సాలేగూడలో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2023-04-03T00:32:43+05:30 IST

మండలంలోని తేజాపూర్‌ గ్రామ పంచాయతీ పరిదిలోని సాలేగూడ గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. మిషన్‌ భగీరథ నీళ్లు సరిగ్గా సరఫరా కావడం లేదు.

సాలేగూడలో తాగునీటి కష్టాలు
సాలేగూడలో బోరుబావి వద్ద ట్యాంకుల్లో నీళ్లు నింపుతున్న దృశ్యం

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 2: మండలంలోని తేజాపూర్‌ గ్రామ పంచాయతీ పరిదిలోని సాలేగూడ గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. మిషన్‌ భగీరథ నీళ్లు సరిగ్గా సరఫరా కావడం లేదు. దీంతో ఈ గ్రామాల ప్రజలు తాగునీటికి తహతహలాడుతున్నారు. సమీపంలోని వ్యవసాయ బోరుబావి నీటిని తీసుకువచ్చి తాగాల్సి వస్తుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై స్థానిక మిషన్‌ భగీరథ శాఖ ఎఈ దృష్ఠికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి మిషన్‌ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

తాగునీటి కోసం గిరిజనుల అవస్థలు

ఉట్నూర్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం అని చెప్పుకుంటున్న మిషన్‌ భగీరథ పథకం అధికారుల అలసత్వం వల్ల ప్రహసనంగా మారడంతో గిరిజన గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. ఉట్నూర్‌ మండలంలోని చింతకర్ర, మోతిగూడ, శివగూడ, మల్కుగూడ గ్రామాలను కాంగ్రెస్‌ నాయకులు పుర్కబాపురావు, జాదవ్‌ సునిల్‌నాయక్‌లు ఆదివారం సందర్శించి గిరిజనుల మంచినీటి అవస్థలను తెలుసుకున్నారు. లక్షలాది రూపాయలతో ట్యాంకు నిర్మించిన కాలువల పనులు సక్రమంగా చేయలేదని ఫలితంగా ఇండ్ల ముందు వేసిన నల్లాలకు నీరు రావడం లేదని ఆరోపించారు. ఇంటింటికి నల్లా నీరు ఇస్తున్నామని ప్రగల్భాలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గిరిజనులు ఎదుర్కొంటున్న మంచినీటి అవస్థలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ పని చేయక పోవడంతో వ్యవసాయ బావుల నీరు సేకరించి తాగుతున్నామని అన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక పోవడంతో ప్రతి యేటా వర్షాకాలంలో కూడ అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామని గిరిజన గ్రామాల పటేళ్లు మరప లచ్చు, లక్ష్మణ్‌, అర్కదేవ్‌రావు, కుడిమెత గోదిరావులు వివరించారు. వీరి వెంట సర్పంచ్‌ పెందూర్‌ రఘునాథ్‌, మహ్మద్‌ సీరాజోద్దిన్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-04-03T00:32:43+05:30 IST