సమస్యల వలయంలో సర్కారు దవాఖానా

ABN , First Publish Date - 2023-09-22T22:24:40+05:30 IST

సర్కారు దవాఖానాలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పెచ్చులూడి పడుతున్న స్లాబ్‌, దుర్వాసన, ఇరుకు గదులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ, గర్భిణులు, బాలింతలు, పిల్లలు వారి సహాయకులతో కిటకిటలాడుతోంది. బెడ్స్‌ సరిపోకపోవడంతో వరండాలో తాత్కాలిక మంచాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై ఫోకస్‌...

సమస్యల వలయంలో సర్కారు దవాఖానా

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 22: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలు తిష్టవేశాయి. తరుచూ పారిశుధ్య సమస్యలు, వర్షం నీరు వార్డుల్లోకి రావడం, మందులు తడిసిపోవడం, భవనం స్లాబ్‌ పెచ్చులూడి కింద పడడం, అపరిశుభ్రతతో దర్శనమిస్తోంది. ప్రసవానికి వచ్చిన గర్భిణులు, వారి బంధువులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి రోడ్డులోని మాతా శిశు ఆసుపత్రిలోకి నీరు రావడంతో మరో మార్గం లేక గర్భిణీలు, బాలింతలు, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి రోగులు, వారి బంధువులతో నిండిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరుకైన గదులు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గర్భిణీలు, బాలింతలకు చికిత్సలు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

-పెచ్చులూడుతున్న భవనం

నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో ఆసుపత్రికి తరుచూ మరమ్మతు చేస్తూ నెట్టుకొస్తున్నారు. మరమ్మతుల్లో జాప్యం, నిర్లక్ష్యం కారణంగా పనుల్లో నాణ్యత లోపించడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల రెండో అంతస్తులోని పిల్లల వార్డులో స్లాబ్‌ పెచ్చులూడి కింద పడడంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అధికారులు పరిశీలించి మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. అరకొర సౌకర్యాల మధ్య చికిత్సలు అందిస్తున్నారు.

-ఎంసీహెచ్‌ మూసివేతతో గర్భిణీలకు ఇబ్బందులు

గోదావరి రోడ్డులో నిర్మించిన ఎంసీహెచ్‌కు భారీ వర్షాలు కురిస్తే నీరు చేరుతోంది. జూలై నెలలో కురిసిన వర్షాలకు భవనం చుట్టూ వరద నీరు చేరడంతో గర్భిణీలు, బాలింతలు, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలం లేక కిటకిటలాడుతోంది. వరం డాలోనే బాలింతలు, గర్భిణీలకు చికిత్సలు అందిస్తున్నారు. మరో చోట ఎంసీహెచ్‌ నిర్మించి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని ప్రజాప్రతినిధులు, ప్రజలు పేర్కొంటున్నారు.

-ఇరుకు గదులు, పార్కింగ్‌ సమస్యలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కుమరంభీం ఆసిఫాబాద్‌, మహారాష్ట్ర సరిహద్దుతోపాటు జిల్లా నలుమూలల నుంచి చికిత్సల కోసం ప్రజలు వస్తుంటారు. ఆసుపత్రిలో ఇరుకు గదులు, వాహనాలు పార్కింగ్‌ చేయ డానికి తగిన స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇక్కడే చికిత్స అందించడంతో రద్దీ ఏర్పడుతోంది.

-పారిశుధ్య లోపంతో దుర్గంధం

ప్రధాన రహదారికి ప్రభుత్వ ఆసుపత్రి దిగువకు ఉండడం, ఆసుపత్రి పక్కనే డ్రైనేజీ ఉండడంతో వర్షం నీరంతా ఆసుపత్రిలోకి చేరుతుంది. భారీ వర్షాలు పడినప్పుడు ఈ సమస్య తీవ్రమవుతోంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా నీరు వార్డుల్లో చేరుతుంది. ఆసుపత్రిలో మూత్ర శాలల నిర్వహణ సరిగ్గా లేక దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో రోగులు, ఆసుపత్రికి వచ్చే వారు దుర్వాసన భరించలేక పోతున్నారు. అపరిశుభ్రత, దుర్వాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-భవనంపై సామర్ధ్యానికి మించి నీటి ట్యాంకులు

