జాతర కోసం శాశ్వత షెడ్ల నిర్మాణం చేపడతాం
ABN , First Publish Date - 2023-01-22T22:35:21+05:30 IST
మండలంలోని కుర్రెఘడ్ పహాండికూపర్ లింగు స్వామి జాతరలో రూ.10 లక్షలతో శాశ్వత షెడ్ల నిర్మాణం, రూ. 1.60 కోట్లతో రహదారి సౌకర్యం కల్పించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
కాసిపేట, జనవరి 22 : మండలంలోని కుర్రెఘడ్ పహాండికూపర్ లింగు స్వామి జాతరలో రూ.10 లక్షలతో శాశ్వత షెడ్ల నిర్మాణం, రూ. 1.60 కోట్లతో రహదారి సౌకర్యం కల్పించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం కుర్రెఘడ్‌లో ప్రారంభమైన పహాండికూపర్ లింగుస్వామి జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర దర్బార్‌లో ఆయన మాట్లాడారు. షెడ్ల నిర్మాణంతో పాటు లక్ష్మీపూర్ ప్రధాన రహదారి నుంచి జాతర ప్రాంతం వరకు రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయలు కల్పిస్తామన్నారు. గిరిజన సంప్రదాయాలతో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్న ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వహణ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
పది ఇండ్లకు భూమి పూజ
లక్ష్మీపూర్ కొలాంగూడలో ఐటీడీఏ చేపడుతున్న పది ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చిన్నయ్య ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వం గిరిజనుల కోసం పక్కా ఇండ్ల గృహ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తుందని, ఇందులో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరైన పది ఇండ్లకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. గిరిజనుల్లో నెలకొన్న పౌష్టికాహార లోపం వల్ల మృత్యువాత పడుతున్నారని, వీటిని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు.
లబ్ధిదారులకు బీమా చెక్కుల పంపిణీ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చిన్నయ్య ఆదివారం బీమా చెక్కులను అందజేశారు. రొట్టెపల్లికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త పోగుల శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా రూ. 2 లక్షల చెక్కును పార్టీ తరుపున అందించారు. మల్కేపల్లికి చెందిన ఆడె సోము మృతిచెందగా రూ. 2 లక్షల చెక్కును అందించారు. కార్యకర్తలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్‌రావు, వెంకటాపూర్ సర్పంచు ఆడె సౌందర్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.