దీక్షభగ్నం

ABN , First Publish Date - 2023-08-22T01:17:03+05:30 IST

గత ఐదు రోజుల నుంచి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి కొనసాగిస్తున్న ఆమరణ నిరాహారదీక్షను ఎట్టకేలకు పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేశారు.

దీక్షభగ్నం
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిని తరలిస్తున్న పోలీసులు

వేకువ జామునే భారీ సంఖ్యలో మోహరించిన బలగాలు

బలవంతంగా ఆసుపత్రికి తరలింపు

బెడ్‌పైనే దీక్షను కొనసాగించిన మహేశ్వర్‌రెడ్డి

భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తల పరామర్శ

ఎట్టకేలకు దీక్షను విరమింపజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

నిర్మల్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : గత ఐదు రోజుల నుంచి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి కొనసాగిస్తున్న ఆమరణ నిరాహారదీక్షను ఎట్టకేలకు పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేశారు. మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు జిల్లావ్యాప్తంగా బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు సైతం సంఘీభావం తెలిపారు. అయితే క్రమంగా మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీస్తుండడంతో ఈ దిశగా పోలీసులు పకడ్బందీగా దృష్టి సారించారు. ఆదివారం జరిగిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా మహేశ్వర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు పథకం రూపొందించారు. దీక్ష శిబిరం వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉంటున్న కారణంగా పోలీసులు తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు వేకువజామును లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భారీసంఖ్యలో పోలీసులు సోమవారం వేకువజామున మహేశ్వర్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిలోకి దూసుకువెళ్లి మహేశ్వర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీని కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్ద భైఠాయించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. కాగా మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చే వరకు తన ఆమరణ దీక్షను విరమించేదిలేదంటూ పట్టుబట్టారు. దీని కారణంగా పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అయితే మధ్యాహ్నం 2గంటల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి నిర్మల్‌కు చేరుకొని మహేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును, అలాగే మాస్టర్‌ప్లాన్‌లో జరిగిన అవినీతి అక్రమాలను మహేశ్వర్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కిషన్‌రెడ్డికి వివరించారు. అయితే మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించిన విషయాన్ని తెలుసుకున్న కిషన్‌రెడ్డి ఆయనతో మాట్లాడి దీక్ష విరమణకు ఒప్పించారు. కిషన్‌రెడ్డి సూచన మేరకు దీక్ష విరమించిన మహేశ్వర్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలతో కలిసి వీరిద్దరు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరిగిన లాఠీచార్జీలో తీవ్రం గా గాయపడిన పార్టీ కార్యకర్తలను కిషన్‌రెడ్డి పరామర్శించి ఓదా ర్చారు. పార్టీ అండగా ఉంటుందని ఓ ఒక్క కార్యకర్త అధైర్యపడవద్దని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలను బయటపెట్టి వారిపై కఠినచర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. మొత్తానికి గత ఐదు రోజుల నుంచి తీవ్రదుమారం సృష్టించిన మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

నాటకీయ ఫక్కీలో..

కాగా మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు గత రెండు, మూడు రోజుల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులతో మాట్లాడి వారిని ఒప్పించే విధంగా చూశారు. అయితే మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసే వరకు తాను ఆమరణ దీక్షను విరమించేది లేదంటూ మహేశ్వర్‌రెడ్డి మొండికేశారు. అలాగే ఈ వ్యవహారం పార్టీ శ్రేణులను ఊపునివ్వగా ప్రజల్లో తీవ్రచర్చకు దారి తీసింది. ప్రజలు, రైతుల మద్దతు రోజురోజుకూ పెరగడంతో ఈ దీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో పోలీసులు దీక్ష కారణంగా మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంపై దృష్టి పెట్టారు. సోమవారం వెకువ జామునే నాటకీయ ఫక్కీలో మహేశ్వర్‌రెడ్డిని ఇంటి నుంచి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికి వారు బలప్రయోగం చేసి ఆయనను ఆసుపత్రికి తరలించడంలో సక్సెస్‌ అయ్యారు.

పార్టీకి మంచి మైలేజీ..

కాగా అఽధికార బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలను చేపడుతున్న బీజేపీకి మాస్టర్‌ప్లాన్‌ వ్యవహారం మంచి మైలేజీని తీసుకువచ్చిందంటున్నారు. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని తన భుజాన వేసుకొని ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈ దీక్ష కారణంగా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అలాగే ప్రజల్లో గట్టి పట్టుకు దోహదపడిందంటున్నారు. వారం రోజుల పాటు రాష్ట్రస్థాయి అగ్రనేతలైన ఈటెల రాజేందర్‌, రఘునందన్‌రావు, గడ్డం వివేక్‌, కిషన్‌రెడ్డి లాంటి అగ్ర నాయకులంతా మహేశ్వర్‌రెడ్డి దీక్ష శిబిరానికి చేరుకొని ఆయనకు సంఘీభావం తెలపడం ప్రాఽధాన్యతను సంతరించుకుంది. అలాగే ఈ అగ్రనేతల పరామర్శల కారణంగా పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపిందంటున్నారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ ఆమరణ నిరాహారదీక్ష వ్యవహారం పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు.

కిషన్‌రెడ్డి రాకకు ప్రాధాన్యత

మహేశ్వర్‌ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి మొదట అంగీకరించారు. అనివార్య కారణాల వల్ల ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవడం, అలాగే నిర్మల్‌లో లాఠీచార్జీ జరగడం, మహేశ్వర్‌రెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తరలించడం లాంటి విషయాలను తెలుసుకొని ఆయన నిర్మల్‌కు మధ్యాహ్నం చేరుకున్నారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లి మహేశ్వర్‌ రెడ్డిని పరామర్శించడమే కాకుండా ఆయన చేత దీక్షను విరమింపజేశారు. కిషన్‌రెడ్డి సూచన మేరకే మహేశ్వర్‌రెడ్డి తన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కిషన్‌రెడ్డి పోలీసుల లాఠీచార్జీలో దెబ్బతిన్న కార్యకర్తలను కూడా పరామర్శించారు. మొత్తానికి కిషన్‌రెడ్డి రాకతో పార్టీకి మరింత ఊపునిచ్చినట్లయ్యిందంటున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలకు సైతం మనోఽధైర్యం పెరిగిందంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల అవకతవకలు, అక్రమాలను అస్త్రంగా చేసుకొని ముందుకు సాగేందుకు బీజేపీ సిద్ధమవుతోందంటున్నారు.

Updated Date - 2023-08-22T01:17:03+05:30 IST