ప్రభుత్వ ఆసుపత్రి భవనంపై సామర్ధ్యానికి మించి 12 నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఐదు బోర్లతో 12 ట్యాంకులకు నింపుతున్నారు. భవనంపై ఎక్కువ ట్యాంకులు ఉండడం ఏ ట్యాంకులో నీరు ఖాళీ అవుతుందో తెలియక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రోగులు తమ వార్డుల్లో నీరు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. సిబ్బంది ఏ ట్యాంకులో నీరు రావడం లేదో తెలుసుకోవడం కష్టతరంగా మారింది.

- రోగుల సహాయకులతో తరుచూ గొడవలు

రోగులతో వచ్చే సహాయకులు, వైద్య సిబ్బంది మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక్కో రోగి వెంట ఐదు గురు సహాయకులు వస్తున్నారని సిబ్బంది పేర్కొంటుండగా తాము ఉండడానికి స్థలం లేదని సహాయకులు అంటున్నారు. రోగుల వెంట వచ్చే వారు గోడలపై ఉమ్మివేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారని సిబ్బంది పేర్కొంటున్నారు. రోగుల సహాయకులకు ప్రత్యేకమైన హాల్‌ కేటాయించాలని కోరుతున్నారు.

-పెరిగిన ప్రసవాలు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 1వ తేదీ నుంచి శుక్రవారం వరకు 278 మంది గర్భిణీలు ప్రసవించారు. ఇందులో 185 ఆపరేషన్‌లు, 93 మందికి నార్మల్‌ డెలివరీ అయ్యాయి. డెలివరీ అయిన మహిళలు, వారి సహాయకులతో కిక్కిరిసి పోతుంది. డెలివరీ అనంతరం బెడ్లు సరిపోకపోవడంతో నవారు మంచాలను బాలింతలకు కేటాయించారు. అన్ని వార్డుల్లో రోగులకు వరండాల్లో మంచాలను కేటాయిస్తున్నారు. దీంతో రోగుల సహాయకులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

అంతంతమాత్రంగా సౌకర్యాలు

- రమేష్‌, కాసిపేట

నా భార్యను డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాను. రెండు రోజుల క్రితం డెలివరీ అయ్యింది. డెలివరీ అనంతరం వార్డులోకి మార్చగా వార్డు అంతా ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ కనీసం తాగడానికి నీరు కూడా లేదు. ఆసుపత్రిలో కూర్చోవడానికి స్థలం లేకపోవడంతోపాటు దుర్వాసన భరించలేకపోతున్నాం. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచడం లేదు. డ్రెస్సింగ్‌ చేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు.

-బెడ్లు లేక మంచం ఇచ్చారు

- వర్షిత, బెల్లంపల్లి

అనారోగ్యంతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. బెడ్లు లేకపోవడంతో వరండాలో మంచం వేసి చికిత్స అందిస్తు న్నారు. దీంతో ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకునే స్ధోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.

- జాగ్రత్తలు తీసుకుంటున్నాం

- హరిశ్చందర్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌,

ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వర్షాలు పడినప్పుడు ఎంసీహెచ్‌లోని బాలింతలు, గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. దీంతో ఆసుపత్రిలో రద్దీ పెరిగింది. ఆసుపత్రి భవనంలోని కొన్ని వార్డుల్లో స్లాబ్‌ పెచ్చులూడుతుంది. దీంతో మరమ్మతు చేపట్టాం. రానున్న రోజుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. వర్షం నీరు ఆసుపత్రిలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎంసీహెచ్‌ భవనంలో సేవలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరిస్థితులను ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ నివేదికలు అందిస్తున్నాం.

Updated Date - 2023-09-22T22:24:40+05:30 IST