిధుల కేటాయింపు
ఆదిలాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవు తోంది. గత ఐదేళ్లుగా యాసంగి, వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం ఎకరాన రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈయేడు నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగా జిల్లాను తాకడంతో.. సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇప్ప టికే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసిన రైతులు సాగుబాట పడుతున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో పత్తి, సోయ, కందితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,63,350 రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించిం ది. ఇందుకు గాను రూ.276 కోట్ల 19 లక్షల 48వేల 859ల నిధులను జిల్లాకు కేటాయించింది. అయితే సోమవారం నుంచి దశల వారీగా రైతు ల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుందని ప్రభుత్వం ప్రకటించిం ది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈసారి జూన్ మాసంలోనే రైతు బంధు సొమ్మును అందివ్వడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది.
ఈసారి కొత్త వారికి అవకాశం
ప్రభుత్వం ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించడంతో జిల్లాలో 14,207 మంది రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఇయర్ కావడంతో రైతులందరికీ ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. ఇందులో 12,000 మంది పోడు రైతులు కాగా, మిగతా 2,207 మంది రైతులు ఇతర పట్టాదారులు గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం పోడు రైతులకు అవకాశం కల్పించింది. దీంతో నిరుపేద ఆదివాసీ గిరిజన రైతులకు మేలు చేకూరనుంది. ప్రభుత్వం అం దిస్తున్న నగదు సాయం సాగు పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడుతుం దని రైతులు పేర్కొంటున్నారు. అలాగే ఈనెల 30 నుంచి అర్హులైన రైతులకు పోడు పట్టాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా పట్టాలు పొందే రైతులకు రైతుబంధు సాయంపై ఇంకా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. గతంలో పోడు పట్టాలు పొందిన రైతులకు మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. దీంతో దాదాపుగా జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం కింద నగదు సాయం అందుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, గత యాసంగి సీజన్‌లో 1,49,143 మంది రైతులకు మాత్రమే రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించింది. ఈసారి మాత్రం 14వేలకు పైగా దరఖాస్తులు రావడంతో.. అందరికీ పెట్టుబడి సాయాన్ని అందిం చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అన్నదాతల సాగు సందడి
గత రెండు రోజుల క్రితమే తొలకరి వర్షాలు జిల్లాను తాకడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తం గా 5,72,000 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా నాలుగు లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట సాగవుతున్నట్లు తెలుస్తుంది. మిగతా ఎకరాలలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని సమకూర్చుకున్న రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి సాగు పనులను ప్రారంభించారు. సాధారణంగా జిల్లాలో మే చివరి మాసం నుంచే వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమవుతాయి. మే మాసంలో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తడంతో కొంతమంది రైతులు దౌర పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే నీటి వసతి లేని రైతులు వర్షాధార ఆధారంగా పంటలను సాగు చేస్తున్నారు. పోడు పట్టాల జారీ ఆలస్యం కావడంతో పంటల సాగుపై కొంత సదిగ్ధమే కనిపిస్తుంది.
తీవ్ర నిరాశలో కౌలు రైతులు
ఎట్టకేలకు పోడు పట్టాలు కలిగిన రైతులకు ఈ సారి రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నా.. కౌలు రైతుల్లో మాత్రం తీవ్ర నిరాశనే కనిపిస్తుంది. ఎలాంటి ప్రభుత్వ పథకాలకు నో చుకోవడం లేదు. రైతుబంధు, రైతుబీమా, పంటల నష్టపరిహారం, సబ్సిడీలను ప్రభుత్వం అందిస్తున్నా.. ఇతర ఏ పథకానికైనా కౌలు రైతులు నోచుకోవడం లేదు. జిల్లాలో సుమారుగా 32వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో వేల ఎకరాలను కౌలు రైతులు సాగు చేస్తున్నా.. ఎలాంటి ఆధారం లేదన్న కారణంగా ప్రభుత్వం కౌలు రైతులను పక్కన పెడుతూ వస్తుంది. ప్రమాదవశాత్తు మరణించిన కౌలు రైతులకు బీమా అవకాశం వర్తించడమే లేదు. కొందరు భూస్వాములు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారు లు తమ భూములను కౌలుకు ఇస్తూ.. అదనంగా రైతుబంధు సొమ్మును కూడా పొందుతున్నారు. అసలైన కౌలు రైతులకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని తమకు వర్తింపచేయాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరినా.. పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. కనీసం కౌలు రైతు చట్టాలనైనా పకడ్బందీగా అమలు చేసి అన్యాయం జరుగకుండా చూడాలని జిల్లాలోని కౌలు రైతులు కోరుతున్నారు.