రంగంలోకి నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌

ABN , First Publish Date - 2023-06-11T01:07:00+05:30 IST

జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల కళ్లు గప్పి నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ కోరలు చాస్తోంది.

రంగంలోకి నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌
నిర్మల్‌లో ఎరువుల షాపులో స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

గుజరాత్‌ నుంచి జిల్లాకు తరలింపు

భైంసా కేంద్రంగా భారీ దందా

రైతు టార్గెట్‌గా అక్రమ దందా

నిర్మల్‌, జూన్‌ 10 (ఆంరఽధజ్యోతి) : జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల కళ్లు గప్పి నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ కోరలు చాస్తోంది. గుజరాత్‌ నుంచి జిల్లాకు నిషేధిత బీజీ-3 అలాగే నకిలీ పత్తి విత్తనాలను పెద్దఎత్తున చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితం మేడ్చల్‌ జిల్లాలో పట్టుబడిన నకిలీపత్తి విత్తనాల రాకెట్‌ వ్యవహారం అక్ర మాల గుట్టు రట్టు చేసింది. భైంసాకు చెందిన ఓ విత్తన వ్యాపారి ఈ నకిలీదందాకు అసలు సూత్రధారిగా వెల్లడైంది. భైంసా వ్యాపారితో పాటు మంచిర్యాల ప్రాంతానికి చెందిన మరో నలుగురు ఈ నకిలీ విత్తనాల రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు తేలింది. వీరంతా గుజరాత్‌ రాష్ట్రంలో తయారయ్యే నకిలీ పత్తి విత్తనాలను అలాగే నిషేదిత బీజీ-3 విత్తనాలను నేరుగా మేడ్చల్‌కు తీసుకువచ్చి అక్కడి ఓ గోదాంలో భద్రపరుస్తున్నారు. అక్కడి నుంచి ఈ విత్తనాలను భైంసాకు తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. భైంసా కేంద్రంగా ఈ సారి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాల దందాను కొనసాగించేందుకు వీరంతా ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భైంసా కేంద్రంగా నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌తో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలకు కూడా ఈ విత్తనాలను చేరవేసేందుకు ఈ సిండికేట్‌ ఇప్పటికే రంగం సిద్ధం చేసిందంటున్నారు. కాగా ఈ దందాను పథకం ప్రకారం కొనసాగిస్తున్న సదరు విత్తన వ్యాపారి ఇటు వ్యవసాయాధికారులు అటు పోలీసులతో ఏర్పడ్డ టాస్క్‌ఫోర్స్‌ను సైతం బురిడి కొట్టించేందు కోసం పథక రచన చేశాడంటున్నారు. మేడ్చల్‌లోని గోదాంలోనే నిషేధిత బీజీ-3 అలాగే నకిలీ విత్తనాలను బ్రాండెడ్‌ ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి అక్కడి నుంచి భైంసాకు తరలించే ప్రయత్నాలు చేశాడని సమాచారం. ఎవరికీ అనుమానం రాకుం డా అసలీ ఈ బ్రాండెడ్‌ పత్తి విత్తనాలను పోలిన విధంగా నకిలీ ప్యాకేట్లను తయారు చేసి విక్రయాలు చేసేందుకు రంగం సిద్ధం చేశారంటున్నారు. అయితే మేడ్చల్‌లో సైబారాబాద్‌ పోలీసులు ఈ నకిలీ విత్తనాల రాకెట్‌ ముఠాగుట్టును రట్టు చేయడంతో ఐదారు జిల్లాల పత్తి రైతులు భారీ మోసం నుంచి బయట పడగలిగారంటున్నారు. అయితే ఈ ముఠా సభ్యులు గుజరాత్‌ నుంచి ఇప్పటికే పలుసార్లు నకిలీ విత్తనాలను జిల్లాకు తరలించారన్న కోణంతో కూడా విచారణ జరుగుతోంది. వ్యవసాయాధికారులు మాత్రం నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లైసెన్సుడు దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలంటూ సూచిస్తున్నారు.

