పట్టణ ప్రగతితో అభివృద్ధికి బాసట
ABN , First Publish Date - 2023-06-16T22:10:01+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బెల్లంపల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పద్మశాలి భవన్‌లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు.
బెల్లంపల్లి, జూన్ 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బెల్లంపల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పద్మశాలి భవన్‌లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అధికా రులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. పోచమ్మ చెరువును రూ.3 కోట్లతో అభివృద్ధి చేసి ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెంట్రల్ లైటింగ్, రూ.4 కోట్లతో వైకుంఠధామాలు నిర్మించి నీటి వసతి కల్పించామన్నారు. వంద పడకల ఆసుపత్రితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. సింగరేణి భూములకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకువెళ్లి పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పట్టాల కోసం దరఖాస్తు చేసుకోని వారు నెలాఖరులోగా చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. పలువురు ఉద్యోగులను ఎమ్మెల్యే, కలెక్టర్ సన్మానించారు. మహిళ సంఘాల గ్రూపులకు చెక్కులు, పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, ఆర్డీవో శ్యామలదేవి, సీడీపీవో ఉమా దేవి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఏసీసీ: జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి వేడుకలను నిర్వహించారు. మున్సి పల్ కార్యాలయం నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ, మానవహారం నిర్వ హించారు. ప్రైవేటు పంక్షన్‌హాలులో నిర్వహించిన సమావేశంలో అదనపు కలె క్టర్ రాహుల్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ మారుతి ప్రసాద్‌లు మాట్లాడారు. 9 ఏండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలు అద్భుత ప్రగతి సాధించాయని తెలిపారు. పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్‌జిమ్‌లు, రోడ్లు, డ్రైనేజీలు, వీధీ దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ సేవల్లో మార్పులు చేసి తక్కువ సమ యంలో ఇంటి పర్మిషన్, ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నామన్నారు. అనం తరం మున్సిపల్ సిబ్బందిని సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. దశాబ్ది ఉత్సవాల వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న గుండేటి యోగేశ్వర్‌ను సన్మా నించి మెమోంటో అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.