రాహుల్‌ను రక్షించుకునేందుకు.. ఎంత దూరమైన వెళ్తాం..

ABN , First Publish Date - 2023-03-25T23:13:56+05:30 IST

తమ నాయకుడు రాహుల్‌ గాంధీని రక్షించుకునేందుకు పార్టీ కార్యకర్తలుగా ఎంత దూరమైన వెళ్తాం..! ఏం చేయటానికైనా తెగిస్తామని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రాహుల్‌ను రక్షించుకునేందుకు.. ఎంత దూరమైన వెళ్తాం..

ఆసిఫాబాద్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తమ నాయకుడు రాహుల్‌ గాంధీని రక్షించుకునేందుకు పార్టీ కార్యకర్తలుగా ఎంత దూరమైన వెళ్తాం..! ఏం చేయటానికైనా తెగిస్తామని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హాత్‌సేహాత్‌ జోడో పాదయాత్రలో భాగంగా పదవ రోజు శనివారం ఆయన ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టువిధానాలను వ్యతిరేకిస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌దాకా పాదాయత్ర చేసిన రాహుల్‌ గాంధీకి వచ్చిన జనాధరణను చూసి జడిసిన నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించి శిక్షపడేలా కోర్టులను కూడా ప్రభావితం చేశారని మండిపడ్డారు. అలా తీర్పు వెలువడగానే లోక్‌సభ నుంచి రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవటం రాజ్యంగా స్ఫూర్తికి విరుద్ధమన్నారు. 30 రోజుల్లోగా పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని విస్మరించి ఇలా నిర్ణయం తీసుకోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు అన్నారు. రాహుల్‌గాంధీని రక్షించుకునేందుకు ఏఐసీసీ నిర్ణయించే కార్యచరణకు అనుగుణంగా తమ రాష్ట్ర నాయకత్వం పని చేస్తుందన్నారు. ఏఐసీసీ కార్యచరణకు అనుగుణంగానే తన పాదయాత్ర కొనసాగించాలా? వద్దా అనేది నిర్ణయించుకుంటానన్నారు. విభేదాలను పక్కన పెట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అన్ని విపక్షాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల ఆశలను ఈ ప్రభుత్వం నీరు గార్చిందన్నారు. ఇది ప్రశ్నించిన వారిని సిట్‌ కార్యాలయాలకు పిలిపించి వేధించటం ఏంటనీ ప్రశ్నించారు. లీకేజీకి కారకులైన ప్రభుత్వ పెద్దలు, అధికారులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ప్రశ్నించిన వారిపై దాడులకు దిగటం నియంత్రతృత్వానికి పరాకాష్ట అన్నారు. భూములకు సంబంధించి గత ప్రభుత్వాలు దున్నేవాడికే భూమి అంటే ధరణి పేరుతో ఆ భూములను తిరిగి లాక్కొని మళ్లీ భూస్వాములకే కట్టబెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ప్రకటన అంశంపై వస్తున్న వార్తాలకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తమ పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా సెలక్షన్‌ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అవుతుందని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కూడా సమయం, సందర్భం వంటి అన్ని అంశాలను పరిశీలించాకే వ్యూహాత్మకంగా ప్రకటిస్తామన్నారు. తాను గతపది రోజులుగా చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి ఎన్నో సమస్యలు గుర్తించానని ఇందులో ప్రధానంగా అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు గిరిజనులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. అలాగే భూమి హక్కుల విషయంలోనూ గిరిజనేతర రైతుల నుంచి కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రిజర్వేషన్‌ విషయంలో మాలీలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో ఆ సామాజక వర్గ ప్రజలు తమకు వివరించినట్టు తెలిపారు. అలాగే జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్‌ నిర్మించిన కుమరం భీం ప్రాజెక్టుకు ఒక్కపైసా ఇవ్వలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో భూ సంబంధిత సమస్యలు జిల్లాకు సంబంధించిన కీలకఅంశాలను చేర్చేందుకు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ గణేష్‌ రాథోడ్‌, మర్సుకోల సరస్వతీ తదితరులున్నారు.

Updated Date - 2023-03-25T23:13:56+05:30 IST