ఫీజుల పేరుతో దోపిడీ
ABN , First Publish Date - 2023-09-08T22:35:23+05:30 IST
జిల్లాలో ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీల ఆగ డాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. అడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులకు కల్లబొల్లి మాటలు చెప్పి కళాశాల నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలో రకరకాల ఫీజుల పేర్లు చెప్పి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.
ఏసీసీ, సెప్టెంబరు 8: జిల్లాలో ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీల ఆగ డాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. అడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులకు కల్లబొల్లి మాటలు చెప్పి కళాశాల నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలో రకరకాల ఫీజుల పేర్లు చెప్పి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఇంటర్‌లో స్కాలర్‌షిప్, డిగ్రీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకుని చదువు చెబుతామని హామీ ఇచ్చి అనంతరం ఫీజులు చెల్లిం చాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనందున కాలేజీలు ఇష్టారీతిన వ్యవహరిస్తు న్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో సీటు పొంది అడ్మిషన్ గడువు దగ్గరపడుతుండగా కళాశాల సర్టిఫికెట్‌లు ఇవ్వక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇంజనీరింగ్ సీటు పొందిన విద్యార్థికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం సర్టిఫి కెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ రోడ్డులోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించడంతో సమస్య పరిష్కార మైంది. ఇలా వెలుగులోకి రాకుండా వేధింపులు, ఇబ్బందులకు గురవుతున్నా సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
-ఇంటర్, డిగ్రీ కాలేజీల ఫీజుల దోపిడీ
జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రైవేటు జూనియర్ కళాశాలలు 20 ఉన్నాయి. వీటిలో నాలుగు ఒకేషనల్ కళాశాలలు కాగా 16 రెగ్యులర్ కళాశాలలు. ఇంటర్‌లో ఏడాదికి రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా బస్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ సమయంలో ఫీజులు చెల్లించాల్సిన అవస రం లేదని, ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాలకు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. విద్యార్థి కళాశాల వదిలి వెళ్లేటప్పుడు టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాము చెప్పినంత ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని వేధిస్తున్నారు.
ఫ అడ్మిషన్ సమయంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు ఇంటర్ కళాశాలల సిబ్బంది మాయమాటలు చెప్పి అడ్మిషన్ చేసుకుంటున్నారు. చదువు పూర్తయిన అనంతరం సర్టిఫికెట్ల కోసం ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు ఒక అడుగు ముందుకు వేసి దూరప్రాంతాల విద్యార్థులు కాలేజీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లలో ఉండాలని వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
- కాలేజీ మారితే అదనపు ఫీజులు వసూలు
మధ్యలో కాలేజీ మారాలనుకునే విద్యార్థులకు వేధింపులు తప్పడం లేదు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరం, డిగ్రీ కూడా తమ కళాశాలలోనే చదవాలని ఒత్తిడి తెస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో వేరే కాలేజీకి వెళ్లాలనుకుంటే అడ్డగోలు ఫీజుల భారం మోపుతున్నారు. స్కాలర్‌షిప్ వచ్చే వరకు టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
-కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం
విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించంలో ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, కళాశాలలు అశ్రద్ధ వహిస్తున్నాయి. ఇరుకు గదుల్లో తరగతుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోకుండా అపార్టుమెంట్‌లలో కళాశాలల ఏర్పాటు, ఆట స్థలం, తగినన్నీ టాయిలెట్లు ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల మూడు, నాలుగు ఫ్లోర్‌ల భవనాలు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్‌లు ఏర్పాటు చేయడం లేదు. అర్హత లేని బోధన సిబ్బందితో తరగతుల నిర్వహణ చేస్తున్నారు.
-పట్టించుకోని అధికారులు
ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఫీజుల దోపిడికి పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై నియంత్రణ విధించి అక్రమాలకు పాల్పడుతున్న వాటి అనుమతులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వారు అడిగినంత చెల్లించాల్సిందే
- శ్రీరామోజు రాజేశ్వర్‌రావు, విద్యార్థి తండ్రి, మంచిర్యాల
ప్రైవేటు కళాశాల యాజమాన్యం చెప్పిన ఫీజు చెల్లించాల్సిందే. పోలీస్‌స్టేషన్, కోర్టుకు వెళ్లినా తమకు ఏం జరగదని, ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం రూ. 15 వేలు, ద్వితీయ రూ. 20 వేలు వసూలు చేసి అదనంగా రూ.5 వేలు చెల్లించాలని అడిగారు. డిగ్రీ కూడా వారి కళాశాలలోనే చదివితే రూ.5 వేలు మాఫీ చేస్తామని, లేని పక్షంలో బస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. చేసేదేం లేక చెప్పినంత చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నాను.
నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు
-డీఐఈవో శైలజ
ప్రైవేటు కళాశాలలు ఇంటర్ పూర్తయిన విద్యార్థులను డిగ్రీ తమ కళాశాలల్లో చదవాలని ఒత్తిడి చేయవద్దని సూచించాం. విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల సమయంలో ప్రైవేటు కాలేజీలు చెప్పే హామీలను నమ్మి మోసపోవద్దు. స్కాలర్‌షిప్‌తో కళాశాలలు నడపడం అసాధ్యం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రైవేటు మోజులో పడి ఇబ్బందులు పడవద్దు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటాం.