బాలికలు అన్నిరంగాల్లో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2023-01-25T01:41:17+05:30 IST

బాలికలు అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని, తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నతమైన చదువులు చదివి గొప్ప పదవులు అధిరోహించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

బాలికలు అన్నిరంగాల్లో ముందుకెళ్లాలి
బ్రోచర్‌ ను ఆవిష్కరిస్తున్న మంత్రులు

నిర్మల్‌ చైన్‌గేట్‌, జనవరి 24 : బాలికలు అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని, తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నతమైన చదువులు చదివి గొప్ప పదవులు అధిరోహించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించి బేటీబచావో - బేటీపడావో అవగాహన, సంతకాల సేకరణ కార్య క్రమంలో మంత్రులు పాల్గొని సంతకాలు చేశారు. అనంతరం బ్రోచర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... బాలికలందరూ తమ చదువు మీద శ్రద్ధ పెట్టి చదడం ద్వారా తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందాలని చెప్పారు. ఆడపిల్లలకు ప్రభుత్వపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రెగ్యులర్‌ పీడీని నియమించాలని మంత్రి సత్యవతికి వినతి

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 24 : నిర్మల్‌ జిల్లాలో ఐసీడీఎస్‌ పీడీ బాధ్యతలు ఇంచార్జి నిర్వహిస్తున్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు నాయకులు ఆమెను కలిసి పర్మినెంట్‌ పీడీ నియామకానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఇంచార్జి పీడీ అందుబాటులో ఉండకపోవడంతో ఏ పనులు జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు బాణావత్‌ గోవింద్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి జాదవ్‌ అశోక్‌ నాయక్‌తో పాటు సంఘ నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలోని ఆలయాలన్నీ అభివృద్ధి జరిగాయి

సారంగాపూర్‌, జనవరి 24 : నిర్మల్‌ జిల్లాలో ఆలయాలన్ని అభివృద్ధి జరిగాయని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బీరవెల్లిలో భూలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో వేద పండితులు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆలయ నిర్మాణ పనుల కు పురాతన ఆలయ మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో నూతన ఆలయాల నిర్మాణాలు జరగడంతో పాటు పురాతన ఆలయాల మరమ్మతుల పను లు జరిగాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి అల్లోల సోదరుడు అల్లోల మురళీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రిని పద్మశాలి సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక రమణ, సొసైటీ చైర్మన్‌ మాణిక్‌రెడ్డి, అడెల్లి దేవాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఐటీచందు, సర్పంచ్‌రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:41:18+05:30 IST