భైంసా కేంద్రంగా దందా

ఇదిలా ఉండగా జిల్లాలోని భైంసా కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం జరిగే అవకాశాలున్నట్లు మొదటి నుంచి ప్రచారం ఉంది. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతానికి చెందిన ఓ విత్తనాల వ్యాపారి గుజరాత్‌ నుంచి నకిలీ విత్తనాలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడడంతో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం నిజమేనని నిరూపణ అవుతోంది. భైంసాకు చెందిన విత్తన వ్యాపారి మంచిర్యాల, మందమర్రి ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి ఈ నకిలీ విత్తనాల రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. అయితే సదరు నకిలీ విత్తనాల వ్యాపారి ఇప్పటికే భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు నకిలీ విత్తనాలను చేరవేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టాస్క్‌ఫోర్సు బృందాల కళ్లు గప్పి

భైంసాకు చెందిన సదరు పత్తి వ్యాపారి ఇక్కడి టాస్క్‌ఫోర్సు బృం దాలను బురిడి కొట్టించే రీతిలో నకిలీ విత్తనాల దందాను కొనసాగిస్తున్నారంటున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్సు బృందాలు నకిలీ విత్తనాలు, పురుగు మందులపై నిఘా పెట్టాయి. అలాగే విస్తృతంగా తనిఖీలులు కూడా కొనసాగిస్తున్నాయి. సరిహద్దుల్లో కూడా నిఘా ఏర్పాటు చేశాయి. అయితే భైంసాకు చెందిన విత్తన వ్యాపారి ఈ టాస్క్‌ఫోర్సు బృందాల కళ్లు గప్పి గుజరాత్‌ నుంచి మేడ్చల్‌ మీదుగా భైంసాకు నకిలీ విత్తనాలను తీసుకువచ్చేందు కోసం రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. ఇప్పటికే పలుసార్లు ఈయన నకిలీ విత్తనాలను జిల్లాకు తరలించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సదరు విత్తన వ్యాపారి ఇతర ప్రాంతాల వ్యక్తులతో కలిసి తన అక్రమదందాను విస్తరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు ఆ విత్తనాలు నాణ్యమైనవి కావాననే అంశాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందంటున్నారు.

భారీ మొత్తంలో నకిలీల పట్టివేత

కాగా గుజరాత్‌ నుంచి భైంసాకు తరలిస్తున్న పత్తి విత్తనాలు భారీ మొత్తంలో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 3.35 టన్నుల నకిలీ విత్తనాలు అలాగే దాదాపు 15వేల ఖాళీపౌచ్‌లు పోలీసుల దాడిలో పట్టుబడ్డాయంటే ఈ నకిలీ రాకెట్‌ విత్తన వ్యాపారుల హస్తం ఏ మేరకు విస్తరించిందో తేటతేల్లమవుతోందంటున్నారు. కాగా ఇప్పటికే జిల్లాకు కూడా పెద్దమొత్తంలోనే ఈ నకిలీ పత్తి విత్తనాలు తరలించారన్న విమర్శలున్నాయి. నకిలీ విత్తన వ్యాపారులు గుజరాత్‌ నుంచి తరలించిన విత్తనాలను రహస్యగోదాంలో భద్రపరుస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ గోదాంల నుంచి అమాయక రైతులకు విత్తనాలను విక్రయించేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్దమైందంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి విత్తనాలకు భారీగా డిమాండ్‌ ఉన్న కారణంగా అసలు విత్తనాల పేరిట నకిలీలను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచా రం జరుగుతోంది.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లా, మండలస్థాయిలో పోలీసుశాఖ, వ్యవసాయశాఖ అధికారులలో కలిసి టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేశాం. ఎరువుల విత్తనాల దుకాణాలను నిరంతరంగా తనిఖీలు చేస్తున్నాం. నకిలీ విత్తనాల పట్ల రైతులకు రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. రైతులు నకిలీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్సుడు దుకాణాల్లోనే విత్తనాలను కొనుగో లు చేయాలి.

Updated Date - 2023-06-11T01:07:00+05:30 IST